జగనన్నకు ‘మూడొ’చ్చింది!

– జగన్ క్యాబినెట్‌లో మూడేదెవరికి?
– తమ్మినేని, తోట త్రిమూర్తులు, నల్లపురెడ్డి, బాలినేని, కొడాలి నాని, కావూరు శ్రీనివాస్, మల్లాది విష్ణు కు చాన్స్?
– వనిత, చెల్లుబోయిన, దాడిశెట్టి, గుమ్మనూరు జయరాం, నారాయణస్వామి, అప్పలరాజు, మేరుగ నాగార్జున అవుట్?
– విడదల రజనీ, ఉషాచరణ్, కాకాణి పనితీరుపైనా అసంతృప్తి?
– తమ్మినేనికి హోం శాఖ ఇచ్చే అవకాశం?
– పనితీరు ప్రాతిపదికన సీఎం జగన్ నిర్ణయాలు
– 3వ తేదీన తేలిపోనున్న సిట్టింగులకు సీట్లు
– వైసీపీ సిట్టింగుల్లో అ‘టెన్షన్’
( మార్తి సుబ్రహ్మణ్యం)

నాలుగు ఎమ్మెల్సీల పరాజయంతో గుణపాఠం నేర్చుకున్న వైసీపీ అధినేత-ఏపీ సీఎం జగన్, వచ్చే ఎన్నికలకు సమర్ధులైన టీమ్‌ను తయారుచేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆ మేరకు క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. శాఖాపరమైన వ్యవహారాలతోపాటు, జిల్లాల్లో సమన్వయం చేసుకోవడంలో విఫలమైన మంత్రులను తొలగించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈసారి క్యాబినెట్‌లో ఇప్పటివరకూ ప్రాతినిధ్యం లభించని కులాలకు అవకాశం ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సమర్ధులైన ఎలక్షన్ టీమ్ ఎంపికకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఆ మేరకు త్వరలో క్యాబినెట్‌ను పునర్ వ్యవస్థీకరించేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొత్త క్యాబినెట్‌లోకి స్పీకర్ తమ్మినేని సీతారాం, తోట త్రిమూర్తులు, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, కావూరి శ్రీనివాస్, మల్లాది విష్ణుకు క్యాబినెట్‌లో చోటు కల్పించవచ్చన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అసంతృప్తితో ఉన్న నల్లపురెడ్డి , బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా, వారి అసంతృప్తి తొలగించనున్నారు.

నెల్లూరు జిల్లాలో వ్యవసాయశాఖ మంత్రి కాకాణి పనితీరుపై నాయకత్వం సంతృప్తిగా లేదంటున్నారు. ప్రకాశం జిల్లాలో సురేష్, మేరుగ నాగార్జునకు అవకాశం ఇచ్చినప్పటికీ, వారిద్దరూ జిల్లా నేతలతో సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ పార్టీ ఆశించిన స్థాయిలో, పనితీరును ప్రదర్శించవలేకపోతున్నారన్నది పార్టీ సీనియర్ల విశ్లేషణ. అందువల్ల ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సమన్వయం చేసుకునే బాలినేని శ్రీనివాసరెడ్డికే, తిరిగి మంత్రి పదవి ఇవ్వడం మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక హోంమంత్రి వనిత పనితీరుపైనా నాయకత్వం సంతృప్తిగా లేరని, ఆమె పార్టీ నాయకత్వం ఆశించినంత వేగంగా వ్యవహరించడం లేదన్న భావన లేకపోలేదంటున్నారు. ఆమె స్థానంలో స్పీకర్ తమ్మినేని సీతారాంను తీసుకోవచ్చంటున్నారు. నిరంతరం పార్టీ కోణంలో ఆలోచించే తమ్మినేని, ఎన్నికల ముందు హోంశాఖ మంత్రిగా ఉంటే పార్టీకి ఉపయోగమన్న భావన లేకపోలేదు.

ఇక అవినీతి ఆరోపణలు, సమర్ధవంతంగా వ్యవహరించని మంత్రి గుమ్మలూరు జయరాంను కూడా తొలగించవచ్చంటున్నారు. చెల్లుబోయిన వేణుగోపాల్ జిల్లాలో ఎవరినీ సమన్వయం చేసుకోలేకపోతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా నుంచి తోట త్రిమూర్తులుకు మంత్రివర్గంలో అవకాశం ఇస్తే, ఆ జిల్లాలో కాపులను కొంతవరకూ ఆకర్షించవచ్చన్న యోచన నాయకత్వంలో లేకపోలేదంటున్నారు. అందువల్ల దాడిశెట్టి రాజాను తొలగించినా, పెద్ద ఇబ్బంది ఉండదని నాయకత్వం అంచనా వేస్తోంది.

ఇక చిత్తూరు జిల్లాకు చెందిన నారాయణస్వామి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీదిరి అప్పలరాజు, ప్రకాశం జిల్లాకు చెందిన మేరుగ నాగార్జున పనితీరుపైనా నాయకత్వం సంతృప్తిగా లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మంత్రి విడదల రజని కూడా జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎంపీ, నాయకులతో సమన్వయంతో పనిచేయలే క పోతున్నారన్న ఫిర్యాదులు వస్తున్నట్ల్లు చెబుతున్నారు. ఆమె తన శాఖపై దృష్టి సారిస్తున్నప్పటికీ, మంత్రిగా జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీతో సఖ్యతగా లేరంటున్నారు.

ఇక ఉషాచరణ్ పనితీరు కూడా ఆశించిన స్థాయిలో సంతృప్తిగా లేరంటున్నారు. జగన్‌కు విధేయుడైన కొడాలి నానిని తొలగించిన తర్వాత, ఆ స్థాయిలో విపక్షంపై ఎదురుదాడి తగ్గింది. తనను మంత్రి పదవి నుంచి తొలగించినప్పటికీ, కొడాలి నాని టీడీపీ-జనసేనపై సమర్ధవంతంగా ఎదురుదాడిచేస్తున్న వైనాన్ని, నాయకత్వం పరిగణనలోకి తీసుకుందని చె బుతున్నారు. ఇక ఇప్పటిదాకా బ్రాహ్మణ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం లేనందున, ఈసారి క్యాబినెట్‌లో మల్లాది విష్ణును తీసుకోవచ్చంటున్నారు. ఇక ఎమ్మెల్సీ కావూరు శ్రీనివాస్‌కూ అవకాశం లభించినా ఆశ్చర్యపోవనవసరం లేదంటున్నారు.

ఇదిలాఉండగా… ఈనెల 3న సీఎం జగన్ ఎమ్మెల్యేలతో ముఖాముఖి నిర్వహించనుండటం ఆసక్తికరంగా మారింది. ఏప్రిల్ 3న నిర్వహించనున్న ఎమ్మెల్యేల సమావేశంలో, టికెట్లు ఎవరికి ఇచ్చేది స్పష్టం చేస్తానని సీఎం జగన్ గత డిసెంబర్ సమావేశంలోనే వెల్లడించారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఎవరికి సీట్లు ఇస్తామన్న విషయాన్ని జగన్ స్వయంగా ప్రకటించనున్నారు. దీనితో ఎమ్మెల్యేలలో సహజంగానే టెన్షన్ మొదలయింది.

టికెట్లు ఎవరికి ఇస్తానన్న విషయంలో జగన్ పారదర్శకంగా వ్యవహరిస్తారా?అంటే ఆరోజు బహిరంగంగా చెబుతారా.. లేక ఎమ్మెల్యేలను పిలిచి సీల్డ్ కవర్‌లో రిపోర్టు ఇస్తారో తెలియక టెన్షన్ పడుతున్నారు. మునుపటి మాదిరిగా సీల్డ్ క వర్‌లో పనితీరు రిపోర్టు ఇచ్చి, టికెట్‌పై స్పష్టత ఇస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఏదేమైనా ఎన్నికల్లో సమర్థులను బరిలోకి దింపే అంశంలో జగన్ ఎలాంటి మొహమాటాలు-ఒత్తిళ్లకు తావివ్వరని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ మేరకు తమ పనితీరు మార్చుకునేందుకు ఇప్పటికే ఆయన పలు అవకాశాలు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ఐ-ప్యాక్ ఇచ్చిన నివేదికలు, తాను సొంతంగా నిర్వహించుకున్న సర్వేల ఆధారంగానే ఈనెల 3న జగన్ నిర్ణయాలు ఉండనున్నాయని పార్టీ సీనియర్లు చెబుతున్నారు.

Leave a Reply