Home » జగన్‌కు రెడ్ల ఝలక్!

జగన్‌కు రెడ్ల ఝలక్!

– వైసీపీకి రెడ్లు దూరం
– పల్నాడు నుంచి నెల్లూరు వరకూ వ్యతిరేక పవనాలు
– రాయలసీమలో వైసీపీ-టీడీపీ వైపు చీలిన రెడ్లు
-వాలంటీర్లను తెచ్చి తమ పలుకుబడిని దెబ్బ తీశారన్న ఆగ్రహం
– ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో కూడా తమకు విలువ ఉండేదని స్పష్టీకరణ
– టీడీపీ హయాంలోనే గౌరవం ఉండేదని వాపోతున్న రెడ్డి సర్పంచులు
– వాలంటీర్ల వ్యవస్థతో గ్రామాల్లో తమ పెత్తనం దెబ్బతీశారని కన్నెర్ర
– బిల్లులు ఇవ్వకుండా ఆర్ధికంగా దెబ్బతీశారన్న అసంతృప్తి
– దానితో రంగంలోకి దిగిన రెడ్డి సంఘాలు
– వైసీపీకి ఎందుకు ఓటేయాలని నిలదీసిన విశాఖ రెడ్లు
– దానితో ఖంగుతిన్న రెడ్డి సంఘం నేతలు
– పల్నాడు లోనూ అదే తిరుగుబాటు
– ఓటేస్తాం కానీ పార్టీని భుజానకెత్తుకోలేమని స్పష్టీకరణ
– వాలంటీర్లతోనే ఓట్లు వేయించుకోమని నిష్ఠూరాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

రెడ్లు అంటే కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే రెడ్లు. ఇది ఒకప్పుడు. వైసీపీ ఆవిర్భవించిన తర్వాత రెడ్లంటే వైసీపీ. వైసీపీ అంటే రెడ్లు. ఇదీ లెక్క. రెడ్డి సామాజికవర్గం ఉమ్మడి రాష్ట్రంలో సాంప్రదాయకంగా కాంగ్రెస్‌కు, మానసిక మద్దతుదారుగా కొనసాగింది. రాష్ట్ర విభజన తర్వాత.. వైఎస్ తనయుడు జగన్ వైసీపీ స్థాపించిన వైసీపీని రెడ్లు సొంతం చేసుకున్నారన్నది తిరుగులేని నిజం.

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత, తమను అందలం ఎక్కిస్తారని గ్రామ-పట్టణ స్థాయి రెడ్లు ఆశించారు. ఆ అంచనాతోనే గత ఎన్నికల్లో సొంత డబ్బు ఖర్చు చేసి, పార్టీని గె లిపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పరిథిలో కాంట్రాక్టు పనులు చేసుకుని, ఆర్ధికంగా లాభపడవచ్చని గ్రామాలను శాసించే రెడ్లు ఆశించారు. కానీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే వారి ఆశలు ఆవిరయ్యాయి.

జగన్ తన చుట్టూ ఉన్న కొందరు ధనిక రెడ్లు, పారిశ్రామికవేత్తలకు మినహా గ్రామ-పట్టణ స్థాయిలోని తమ లాంటి రెడ్లను పట్టించుకోవడం లే దని భావించారు. గ్రామాల్లో సొంత ఖర్చులతో నిర్మించిన రోడ్డు, ఇతర పనులకు బిల్లులు ఇవ్వలేదు. దానితో అప్పులవారి బాధ ఎక్కువై, చాలామంది రెడ్డి సర్పంచులు గ్రామాలు వదలి హైదరాబాద్ వెళ్లి కూలీ పనులు చేసుకున్న అవమానకర పరిస్థితి.

అప్పుల బాధకు తాళలేక అనేక మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటే, అందులో 40 శాతం రెడ్లే కావడం గమనార్హం. దానితో పేరుకు రెడ్డిరాజ్యం అన్న ప్రచారం ఉన్నప్పటికీ, వాస్తవంలో మాత్రం తాము అనాధలుగా మిగిలిపోయామన్న ఆక్రోశం రెడ్లలో నాటుకుపోయింది.

నిజానికి కొన్ని దశాబ్దాల నుంచి గ్రామాలు, మండలాల్లో రెడ్ల పెత్దనమే ఎక్కువ. ఇతర కులాలతో కలిసిపోయే తత్వం రెడ్లలో ఎక్కువ. అది మిగిలిన అగ్రకులాల్లో కనిపించదు. అందరినీ అక్కా-బావ-బాబాయ్ అని పిలిచే రెడ్లంటే మిగిలిన కులాలకూ ఎనలేని అభిమానం.

గ్రామాల్లో ప్రజలు తమకు ఏ చిన్న సమస్య వచ్చినా.. వారు ఏ పార్టీకి చెందినవారయినప్పటికీ, గ్రామంలోని రెడ్డిగారి ఇంటికే వెళ్లేవారు. వారు కూడా పట్టణాల్లో తమ పలుకుబడి ఉపయోగించి ఆ పనులు చేసేవారు. చాలా సందర్భాల్లో సొంత డబ్బులు కూడా ఖర్చుపెట్టుకుని, గ్రామాలపై తమ పట్టు నిలబెట్టుకునే వారు. సహజంగా రెడ్లను పొగిడితే పొంగిపోతారని, ప్రతిష్ఠ కోసం ఏమైనా చేస్తారన్న పేరుంది.

అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత, రెడ్లకు గ్రామాల్లో ఆ పలుకుబడి పోయింది. గౌరవం పోయింది. నమస్కారం పెట్టే దిక్కులేదు. ఇక మునుపటిలా ఇళ్లకు వచ్చేవారెవరూ లేరు. కారణం జగన్ తీసుకువచ్చిన వాలంటీ రు వ్యవస్థ. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీరును నియమించడంతో, ప్రజలెవరూ రెడ్ల దగ్గరకు వెళ్లడం మానేశారు. అన్ని పనులూ వాలంటీర్లే చేస్తుండటంతో, గ్రామాలు-పట్టణాల్లో రెడ్ల పెత్తనం పూర్తిగా పోయింది. దానితో రెడ్లు కొన్ని దశాబ్దాలుగా రాజకీయంగా కాపాడుకుంటూ వస్తున్న ఆధిపత్యం-గౌవరానికి గండిపడింది.

ఇది రెడ్డి సర్పంచులు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ఆత్మాభిమానం దెబ్బతినేందుకు కారణమయింది. ఎన్టీఆర్-చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా తమ గౌరవానికి భంగం కాలేదని రెడ్లు బహిరంగంగానే చెబుతున్నారు. కానీ ‘తమ రెడ్డి’ అనుకున్న జగన్ పాలనలోనే, తమ రాజకీయ జీవితం సమాధి అవుతుందని కలలో కూడా అనుకోలేదని, రెడ్లు బాహాటంగానే చెబుతున్నారు. టీడీపీ హయాంలోనే తమకు విలువ-గౌరవం ఉండేదని, కానీ జగన్ వచ్చిన తర్వాత, గ్రామాల్లో రెడ్లకు విలువ లేకుండా చేశారన్న ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.

దీనిని గ్రిహ ంచిన రెడ్డి సంఘం నేతలు రంగంలోకి దిగి, వైసీపీపై రెడ్ల వ్యతిరేకతను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. రెండురోజుల క్రితం విశాఖలో ఒక రెడ్డిసంఘ అధ్యక్షుడు నిర్వహించిన రెడ్ల ఆత్మీయ సమావేశంలో, ఆయనపై రెడ్లు సామూహికంగా విరుచుకుపడ్డారట. జగన్ వచ్చి తమను రాజకీయంగా నాశనం చేశారని, బిల్లులు చెల్లించకపోవడంతో అప్పులు పాలయ్యామని సామూహిక దాడి చేశారట.

జగన్ చుట్టూ ఉన్న విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, మిధున్‌రెడ్డి, పారిశ్రామికవేత్తలు, ఇతర పెద్ద రెడ్లే లాభపడ్డారు తప్ప, కిందిస్ధాయిలో ఉన్న రెడ్లకు ఏం చేశారని ప్రశ్నల వర్షం కురిపించారట. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేసేది లేదని ఖరాఖండీగా చెప్పడంతో, నోరెళ్లబెట్టడం రెడ్డి సంఘ అధ్యక్షుడి వంతయిందట.

నిజానికి పల్నాడు జిల్లా మాచర్ల నుంచి నెల్లూరు వరకూ రెడ్లు 60 శాతం మంది వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం-అసంతృప్తితో ఉన్నారట. ఇక రాయలసీమలో వర్గ రాజకీయాల నేపథ్యంలో రెడ్లు, వైసీపీ-టీడీపీ వర్గాలుగా చీలిపోయారట. అయినప్పటికీ వైసీపీ వైపే కొంత మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే గత ఎన్నికల మాదిరిగా గ్రామంలో తమ పలుకుబడి వినియోగించి వైసీపీకి ఓట్లు వేయించే పరిస్థితి మాత్రం లేదు. తమ ఓటు తాము వేసుకుని, ఇళ్లలో కూర్చోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

‘మాకు జగన్ ఏం చేయకపోయినా, కులాభిమానంతో వైసీపీకి మా ఓటు వేసి ఇంట్లో కూర్చుంటాం. గతంలో మాదిరిగా జేబు గుల్ల చేసుకుని, ఊళ్లో తిరిగి ఓట్లు వేయించే ప్రసక్తే లేదు. జగన్ మమ్మల్ని పనికిరానివాళ్లుగా భావించి వాలంటీర్లను పెట్టారు కదా? వాళ్లతోనే ఓట్లు వేయించుకోమనండి. మేమైతే అప్పటిలా భుజానేసుకుని పనిచేయం. ఒకసారి ఓడిపోతే మా విలువ ఏమిటన్నది జగన్‌కు తెలుస్తుంది’’ అని మాచర్లకు చెందిన ఓ వైసీపీ కీలక నేత వ్యాఖ్యానించారు.

ప్రధానంగా…తమను పక్కనపెట్టి నేరుగా ఓటర్లతో సంబంధం పెట్టుకునేందుకే, జగన్ వాలంటీరు వ్యవస్థను తెచ్చారన్న ఆగ్రహం, రెడ్డి సామాజికవర్గంలో బలంగా నాటుకుపోయింది. ‘ఏమీ చేయకపోయినా రెడ్లు కులాభిమానంతో చచ్చినట్లు తన పార్టీకే ఓటు వేస్తారని జగన్ భావిస్తున్నట్లున్నారు. అందుకే మమ్మల్ని పక్కన పెట్టి, మిగిలిన కులాలను అందలమెక్కస్తున్నారు. మైనారిటీలు ఓట్లు వేస్తే చాలనుకుంటున్నారు. మేం కూడా గతంలో లెక్క అంత పిచ్చిగా ఏమీ లేం. అన్నీ గమనిస్తున్నాం. ఈసారి వైసీపీ గెలుపు కోసం పనిచేసే ప్రసక్తే లేదు. టీడీపీకి ఓటు వేయలేం కాబట్టి మా ఒక్క ఓటు వైసీపీకి వేసి ఇంట్లో కూర్చుంటాం. అదీకాకపోతే కాంగ్రెస్‌కు వేస్తాం’’ అని మార్కాపురం నియోజకవర్గానికి చెందిన ఓ రెడ్డినేత స్పష్టం చేశారు.

ఇదిలాఉండగా.. రాయలసీమలో వైసీపీ-టీడీపీకి ఓటు వేయటం ఇష్టం లేని రెడ్లు, ఈసారి కాంగ్రెస్‌కు వేయాలని నిర్ణయించుకున్నట్లు, రెడ్డి సామాజికవర్గంలో చర్చ జరుగుతోంది. ప్రధానంగా కడప-కర్నూలు-నెల్లూరు జిల్లాల్లో ఇలాంటి భావన ఉన్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే సీమలో కూడా, రెడ్ల ఓట్లపై వైసీపీ ఆశలు వదులుకోవాల్సిందేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Leave a Reply