Suryaa.co.in

Editorial

‘కమలం’ కొంప మునుగుతుంది జీ

– డీజీపీ,సీఎస్‌లపై వేటు వేయకపోతే ఓట్ల బదిలీ క ష్టమే
– బీజేపీని టీడీపీ-జనసేన శ్రేణులు నమ్మరు
– గ్లాసు గుర్తు ఇతరులకు ఇవ్వడంపై ఇప్పటికే జనసేన అసంతృప్తి
– డీజీపీ-సీఎస్‌ను బదిలీ చేయమన్నా పట్టించుకోని నిర్లక్ష్యం
– టీడీడీ జేఈఓ బదిలీ చేయమంటే పొడిగించిన ఆగ్రహం
– ఇంకా బీజేపీ-జగన్ కలిసే ఉన్నారన్న భావన
– ఇలాగైతే బీజేపీ అభ్యర్ధులకు టీడీపీ-జనసేన ఓట్లు బదిలీ అవుతాయా?
– ఓట్లు బదిలీ కాకపోతే బీజేపీ అభ్యర్ధులు ఎలా గెలుస్తారు?
– బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్‌జీకి ఏపీ బీజేపీ నేతల లేఖ?
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఒకవైపు కూటమిలో ఉంటూ మరోవైపు జగన్‌తో తెరచాటు బంధం కొనసాగిస్తున్నారన్న నిదర్శనాలు పెరగడం వల్ల.. కమలం కొంపమునుగుతుందని రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర నాయకత్వాన్ని హెచ్చరించారు. ఈలోగా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే, తమ ఎంపీ-ఎమ్మెల్యే అభ్యర్ధులకు టీడీపీ-జనసేన ఓట్లు బదిలీ కావని.. బీజేపీ జాతీయ సంఘటనా మహామంత్రి బీఎల్‌సంతోష్‌జీకి, రాష్ట్ర నేతలు లేఖ రాసినట్లు తెలుస్తోంది.

పార్టీవర్గాల సమాచారం ప్రకారం.. ఏపీలో సీఎస్-డీజీపీని ఇప్పటిదాకా బదిలీ చేయకపోవడం, టీటీడీ జెఈఓ ధర్మారెడ్డిని బదిలీ చేయమని కోరితే.. ఆయన డెప్యుటేషన్‌ను పొడిగించడం వంటి చర్యలు కూటమిలో, పెద్దపార్టీలయిన టీడీపీ-జనసేన శ్రేణుల అసంతృప్తికి కారణమవుతున్నాయి. ఈ పరిణామాలన్నీ జగన్ ఇంకా బీజేపీతో బంధం కొనసాగిస్తున్నదానికి నిదర్శనాలుగా, ఆ రె ండు పార్టీల శ్రేణులు భావిస్తున్నాయని రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర పార్టీకి లేఖరాశారట.

మరో 10 రోజుల్లో పోలింగ్ ఉన్నప్పటికీ, ఇప్పటిదాకా డీజీపీ-సీఎస్‌ను బదిలీ చేయలేదంటే.. జగన్ ప్రభావం ఇంకా బీజేపీపై ఉందన్న విషయం, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న టీడీపీ-జనసేన శ్రేణులకు స్పష్టంగా అర్ధమవుతోంది. అది మన ఎమ్మెల్యే-ఎంపి అభ్యర్ధుల విజయంపై కచ్చితంగా ప్రభావితం చూపుతోందని రాష్ట్ర నేతల తమ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారట.

టీటీడీ జేఈఓ ధర్మారెడ్డికి తమ పార్టీలో అధ్యక్షురాలు పురందేశ్వరి కంటే ఎక్కువ పలుకుబడి ఉందన్న విషయం, ఆయన డెప్యుటేషన్ పొడిగింపుతో స్పష్టమయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్న విషయాన్ని కేంద్రపార్టీ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. జగన్ రాసిన లేఖకు బీజేపీ ప్రభుత్వం స్పందించి, ధర్మారెడ్డి డెప్యుటేషన్ పొడిగించడం వల్ల.. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న టీడీపీ-జనసేన శ్రేణులు మనోభావాలు దెబ్బతిన్నాయని, రాష్ట్ర బీజేపీ నేతలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

డీజీపీ-సీఎస్ బదిలీ వద్దని జగన్ ఒత్తిడి చేసినందుకే, వారిద్దరిపై వేటు పడటం లేదన్న అనుమానాలు టీడీపీ-జనసేనలో బలంగా నాటుకుపోయాయి. కాబట్టి దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే, ఆ అసంతృప్తి ప్రభావం బీజేపీ అభ్యర్ధులపై పడటం ఖాయమని స్పష్టం చేశారట.

‘‘క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న టీడీపీ-జనసేన కార్యకర్తలు, నాయకులు మన పార్టీ ఇంకా జగన్‌తోనే అంటకాగుతోందని భావిస్తున్నారు. దానికి కారణం సీఎస్-డీజీపీని బదిలీ చే యకపోవడమే. ధర్మారెడ్డిని బదిలీ చేయాలని మన పార్టీ అధ్యక్షురాలే ఈసీని డిమాండ్ చేసినా పట్టించుకోకుండా, ఆయన డెప్యుటేషన్ పొడిగించారు. ఇది మన పార్టీ వారికీ అసంతృప్తికి గురిచేసే అంశమే. అంతకుముందు రఘురామకృష్ణంరాజుకు నర్సాపురం ఎంపీ సీటివ్వవద్దని జగన్ కోరినందుకే, ఆయనకు సీటివ్వలేదన్న ప్రచారం కిందిస్థాయికి చేరింది. ఇవన్నీ మన పార్టీ జగన్‌తో ఉందన్న సంకేతాలుగానే, ఆ రెండు పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇది కూటమి భవిష్యత్తుకు మంచిదికాదు. ఈ తప్పుడు సంకేతాలకు తెరదించాల్సిన అవసరం ఉంది. మన పార్టీ అభ్యర్ధులు గెలవాలంటే, టీడీపీ-జనసేన శ్రేణుల అనుమానాలు తొలగించడమే ఏకైక పరిష్కారం’’ అని బీజేపీ జాతీయ సంఘటనా మహామంత్రి బీఎల్ సంతోష్‌జీకి రాసిన లేఖలో, ఏపీ బీజేపీ నేతలు స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.

ప్రస్తుతం రాజమండ్రి, అనకాపల్లి, నర్సాపురం లోక్‌సభ స్ధానాలతోపాటు.. విజయవాడ వెస్ట్, విశాఖ, ధర్మవరం, కైకలూరు, అనపర్తి అభ్యర్ధులు వైసీపీని అన్ని రంగాల్లో ఢీకొంటున్నారని తమ లేఖలో వివరించారట. ఇక్కడ టీడీపీ-జనసేన శ్రేణులు కష్టపడి పని చేస్తున్నాయి. ప్రధానంగా ధర్మవరం, విజయవాడ వెస్ట్‌లో టీడీపీ నేతలు బీజేపీ అభ్యర్ధుల గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నారు.

ఇవన్నీ దాదాపు గెలిచే స్థానాలుగానే అంతా భావిస్తున్న సమయంలో.. డీజీపీ-సీఎస్‌ను తొలగించకపోతే, బీజేపీ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో.. టీడీపీ-జనసేన ఓట్లు బదిలీ కావడం కష్టమని కుండబద్దలుకొట్టినట్లు తెలుస్తోంది.

అటు జనసేన శ్రేణులు కూడా బీజేపీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని జాతీయ పార్టీకి స్పష్టం చేసినట్లు సమాచారం. గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించిన అంశంపై జనసైనికులు అసంతృప్తితో రగిలిపోతున్నారని, ఇక ఎన్డీఏలో ఉండి ఏం ఉపయోగమని భావిస్తున్నట్లు బీజేపీ నేతలు జాతీయ పార్టీకి నివేదించినట్లు తెలుస్తోంది.

మొత్తంగా ఎన్డీఏలో ఉన్నందున తమకెంటి ఉపయోగం లేదన్న భావన టీడీపీ-జనసేన శ్రేణుల్లో బలంగా నాటుకుపోయినట్లు బీజేపీ రాష్ట్ర నేతల ఆందోళనతో స్పష్టమవుతోంది.

‘‘ ఎన్డీయేలో ఉంటే జగన్‌కు తొత్తులుగా పనిచేస్తున్న అధికారులను ఆ స్థానాల్లో తొలగించడం ద్వారా ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుందని అనుకున్నాం. కానీ పోలింగుకు ఇంకా 10 రోజులో సమయం ఉంది. అయినా డీజీపీ-సీఎస్‌పై చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు తీసుకున్నా ఎలాంటి ఉపయోగం లేదు. జనసేనకు ఇచ్చిన గ్లాసు గుర్తును మిగిలిన వారికీ కేటాయించారు. బీజేపీ జగన్‌తోనే ఉందని దీన్నిబట్టి అర్ధమవుతున్నప్పుడు, టీడీపీ-జనసేన శ్రేణులు బీజేపీ అభ్యర్ధులకు ఓట్లు ఎలా వేస్తారు? వాళ్లు పోటీ చేస్తున్న చోట ఎంపీ అభ్యర్ధుల వరకూ పనిచేస్తారు’’ అని పెందుర్తికి చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE