-సర్వజనుల సంక్షేమమే కూటమి మేనిఫెస్టో ధ్యేయం
-ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూములు కబ్జా చేస్తున్నారు
-సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ
సర్వజనుల సంక్షేమమే ధ్యేయంగా రూపొందించిన కూటమి మేనిఫెస్టోపై ప్రజల్లో విశేష ఆదరణ వస్తోందని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సత్తెనపల్లి రూరల్ మండలం పాకాలపాడు గ్రామంలో గురువారం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచారంలో ఆయనకు గ్రామస్తులు తప్పెట్లతో స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి వివరించారు.
ఈ సందర్భంగా కన్నా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరిగారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో లక్షలాది ఎకరాల ప్రజల భూములు కబ్జా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, ప్రజలు సైకో పాలనను తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఫ్యాన్ రెక్కలు విరగడం ఖాయ మన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఐదేళ్లలో అభివృద్ధి లేక అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మరో వైపు శాండ్, ల్యాండ్, మైన్, వైన్, మాఫియాతో దోపిడీ జరిగింది.
అందుకే జగన్ ప్రభుత్వంపై జనంలో తిరుగుబాటు మొదలైంది. రాష్ట్రాన్ని కాపాడేందుకు కూటమిని గెలిపించేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని, నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించేందుకు ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా శ్రీకృష్ణదేవరాయలును సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
కోడెల శివప్రసాద్‌కు నివాళి
సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజావేదికలో గురువారం నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్, మాజీ మంత్రి, పల్నాడు అభివృద్ధి ప్రదాత కోడెల శివప్రసాద్ జయంతి సందర్భంగా సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.