Suryaa.co.in

Andhra Pradesh

బీసీలకు అన్నివిధాలా అండగా ఉంటాం

-వారికి అవకాశాలు కల్పించింది టీడీపీ ప్రభుత్వమే
-జగన్‌ పాలనలో వారికి ప్రాధాన్యం శూన్యం
-గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌

తెనాలి రాధాకృష్ణ కళ్యాణ మండపంలో గురువారం జయహో బీసీ కార్యక్రమం జరిగింది. తెనాలి నియో జకవర్గ నాయకులతో పాటు గ్రామ, మండల స్థాయి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ పార్టీ పెట్టిన దగ్గర నుంచి బీసీలు, రజకులు అండగా ఉన్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో వారికి రాజకీయంగా ప్రాధాన్యం ఇచ్చి అవకాశాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. జగన్‌ తన పాలనలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు, మంత్రులను ప్రకటించారు. కానీ ఆ పదవుల్లో ఉన్న ఏ ఒక్క నాయకుడు వల్ల అయినా ప్రజలకు ఉపయోగం జరిగిందా? ఆ నాయకులు జగన్‌ దగ్గరకు వెళితే కూర్చోడానికి కనీసం కుర్చీ కూడా ఉండదు.

వైసీపీలో అయోధ్య రామిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి వంటి వారిని తప్ప చెప్పుకోదగ్గ ఒక్క బీసీ నాయకుడిని కూడా ఆ పార్టీ తయారు చేయలేకపోయిందంటే బీసీలపై వారికి ఎంత గౌరవం ఉందో అర్థమవుతుందన్నారు. తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ బలహీనవర్గాల కోసం పోరాడిన నాయకులు ఎందరో తెనాలిలో ఉన్నారు. ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇచ్చే ఇతర నాయకుల్లా కాకుండా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ఇద్దరు కలిసి సమష్టిగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. టీడీపీ హయాంలో బీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి పాటుపడ్డారు.

జగన్‌ ప్రభుత్వం కులాల వారీగా కార్పొరేషన్లను విడగొట్టి కులాల మధ్యన చిచ్చులు పెట్టే ప్రయత్నం చేసిందని విమర్శించారు. బీసీ నాయకులు మాట్లాడుతూ బీసీలు, రజకులను ప్రోత్సహించింది టీడీపీ అని తెలిపారు. రజకుల జీవనోపాధి కోసం చెరువులు పూడికలు తీసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అంటున్నారు. అయితే నేటి సాంకేతిక విధానాన్ని ఉపయోగించి జీవనోపాధి కల్పించేలా మిషనరీ అందించాలని కోరారు.

LEAVE A RESPONSE