Home » వైసీపీ ని భూస్థాపితం చేసేందుకే పొత్తు

వైసీపీ ని భూస్థాపితం చేసేందుకే పొత్తు

-వైబ్యాండేజి బబ్లూ.. యాక్టర్ జగన్, డైరక్టర్ భారతి, ప్రొడ్యూసర్ ఐప్యాక్
-రుషికొండకు గుండుకొట్టిన వ్యక్తి విజయసాయి రెడ్డి
-ఆయనకు అవకాశమిస్తే ఇంటిపై కప్పు కూడా ఎత్తుకెళ్తారు
-జగన్ కు తెలిసింది దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే
-విజనరీ, ప్రిజనరీకి మధ్య తేడాను రాష్ట్ర ప్రజలు గుర్తించాలి
-వంద రోజుల్లో యువత కోసం స్కిల్ డెవలప్ మెంట్ మళ్లీ తెస్తాం
-టిడిపి అభ్యర్థులను గెలిపిస్తే ట్రిపుల్ ఇంజన్ అభివృద్ధి
-నెల్లూరు యువగళం సభలో టిడిపి యువనేత నారా లోకేష్

నెల్లూరు: ఓట్లు చీలికతో ఎపి నష్టపోకూడదన్నదే మా లక్ష్యం. చంద్రబాబును అక్రమంగా జైలులో పెట్టినపుడు పవనన్న రాజమండ్రి వచ్చి కలిసి పోరాడదామని చెప్పారు. అభివృద్ధిని గాడిలో పెట్టడమే మా లక్ష్యం. సైకో సిఎంను తరిమికొడతాం, వైసిపిని భూస్థాపితం చేసేందుకే పొత్తు పెట్టుకున్నామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. నెల్లూరు విఆర్ సి మైదానంలో నిర్వహించిన యువగళం సభలో యువనేత మాట్లాడారు.

కార్యక్రమానికి హాట్ నెట్ సోషల్ మీడియా ఫౌండర్, విశాఖ, హైదరాబాద్ లో 50కిపైగా స్టార్టప్ కంపెనీలు ఏర్పాటుచేసిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త, ఫోర్బ్స్ 30లో స్థానం సంపాదించిన మోటివేషన్ స్పీకర్ ఫ్రెడ్రిక్ దేవరంపాటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. జగన్ కు తెలిసింది దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే. తండ్రి అధికారంలో ఉన్నపుడు భారతిసిమెంట్, సాక్షిసిమెంట్ అలాగే స్థాపించారు. సిఎం అయ్యాక మద్యం, ఇసుక గ్రావెల్ ద్వారా యథేచ్చగా దోచుకున్నారు. ఆయనకు స్టార్టప్ అంటే అర్థం తెలియదు. ఆయనకు ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అంటే తెలియదు. దానివల్ల చాలా నష్టపోయాం.

నెట్ ఫ్లిక్స్ లో కొత్త షో వచ్చింది, దానిపేరు బ్యాండేజి బబ్లూ, యాక్టర్ జగన్, డైరక్టర్ భారతి, ప్రొడ్యూసర్ ఐప్యాక్, ఇప్పటికే ఆ నాటకానికి భాస్కర్ అవార్డు వచ్చింది, గులకరాయి స్పెషల్ ఎఫెక్ట్ చూశాం. ప్రిజనరీ, విజనరీ మధ్య తేడా ను రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. చంద్రబాబు విజనరీ. ఎపి విభజన ఎలా జరిగిందో మీకుతెలుసు.

2014లో కట్టుబట్టలతో బయటకు వచ్చిన పరిస్థితుల్లో సచివాలయం, అసెంబ్లీ హైదరాబాద్ లో ఉండగా, చంద్రబాబు అమరావతి రాజధాని బిల్లు పెట్టారు. ఆ తర్వాత కియా, అపోలో, షామీ ఫోన్లు, టిసిఎల్, మెట్రో బోగీలు తయారుచేసే పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయి. 16లక్షలకోట్ల పెట్టుబడులు, 35లక్షల ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందం చేసుకున్నాం. 5ఏళ్లలో 40వేల పరిశ్రమలు, 6లక్షల ఉద్యోగాలు కల్పించామని అసెంబ్లీలో గౌతం రెడ్డి స్వయంగా చెప్పారు.

జగన్మోహన్ రెడ్డి ఓ ప్రిజనరీ… అన్నింటా విధ్వంసమే
జగన్మోహన్ రెడ్డి ఓ ప్రిజనరీ. ఆయన హయాంలో గంజాయి, బూమ్ బూమ్, త్రీ క్యాపిటల్, 9 హార్స్, కోడికత్తి, స్పెషల్ గులకరాయి మేడిన్ ఆంధ్రగా మార్చారు. అడుగడుగునా కంపెనీలను ఇబ్బంది పెట్టారు. సోలార్ ఎనర్జీ పిపిఎ లు రద్దుచేశారు. అమర్ రాజాను పక్కరాష్ట్రానికి పంపేశారు. లులూనువిశాఖకు తెస్తే తెలంగాణాకు పంపారు. రిలయన్స్ , హెఎస్ బిసిని పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. రాజకీయ లబ్ధికోసం వృద్ధులకు పెన్షన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు.

వాలంటీర్లను రాజకీయాలకు వాడటంతో పక్కనబెట్టారు. ప్రభుత్వ సిబ్బందితో ఇవ్వాలని మేం చెప్పాం. వారు నియమించిన సిఎస్ ఉండటం వల్లే సకాలంలో రాలేదు. నెలలో ప్రజాప్రభుత్వం వచ్చాక వాలంటీర్లతో ఇళ్లవద్దకే పెన్షన్ ఇస్తాం. జగన్ ప్రభుత్వం విద్యార్థులకు పీజీ ఫీ రీఎంబర్స్ మెంట్, విదేశీ విద్య రద్దుచేసింది, మేం రాగానే అవి రెండు మళ్లీ పునరుద్దరిస్తాం. మెడికల్ కాలేజిలో మెడికల్ సీట్లు అమ్మకానికి పెట్టింది. మేం వచ్చాక వైద్యకళాశాలల్లో ఫ్రీ సీట్లు పెంచుతాం.

వాలంటీర్ ఉద్యోగం కావాలా? ఐటి ఉద్యోగం కావాలా?
రాష్ట్రంలో యువత ఆలోచించాలి. 5వేలు ఇచ్చే వాలంటీర్ కావాలా? 50వేలు వచ్చే ఐటి ఉద్యోగం కావాలా? అనంతపురంలో పాదయాత్ర చేసేటపుడు ఒక చెల్లి కలిసింది. కియాలో ఉద్యోగం చేస్తూ నెలకు 30వేలు సంపాదిస్తున్నానని చెప్పింది. గతంలో హౌస్ వైఫ్ ని, ఇప్పుడు ఇల్లు నేనే నడుపుతున్నానని చెప్పింది. ఇప్పుడు ఆమె ఏటా 3.5లక్షల జీతం అందుకుంటోంది. ప్రజాప్రభుత్వం వచ్చాక యువత అధునాతన ప్రాజెక్టులతో వస్తే ప్రభుత్వరంగంలో వారి టెక్నాలజీ ఉపయోగించుకుంటాం. నేను స్టాన్ పోర్డ్ లో క్రమశిక్షణ నేర్చకున్నా. ఎగ్జామ్స్ కు ఇన్విజిలేటర్లు ఉండరు. తప్పుచేయకూడదు, తప్పును క్షమించరాదు. 80మందిలో ఒక్కరు కూడా ఎగ్జామ్స్ సమయంలో అటూఇటూ చూసేవారు కాదు. జీవితంలో పట్టుదల, క్రమశిక్షణ అవసరం, అప్పుడే అనుకున్నది సాధిస్తాం.

జోడెడ్ల బండిలా అభివృద్ధి, సంక్షేమం ముందుకు సాగాలి
అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల బండిలా సాగాలి. సిఎం ప్రతిసారీ బటన్ నొక్కినా అంటున్నారు. బటన్ నొక్కేందుకు అప్పులు చేశారు. కరెంటు చార్జీలు 9సార్లు, ఆర్టీసి చార్జీలు 3సార్లు, ఇంటిపన్ను, చెత్తపన్ను, క్వార్టర్ బాటిల్ ధరలు పెంచారు. బటన్ నొక్కడమే సిఎం బాధ్యత కాదు. ముఖ్యమంత్రికి విజన్ ఉండాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. సమాంతరంగా సంక్షేమం కూడా చేయాలి. అప్పులు చేసి సంక్షేమం చేస్తే శ్రీలంక మాదిరి అవుతుంది. 12లక్షల కోట్లు అప్పుచేశారు. ఆ అప్పు కట్టాల్సిన బాధ్యత రాష్ట్రప్రజలదే. మా మొదటి హామీ 20లక్షల ఉద్యోగాలు. 8లక్షల ఉద్యోగాలతో రాష్ట్ర ఆదాయం రెట్టింపు అవుతుంది. సంపద సృష్టి ద్వారా వచ్చే ఆదాయాన్ని నిరుపేదలను పేదరికం నుంచి బయటకు తెచ్చేందుకు ఖర్చుపెడతాం. కియాతో అనంతపురంలో తలసరి ఆదాయం 30వేలు పెరిగింది.

చట్టాలను అధికారపార్టీకి చుట్టంగా మార్చారు
2019కి ముందు నాపై ఒక్క కేసు లేదు. ఏనాడు పోలీసు స్టేషన్ కు వెళ్లలేదు. ప్రపంచబ్యాంకులో పనిచేశాను. వైసిపి ప్రభుత్వం వచ్చాక ఆరేడు సార్లు స్టేషన్ కువెళ్లివచ్చా. టిడిపి,జనసేనతో పాటు ప్రజలను కూడా తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టారు. అందుకే పాదయాత్రలో దొంగకేసులు ఎత్తివేస్తానని శిలాఫలకం వేశాను. జగన్ ప్రభుత్వంలో ఎపి ప్రజలంతా బాధితులయ్యారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది, కార్మిక, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు కూడా బయటకు రాలేని పరిస్థితి. ఫీ రీఎంబర్స్ మెంట్ అడిగితే విద్యార్థులపై కేసులు పెట్టారు.

ఎయిడెడ్ విద్యాసంస్థల ప్రైవేటీకరణపై ఆందోళనచేస్తే కళాశాలల్లోకి పోలీసులను పంపారు. అందుకే చట్టాలను ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టను అని చెప్పాం రాజ్యాంగ బాధ్యతను విస్మరించి చట్టాన్ని ఏలినవారికి చుట్టంగా మారిస్తే రాజ్యాంగం ఎందుకు? అధికారంలోకి వచ్చాక చట్టాలను ఉల్లంఘించి ప్రజలు, కార్యకర్తలను ఇబ్బందిపెట్టిన వారిని జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేసి జైలుకు పంపుతాం. పవన్ వాలంటీర్ల గురించి మాట్లాడితే క్రిమినల్ కేసు పెట్టారు. చంద్రబాబును 53రోజులుకు పంపారు, నారాయణను వేధించారు. వీటన్నిటికీ మేం వచ్చాక ఫుల్ స్టాప్ పెడతాం.

మూడేళ్లలో నెల్లూరుకు ఎయిర్ పోర్టు తెస్తాం
చంద్రబాబు సింహం లాంటి వారు. ఎక్కడ ఉన్నా సింహం సింహమే. స్కిల్ డెవలప్ మెంట్ ఆయన గట్టిగా నమ్మారు. సీమెన్స్ తో ఒప్పందం చేసుకున్నాం. ఐటితోపాటు బ్లూకాలర్ స్కిల్స్ కూడా నేర్పించాం. ఆర్ ఎఫ్ పిలో స్పష్టంగా చెప్పాం. అందువల్లే తప్పుడు ఆరోపణలతో సిఐడి కోర్టులో చార్జిషీటువేసినా తీసుకోలేదు. మొదటి వందరోజుల్లో స్కిల్ డెవలప్ మెంట్ తెస్తాం. మా వద్ద ఉన్న అద్భుత దీపం పేరు సిబిఎన్, రాష్ట్ర ప్రజలకు కష్టాల్లోనే చంద్రబాబు గుర్తుకు వస్తారు.

2014లో సీఎం అయ్యాక సంక్షేమం, అభివృద్ధిని సమంగా ముందుకు తీసుకెళ్లారు. 200 పెన్షన్ 2వేలుచేశారు, పరిశ్రమలు తెచ్చారు. ఆదాయం పెంచి అభివృద్ధి చేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక అదే వరవడిని ముందుకు తీసుకెళ్తాం. గతంలో మాదిరిగా ఐటి పరిశ్రమలు ఎపికి తెస్తాం. విశాఖలో ఐటికి ఎకో సిస్టమ్ ఉంది. గతంలో అక్కడ అనేక పరిశ్రమలు తెచ్చాం. కృష్ణాకు హెచ్ సిఎల్, చిత్తూరుకు జోహో వంటివి తెచ్చాం.

నెల్లూరుకు ఐటితోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ తెచ్చే బాధ్యత నాది. కర్నూలులో ఎయిర్ పోర్టు కట్టింది చంద్రబాబు, విజయవాడ విమానాశ్రయాన్ని విస్తరించింది చంద్రబాబు. విజయవాడ ఎయిర్ పోర్టు అభివృద్ధికి గత ప్రభుత్వం భూసేకరణ చేస్తే ఈ ప్రభుత్వం ఆపేసింది. భోగాపురం ఎయిర్ పోర్టుకు భూసేకరణ చేసి జిఎంఆర్ కు ఇచ్చింది కూడా చంద్రబాబే. నెల్లూరుకు ఇంకా పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. మొదటి మూడేళ్లలో నెల్లూరుకు ఎయిర్ పోర్టు తెస్తాం.

నెల్లూరులో వార్ వన్ సైడ్ ఖాయం
నెల్లూరును నారాయణ ఎలా అభివృద్ధి చేశారో చూశాం.4,500 కోట్లతో అభివృద్ధి చేశారు. భూగర్భ డ్రైనేజి, పేదలకు 4వేల ఇళ్లు నిర్మించారు. 43వేల ఇళ్లకు శంకుస్థాపన చేశారు. భూగర్భ డ్రైనేజి పెండింగ్ పనులు పూర్తిచేయలేని దద్దమ్మ సర్కారు జగన్ ప్రభుత్వం. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టిడిపికి 10కి 10 టిడిపికి ఇవ్వండి… అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తాం. నెల్లూరుకు పెట్టుబడులు తెస్తాం, ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం.

ఇక్కడి ప్రభంజనం చూస్తుంటే టిడిపి విజయ ఢంకా మోగించి నెల్లూరులో వార్ వన్ సైడ్ ఖాయం. నెల్లూరులో 10కి 10 అసెంబ్లీ స్థానాలు వైసిపికి ఇస్తే అయిదేళ్లలో ఒక్కరికి ఉద్యోగం కల్పించారా? డిఆర్ డిఓ 3వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైతే సిఎం వైఖరి వల్ల పక్క రాష్ట్రానికి వెళ్లిపోయింది. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా నెల్లూరుకు సెంబ్ కార్ప్ వంటి పరిశ్రమలు తెచ్చాం. కేవలం రాజధాని తరలిస్తే అభివృద్ధి వికేంద్రీకరణ జరగదు. మెగా డిఎస్సీ అన్నారు, 2.30లక్షల ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ అన్నారు. ఒక్క అవకాశం మాయలో పడి రాష్ట్రం సర్వనాశనమైంది. మా మొదటి సంతకం మెగా డిఎస్సీపైనే… అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, ఉద్యోగాలువచ్చే వరకు 3వేల నిరుద్యోగ భృతి ఇస్తాం.

టిడిపి అభ్యర్థులను గెలిపిస్తే నెల్లూరులో ట్రిపుల్ ఇంజన్ అభివృద్ధి
సింహపురి యూత్ పవర్ అదిరిపోయింది. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా నెల్లూరు వాళ్లే ఉంటారు. బిజినెస్ లు పెట్టి అభివృద్ధి చేయాలన్నది నెల్లూరు డిఎన్ ఎలోనే ఉంది. నారాయణ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నా ఉన్నతికి నారాయణే కారణం. నెల్లూరును ఎలా అభివృద్ధి చేశారో మీకు తెలుసు. ఆయనను భారీ మెజారిటీతో గెలిపించండి. నెల్లూరు, మంగళగిరి పోటీపడి అభివృద్ధి చేస్తాం. వేమిరెడ్డి వైసీపీ లో ఉన్నపుడు కూడా ఆయన సేవా కార్యక్రమాలు చూశాను. ఆయన ద్వారా ప్రేరణ పొందాను.

స్వంత నిధులతో గ్రామాల్లో తాగునీటి పథకాలు అభివృద్ధి చేశారు. ఈ ప్రభుత్వ విధానం నచ్చక రాజీనామా చేసి వచ్చి, టిడిపి తరపున లోక్ సభ ఎంపిగా పోటీచేస్తున్నారు. భారీ మెజారిటీతో ఆయనను లోక్ సభకు పంపండి. హైదరాబాద్, సికింద్రాబాద్ మాదిరిగా నెల్లూరు సిటీ, రూరల్ అభివృద్ధి చేస్తాం. రొట్టెల పండుగ జరిగితే నారాయణ చంద్రబాబుతో పోరాడి నిధులు తెచ్చేవారు. చిన్నపనులకు నిధులు తేలేకపోతున్నానని కోటంరెడ్డి టిడిపిలో చేరారు. ఈ ముగ్గురిని గెలిపిస్తే డబుల్ ఇంజన్ కాదు, త్రిబుల్ ఇంజన్ లా నెల్లూరును అభివృద్ధి చేస్తారు.

కేంద్ర సంస్థలు తీసుకురావాలంటే ఎంపిపైనే బాధ్యత ఉంటుంది. ఆయన పోరాడి కేంద్ర సంస్థలు తెస్తారు, వేమిరెడ్డికి అద్భుతమైన నెట్ వర్క్ ఉంది. పెట్టుబడులు తెచ్చే బాధ్యత తీసుకుంటారు. వైసిపి ఎంపి అభ్యర్థిగా విజయసాయి నిలబడుతున్నారు. జగన్ అన్ని కుంభకోణాల్లో ఆయన ఎ2 గా ఉన్నారు.విశాఖను సర్వనాశనం చేసిన వ్యక్తి, గీతం విద్యాసంస్థలను నాశనం చేయాలని కంకణం కట్టుకున్న వ్యక్తి, రుషికొండకు గుండుకొట్టిన వ్యక్తి విజయసాయి రెడ్డి.

విశాఖలో ఖాళీ భూములు కబ్జాచేసిన వ్యక్తి నెల్లూరులో నిలబడుతున్నారు. ఆయనకు అవకాశమిస్తే ఇంటిపై కప్పు కూడా ఎత్తుకెళ్తారు. మీ ఇళ్లు కొట్టేయాలని ఆలోచిస్తున్నారు. జోనల్ కోఆర్డినేటర్ గా విశాఖకు ఒక్క పరిశ్రమ, ఒక్క ఉద్యోగం తెచ్చారా? విశాఖను గంజాయికి అడ్డగా మార్చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించి అభివృద్ధికి బాటలు వేసుకోండి.

Leave a Reply