Home » చంద్రబాబు ఎక్కడున్నా సింహం సింహమే

చంద్రబాబు ఎక్కడున్నా సింహం సింహమే

-భూమిపై ఏ ముఖ్యమంత్రీ శాశ్వతం కాదు
-కాలేజీలో చేసేవన్నీ చేశాం
-అప్పులతో సంక్షేమం కాదు
-యువగళం సభలో యువత ప్రశ్నలు- లోకేష్ సమాధానాలు

ఫ్రెడ్రిక్-యాంకర్: స్టాన్ ఫోర్డ్ లో ఎంబీయే చేసిన అతికొద్ది మంది వ్యక్తుల్లో లోకేష్ గారు ఒకరు. అదొక డ్రీమ్. స్టూడెంట్ గా అక్కడ ఏం నేర్చుకున్నారు? ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, స్టూడెంట్ గా చాలా సరదాలు ఉంటాయి. మీకు సరదాలు ఏమీ లేవా?
నారా లోకేష్- కాలేజీలో చేసేవన్నీ చేశాం. స్టాన్ ఫోర్డ్ లో చాలా క్రమశిక్షణ ఉంటుంది. ఎంబీయే చేసేప్పుడు పరీక్షలకు ఇన్విజిలేటర్లు ఉండరు. మనం తప్పు చేయకూడదు. ఎవరైనా తప్పు చేస్తే చెప్పాలి. పరీక్షల్లో కాపీ కొట్టడాలు ఉండవు. ఒకే రూమ్ లో 80 మంది పరీక్షలు రాసేవారు. ఒక్కరు కూడా అటూఇటూ చూసేవారు కాదు. అదీ క్రమశిక్షణ. జీవితంలో రాణించాలంటే పట్టుదల, క్రమశిక్షణ అవసరం అని అప్పుడే తెలుసుకున్నా.

ఫ్రెడ్రిక్: ఉచిత పథకాల వల్ల శ్రీలంక అవుతుందని చెప్పారు. ఇప్పుడు మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చారు. దీనిని ఎలా చూస్తారు?
నారా లోకేష్- మన మేనిఫెస్టోలో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాల కల్పన. దీనివల్ల ఎకానమీ రెండింతలు పెరుగుతుంది. రాష్ట్రానికి ఆదాయం పెరిగితే వనరులు పెరుగుతాయి. కియా ఫ్యాక్టరీ వల్ల అనంత ప్రజల తలసరి ఆదాయం రూ.30వేలకు పెరిగింది. కియా రావడం వల్ల యాక్సిలరీ యూనిట్ లో పనిచేస్తున్నానని, దానివల్ల రూ.30వేల జీతం వస్తోందని ఓ సోదరి నా వద్దకు వచ్చి చెప్పారు. ఆ కుటుంబాన్ని ఆ సోదరే నడిపిస్తోంది. తనకు వచ్చే జీతం ఖర్చు చేయడం ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో సంక్షేమం చేస్తాం. అభివృద్ధి చేసి సంక్షేమం అందిస్తాం. అప్పులతో సంక్షేమం కాదు. జగన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు 9సార్లు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు 3సార్లు పెంచారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు. చివరకు క్వార్టర్ బాటిల్ ధరలు కూడా పెంచారు. సీఎంకు విజన్ ఉండాలి. అప్పులతో సంక్షేమం చేస్తే శ్రీలంక పరిస్థితి మనకు వస్తుంది. మనపై 12 లక్షల కోట్ల అప్పు ఉంది. భూమిపై ఏ ముఖ్యమంత్రీ శాశ్వతం కాదు. ప్రజలు శాశ్వతం. వారిపై అప్పుల భారం పడకుండా చూడాలి.

యువకుడు:స్టార్టప్ పరంగా మన రాష్ట్రం అట్టడుగున ఉంది. మీ ప్రభుత్వంలో స్టార్టప్ ల కోసం ఏం చేస్తారు?
నారా లోకేష్- టీడీపీ సహకారంతో నెలకొల్పిన స్టార్టప్ ల వల్ల ఫెడ్రిక్ చాలాబాగా సెటిల్ అయ్యారు. మార్కెట్ లింకేజీ, మెంటర్ షిప్ అందిస్తాం. జగన్ రెడ్డికి దోచుకో, దాచుకో మాత్రమే తెలుసు. జగన్ రెడ్డికి అంత్రోపెన్యూర్ అంటే అర్థం కాలేదు. దీంతో ఆయనను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. సీఎం అవగాహనలేమితో మనం చాలా నష్టపోయాం. మనం స్టార్టప్ ల అభివృద్ధికి అనేక విధాలుగా తోడ్పాటు అందించాం. యువత స్టార్టప్ ల వల్ల అభివృద్ధి చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటాం. వచ్చే ప్రభుత్వంలో స్టార్టప్ ల కోసం సహకారం అందిస్తాం.

యువతి: పెన్షన్ ఇంటికి రాకపోవడానికి కారణం మీరే అని వైసీపీ అంటోంది. అధికారంలో ఉండి కూడా వైసీపీకి చేతగావడం లేదని మీరంటున్నారు. ఏది నిజం?
నారా లోకేష్- నిజం గడపదాటే లోపు అబద్ధం ప్రపంచం చుట్టి వస్తుంది. వాలంటీర్లను ప్రభుత్వ బాధ్యతల నుంచి ఈసీ దూరం పెట్టింది. అందుకే పెన్షన్ ఇంటికి అందించలేక పోతున్నారు. వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ అందించాలని మేం డిమాండ్ చేశాం. అయినా సీఎస్ పట్టించుకోలేదు. నెలరోజులు ఓపికపట్టండి. మీ ఇంటికే పెన్షన్, ఇతర సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాం.

యువకుడు:బాబు గారి అంతటి సౌమ్యుడిని కాదు.. నేను మూర్ఖుడిని అని అంటున్నారు. దీనికేం సమాధానం చెబుతారు.
నారా లోకేష్- అలా ఎందుకు చెప్పానో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను స్టాన్ ఫోర్డ్ లో ఎంబీయే చేశాను. 2019 ఎన్నికల ముందు నాపై ఒక్క కేసు లేదు. తర్వాత 23 కేసులు పెట్టారు. హత్యాయత్నం కేసు, ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. జగన్ రెడ్డిని ప్రశ్నించిన వారిపై అనేక కేసులు పెట్టి వేధించారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత దొంగ కేసులు ఎత్తేస్తాం. జగన్ రెడ్డి పాలనలో ప్రజలందరూ బాధితులయ్యారు. సమాజంలో భయం ఏర్పడింది. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టనని అందుకే చెప్పా. రాజ్యాంగం కొంతమందికి చట్టాలు అమలుచేసే బాధ్యత అప్పగిస్తే.. చట్టాన్ని చుట్టంగా మార్చారు. పవనన్న వాలంటీర్ల గురించి మాట్లాడితే క్రిమినల్ కేసు పెట్టారు. చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి 53 రోజులు జైలులో నిర్బంధించారు. పి.నారాయణను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు.

యువకుడు:నెల్లూరులో ఉన్న స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారు. స్కిల్ కేసులో చంద్రబాబు గారిపై కేసు పెట్టారు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నైపుణ్య కేంద్రాలను మళ్లీ ఏర్పాటుచేస్తారా?
నారా లోకేష్- చంద్రబాబు గారు ఎక్కడున్నా సింహం సింహమే. చంద్రబాబు గారు ఇప్పటికీ పుస్తకాలు చదువుతారు. ఎప్పటికప్పుడు అన్నీ నేర్చుకుంటారు. యువతకు మంచి ఉద్యోగాలు, నైపుణ్యం కోసం స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటుచేయడం జరిగింది. చంద్రబాబు ఏనాడూ తప్పుచేయలేదు. మన ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో నైపుణ్య శిక్షణ కేంద్రాలను ముందుకు తీసుకెళ్తాం.

యువతి: మన రాష్ట్రం 10 లక్షల కోట్లు అప్పులు చేసింది. ఉద్యోగులకు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. మీరు వచ్చిన తర్వాత అప్పు తీరుస్తారా, ఎలా చేస్తారు, మీ దగ్గర అల్లాఉద్దీన్ అద్భుతమైన దీపం ఏమైనా ఉందా?
నారా లోకేష్- ఆ దీపం పేరే సీబీఎన్. సంక్షోభంలో చంద్రబాబు గారు గుర్తుకువస్తారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఉద్యోగులకు ఫిట్ మెంట్ ఇచ్చారు. పెన్షన్ ను రూ.2వేలు చేశారు. రైతులకు రుణమాఫీ చేశారు. మౌలిక సదుపాయాలు కల్పించాం. పరిశ్రమలు తీసుకువచ్చాం. అభివృద్ధి, సంక్షేమం బ్యాలెన్స్ చేసి ముందుకు తీసుకెళ్తాం.

రాము:నెల్లూరుకు సాఫ్ట్ వేర్ పరిశ్రమలు తీసుకువస్తారా?
నారా లోకేష్- విశాఖలో సాఫ్ట్ వేర్ రంగానికి కావాల్సిన ఎకో సిస్టమ్ ఉంది. నేను మంత్రిగా ఉన్నప్పుడు అనేక ఐటీ పరిశ్రమలు తీసుకువచ్చా. ఇతర జిల్లాల్లో కూడా అనేక పరిశ్రమలు తీసుకువచ్చా. కృష్ణా జిల్లాకు హెచ్ సీఎల్ వచ్చింది. నెల్లూరుకు మాన్యుఫాక్చరింగ్ జాబ్ లు కూడా తీసుకువచ్చే బాధ్యత నేను తీసుకుంటా.

వెంకటేష్: మేడే రోజున కార్మికులకు గౌరవం ఇవ్వాలి. వెయ్యి రూపాయలు బోనస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.
నారా లోకేష్- గతంలో చంద్రన్న బీమా ఉండేది. ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే రూ.5 లక్షల సాయం చేయడం జరిగింది. మళ్లీ చంద్రన్న బీమా తీసుకువచ్చి కార్మికులను ఆదుకుంటాం.

యువతి, నారాయణ మెడికల్ కాలేజ్: ప్రభుత్వ మెడికల్ సీట్లు పెంచాలి. పీజీ స్కాలర్ షిప్స్ అందించాలి.
నారా లోకేష్- జగన్ రెడ్డి వచ్చిన తర్వాత పీజీ ఫీజూ రీయింబర్స్ మెంట్, విదేశీ విద్య పథకాలను రద్దు చేశారు. వాటిని మళ్లీ అమలుచేస్తాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లను అమ్ముకుంటున్నారు. మేం వచ్చిన తర్వాత ఫ్రీ సీట్లు చేస్తాం. మొదటి వందరోజుల్లో చేస్తాం.

షేక్ సాదిక్: మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరుకు ఎయిర్ పోర్ట్ వస్తుందని హామీ ఇచ్చారు. వైసీపీ వచ్చిన తర్వాత పట్టించుకోలేదు. రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు?
నారా లోకేష్- కర్నూలులో ఎయిర్ పోర్ట్ కట్టింది, విజయవాడ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది చంద్రబాబు. కొత్త టెర్మినల్ కోసం భూసేకరణ చేశాం. తర్వాత జగన్ రెడ్డి నిలిపివేశారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం చంద్రబాబు కృషి చేశారు. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత పట్టించుకోలేదు. నెల్లూరులో వచ్చే మూడేళ్లలో ఎయిర్ పోర్ట్ పూర్తి చేసి విమానాలు ఎగిరేలా చేస్తాం.

యువకుడు: పాత ఫీజు రీయింబర్స్ మెంట్ విధానం అమలు చేయాలి.
నారా లోకేష్– ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలతో అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఫీజు చెల్లించకపోవడంతో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. మేం వచ్చిన తర్వాత పాత ఫీజు రీయింబర్స్ మెంట్ విధానం అమలు చేస్తాం.

యువతి: నాకు పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టం. టీడీపీ అంటే కూడా ఇష్టం. మీ ఇద్దరు కలిసి ఎన్నికల్లో రావడానికి కారణం ఏమిటి? విడివిడిగా వస్తే ఓడిపోతారనా?
నారా లోకేష్- మా స్వార్థం వల్ల రాష్ట్రం నష్టపోకూడదు. ప్రతిపక్ష ఓట్లు చీలకూడదు, కలిసికట్టుగా ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలనేది మా సంకల్పం. ఆనాడు పవన్ అన్న రాజమహేంద్రవరం జైలుకు వచ్చినప్పుడు కలిసికట్టుగా పోరాడి జగన్ ను తరిమికొడదాం, రాష్ట్రాన్ని కాపాడుకుందామని చెప్పారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని వర్గాలు నష్టపోయాయి. ఉద్యోగులకు జీతాలు అందడం లేదు. విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఆక్వా రైతులు నష్టపోతున్నారు. దీంతో కలిసికట్టుగా పోరాడి, ఎప్పుడూలేని మెజార్టీ రావాలి, వైకాపాను భూస్థాపితం చేయాలనే లక్ష్యంతో పొత్తుపెట్టుకున్నాం.

ఫెడ్రిక్: ప్రతి జిల్లాకు వెళ్లినప్పుడు బ్యాండేజ్ అని, బెట్టింగ్ స్టార్ అని నిక్ నేమ్ లు పెడుతున్నారు. దీనికి ఏమైనా హోం వర్క్ చేశారా?
నారా లోకేష్- బాగా బెట్టింగ్ లు పెట్టేవారిని బెట్టింగ్ స్టార్ అంటాం. అరగంట వీడియోలు చేసేవారిని అరగంట స్టార్ అంటాం. గంట వీడియోలు చేసే వారిని గంటస్టార్ అంటాం. వైకాపా అరాచకాలను ప్రజల్లో తీసుకెళ్లేందుకు ప్రజలే ముద్దుగా పేర్లు పెట్టారు. నంద్యాల ఎమ్మెల్యే సండే మాత్రమే కనపడతారు. అందుకే ఆ నిక్ నేమ్ పెట్టాం.

వెంకటేష్” 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు మన నెల్లూరు నగరంలో నారాయణ గారు ఉన్నప్పుడు డ్రైయిన్లు, పార్క్ లు, టిడ్కో ఇళ్లు అభివృద్ధి చేశారు. 2019లో వైకాపా వచ్చిన తర్వాత ఏమీ చేయలేదు. పైకి మాత్రం అన్నీ చేశామని చెబుతున్నారు. మీరు ఇంత చేసి కూడా ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు. లోపం ఎక్కడుంది?
నారా లోకేష్- నెల్లూరు ప్రజలు బాగా బుల్లెట్ దింపారు. అందుకే బెట్టింగ్ స్టార్ నర్సరావుపేటలో పడ్డారు. ఒకరింటి చెత్త తీసుకుని మరో ఇంట్లో వేస్తే బంగారం అవుతుందా. చెత్త ఎక్కడైనా చెత్తే. తెలుగుదేశం బలహీనత చేసిన పనులు చెప్పుకోలేకపోవడమే. స్కిల్ సెంటర్ల ద్వారా ఇన్ని పనులు చేశామా అని చంద్రబాబు అరెస్ట్ తర్వాత అర్థమైంది. భవిష్యత్ లో చేసే పనులు చెప్పుకుంటాం.

యువకుడు: గతేడాది గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరిగినప్పుడు 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. 20 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇప్పడు ఏపీ మొత్తం నిరుద్యోగమే ఉంది. ఈ ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయి, అసలు పెట్టుబడులు వచ్చాయా?
నారా లోకేష్- మనకు కోడిగుడ్డు మంత్రి ఉన్నారు. పెట్టుబడులు గురించి అడిగితే కోడి ముందా, గుడ్డు ముందా అని అంటారు. 13 లక్షల కోట్లు కాదు కదా. 13 రూపాయల పెట్టుబడులు కూడా రాలేదు. ఒక్క గ్లోబల్ కంపెనీ కూడా రాలేదు. ప్రభుత్వం ఇక్కడున్న కంపెనీలను వేధించి పక్క రాష్ట్రాలకు తరిమివేశారు. వచ్చే నెలలో మన బ్రాండ్ సీబీఎన్ వస్తారు. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే కంపెనీలు ఎలా వస్తాయో మీరే చూస్తారు. సైబరాబాద్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, రింగ్ రోడ్డు చంద్రబాబు తీసుకువచ్చారు. నెల్లూరులో 37వేల మందికి ఉద్యోగాలు ఆనాడే కల్పించాం. మళ్లీ పరిశ్రమలు తీసుకువచ్చే బాధ్యత తీసుకుంటాం.

యువతి: అమ్మఒడి అంటున్నారు. ఉచిత పథకాలు వద్దు. ఆ డబ్బుతో పాఠశాలలు, కాలేజీలు బాగు చేయాలి. ప్రతి గ్రామంలో స్కూల్ డెవలప్ మెంట్ చేయాలి. ప్రైవేటు స్కూళ్లకు పిల్లలు ఎందుకు వెళ్తున్నారో ఆలోచించాలి. ప్రభుత్వం పాఠశాలల్లో వసతులు కల్పించాలి. పిల్లలకు ఉచితంగా 15వేలు ఇచ్చే బదులు భోజనం పెట్టండి. పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేలా చూడాలి. అప్పుడే డీఎస్సీ ద్వారా ఫలితం దక్కుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఉపాధి హామీ పనుల్లో నాణ్యత ఉండటం లేదు. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి.
నారా లోకేష్- టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు డీఎస్పీ ద్వారా ఉద్యోగాలు కల్పించా. ఎన్టీఆర్, చంద్రబాబు గారి హయాంలో లక్షా 50వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. తర్వాత ముఖ్యమంత్రులందరూ 80వేల పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. చంద్రబాబు ఉన్నప్పుడు ఏపీపీఎస్సీ బలంగా ఉండేది. ఇప్పుడు రాజకీయ పునరావాసంగా మార్చారు. ఏపీపీఎస్సీలో అవినీతి గురించి మనం చూశాం. సింగిల్ జాబ్ కేలండర్ రావాలి. ప్యూన్ నుంచి గ్రూప్స్ వరకు సింగిల్ నోటిఫికేషన్ లో రావాలి. ఆ బాధ్యత మేం తీసుకుంటాం. సీపీఎస్ వారంలో రద్దు చేస్తానని చెప్పి జగన్ రెడ్డి మాట తప్పారు. దీనిపై అధ్యయనం కోసం కమిటీ వేస్తాం. 117 జీవో ద్వారా విద్యను దూరం చేశారు. నెల రోజులు ఓపిక పడితే 117 జీవో రద్దు చేస్తాం. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ఐదేళ్లలో చేసి చూపిస్తాం. సంక్షేమం-అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరుతున్నారు. కేంద్రంతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం.

యువకుడు: టీడీపీ ప్రభుత్వంలో దామరచర్లలో ఏర్పాటుచేసిన ఎంఎస్ఎంఈ పార్క్ ల ద్వారా 10వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ పరిశ్రమలు తరలివెళ్లాయి. టీడీపీ వచ్చిన తర్వాత పరిశ్రమల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తారా?
నారా లోకేష్– నెలలో మన ప్రభుత్వం వస్తుంది. గతంలో 35 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఎంవోయూలు కుదుర్చుకున్నాం. ఆ పరిశ్రమలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. నెల్లూరుకు కూడా పరిశ్రమలు తీసుకువస్తాం. మన లక్ష్యం 20 లక్షల ఉద్యోగాల కల్పన. వాటిల్లో ఎంఎస్ఎంఈ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకోసం కృషిచేస్తాం. యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం.

యువకుడు: పక్క రాష్ట్రాలకు వెళితే రాజధాని లేని రాష్ట్రం అని అందరూ హేళన చేస్తున్నారు. అమరావతిని రాజధాని చేస్తారా? అన్న క్యాంటీన్లు ఎన్ని రోజుల్లో ఓపెన్ చేస్తారు?
నారా లోకేష్- జగన్ రెడ్డే ఒక పెద్ద జోక్. స్టాండప్ కమెడియన్ లకు జగన్ రెడ్డి బాగా ఉపయోగపడుతున్నారు. విశాఖకు ఎప్పుడు వచ్చినా కొండలు చిన్నవి అవుతున్నాయని, గీతం యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సీటీ అయిందని ఎగతాళి చేస్తున్నారు. మనకు ఈ ఎన్నికలు కీలకం. ఆగిపోయిన అమరావతి పనులు కొనసాగిస్తాం. అన్న క్యాంటీన్లు వంద రోజుల్లో ఓపెన్ చేస్తాం.

జాస్మిన్: వాలంటీర్లను ఎందుకు వ్యతిరేకించారు, ఇప్పుడు మీరే ఎందుకు కావాలంటున్నారు?
నారా లోకేష్- సర్పంచ్ లుగా, కౌన్సిలర్లుగా, కార్పోరేటర్లుగా అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. వారితో వాలంటీర్ వ్యవస్థను అనుసంధానించలేదు. దీంతో ఇబ్బందులు తలెత్తాయి. మా లక్ష్యం వాలంటీర్లను ప్రజాప్రతినిధులతో అనుసంధానం చేసి పెన్షన్ తో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తాం. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించి రూ.10వేలకు జీతం పెంచుతాం.

యువతి:మధ్యతరగతి వారు ఉన్నత చదువుల కోసం ఎలా సాయం చేస్తారు? భవన నిర్మాణ కార్మికులను ఏవిధంగా ఆదుకుంటారు?
నారా లోకేష్– పై చదువుల కోసం పీజీ ఫీజు రీయంబర్స్ మెంట్, విదేశీ విద్య పథకాలు మేం ప్రవేశపెట్టాం. వేలాది మంది విద్యార్థులకు సాయం అందింది. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత రద్దు చేశారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే పాత పీజీ ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం, విదేశీ విద్య పథకాలు అందిస్తాం. భవన నిర్మాణ కార్మికుల కోసం ఉన్న బోర్డును జగన్ రెడ్డి నాశనం చేశారు. మేం వచ్చిన తర్వాత బోర్డును పునరుద్ధరిస్తాం. గతంలో కార్యక్రమాలు అమలు చేస్తాం.

యువతి:ఫీజు రీయింబర్స్ మెంట్ అందక చాలామంది నష్టపోయారు. సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న మాకు నోటిఫికేషన్లు ఏం వస్తున్నాయో కూడా తెలియడం లేదు. 20 లక్షల ఉద్యోగాల్లో ఉపాధి పొందలేని వారికి ఎలాంటి సాయం చేస్తారు?
నారా లోకేష్- జగన్ రెడ్డి మెగా డీఎస్సీ, 2.30 లక్షల ఉద్యోగాలు, జాబ్ కేలండర్, కానిస్టేబుళ్ల ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పి మాటతప్పారు. సింగిల్ కేలండర్ ద్వారా ప్రతి ఏడాది అన్ని పోస్టులు ప్రకటిస్తాం. దీనికోసం స్ట్రీమ్ లైన్ పోర్టల్ ఏర్పాటుచేస్తాం. ఫీజు రీయింబర్స్ మెంట్ అందక చాలా మంది నష్టపోయారు. దానివల్ల సర్టిఫికెట్లు అందలేదు. 6 లక్షల మందికి సర్టిఫికెట్లు రాలేదు. దీనికోసం వన్ టైం సెటిల్ మెంట్లు చేసి సర్టిఫికెట్లు అందజేస్తాం. ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి అందిస్తాం.

పి.గౌతమి, సుజాత: సొంత ఇంటి కల నెరవేర్చాలి.
నారా లోకేష్- చంద్రబాబు గారు సింగపూర్ వెళ్లి ఇళ్లు ఎలా కడుతున్నారో చూశారు. మంత్రి నారాయణ గారు కూడా అప్పుడు చూశారు. అనంతరం షేర్ వాల్ టెక్నాలజీతో నాణ్యమైన ఇల్లు కట్టాలని సంకల్పించాం. అదేవిధంగా నిర్మించాం. కిచెన్ లో గ్రానైట్ వేశాం. పార్క్, అంగన్ వాడీ సెంటర్, ఆరోగ్య కేంద్రం వంటి మౌలిక వసతులు కూడా కల్పించాం. ప్రతి ఒక్కరి కల సొంతిల్లు. ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు కట్టించాలని మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారు. నెల్లూరు పట్టణానికి 43వేల ఇళ్లు కేటాయించాం. ఇవి పూర్తైతే అందరికీ ఇవ్వవచ్చు. వచ్చే ప్రభుత్వంలో నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తాం.

నజమ్ మహ్మద్: వీఆర్ స్కూల్ కు చరిత్ర ఉంది. ఇప్పుడు మూత పడింది. తిరిగి ప్రారంభిస్తారా? వీఆర్ గ్రౌండ్ ను స్పోర్ట్ యాక్టివిటీకి మాత్రమే వినియోగించేలా చూడాలి. జాబ్ స్కిల్స్ అప్ గ్రేడ్ చేయాలి.
నారా లోకేష్- వీఆర్ స్కూల్ విషయంలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం. విద్య విషయంలో కేజీ నుంచి పీజీ వరకు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చర్యలు చేపడతాం

Leave a Reply