చలో ఢిల్లీ..

– రేపు ఢిల్లీకి పవన్
– ఖరారు కాని బాబు పర్యటన
– సీట్లపై ముందస్తు కసరత్తు
– ఇప్పటికే ఢిల్లీకి పురందేశ్వరి
ఎన్డీఏ భేటీలోపే పొత్తు ప్రకటన?
– అందరి చూపూ ఢిల్లీ వైపే
– బీజేపీ అభ్యర్ధుల ఎంపికలో ఆరెస్సెస్ నేతల జోక్యం
– దరఖాస్తు చేసుకోనివారికీ స్థానంపై అసంతృప్తి
( మార్తి సుబ్రహ్మణ్యం)

టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ప్రక్రియ వేదిక ఢిల్లీకి మారింది. బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలన్న దానిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు-జనసేన దళపతి పవన్ కల్యాణ్ ఇద్దరూ భేటీ అయ్యారు. ముందుగా ఆ పార్టీ ఆఫర్ చేసిన స్థానాలపై ఇరువురూ చర్చించారు. ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత గురువారం ఢిల్లీకి బయలుదేరనున్నారు. అయితే ప్రస్తుతానికి పవన్ పర్యటన మాత్రమే ఖరారవగా, బాబు పర్యటన పెండింగ్లో పడింది.

ఏపీలో పొత్తు రాజకీయం హస్తినకు చేరింది. బీజేపీతో పొత్తు రేపు ఖరారు కానుంది. ఆ మేరకు పార్టీ పిలుపు మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఢిల్లీకి చేరుకోగా, మరికొందరు అగ్రనేతలు సైతం ఢిల్లీకి వెళ్లారు. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం బీజేపీ 5 పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలు కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే 4 పార్లమెంటు-6 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చివరకు మధ్యేమార్గంగా 5 పార్లమెంటు, 6 అసెంబ్లీ స్థానాలతో పొత్తు కుదరవచ్చని మరికొందరు చెబుతున్నారు. దీనిపై కూడా ఇంకా స్పష్టత రావలసి ఉంది.

ఎన్డీఏ భేటీ జరగనున్న నేపథ్యంలో.. బాబు – పవన్ ఢిల్లీ పర్యటనకు సహజంగానే ప్రాధాన్యం ఏర్పడింది. ఈ క్రమంలో బీజేపీ పోటీ చేసే స్థానాల సంఖ్య ఖరారయిన తర్వాత, ఎన్డీఏలో టీడీపీ చేరే ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటివరకూ బాబు-పవన్ ఢిల్లీలో ఉంటారా? లేక ఎన్డీఏ భేటీ రోజు మళ్లీ ఢిల్లీ వెళతారా అన్నదానిపై స్పష్టత లేదు. అయితే చంద్రబాబు నాయుడు 9న ఢిల్లీ వెళ్లవచ్చని కొందరు, 11న వెళ్లవచ్చని మరికొందరు చెబుతున్నారు. పవన్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత బాబు ఢిల్లీ పర్యటన ఖరారవుతుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలాఉండగా బీజేపీ నుంచి పురందేశ్వరి, సత్యకుమార్, సుజనాచౌదరి, జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్, రఘురామకృష్ణంరాజు, రత్నప్రభ, గీత, కిరణ్ కుమార్ రెడ్డి టికెట్లు ఆశిస్తున్నారు. కొత్తగా పరిపూర్ణానందస్వామి కూడా.. తనకు హిందూపురం సీటు కావాలని అడుగుతుండటంపై పార్టీ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. పార్టీ క్యాడర్తో ఏమాత్రం పరిచయాలు, అక్కడి భౌగోళిక రాజకీయ పరిస్థితుపై ఏమాత్రం అవగాహన లేని, పరిపూర్ణానంద స్వామి టికెట్ అడగడం ఏమిటని బీజేపీ స్థానిక నేతలు ప్రశ్నిస్తున్నారు. స్థానిక ఆర్ఎస్ఎస్ నేతలు కొందరు ఆయనను ప్రోత్సహిస్తున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు.

అటు ఏలూరు ఎంపీ సీటు ఆశిస్తున్న తపన చౌదరి, అప్పుడే పాటల రచయిత అనంత శ్రీరాం జబర్దస్త్ కళాకారులతో ప్రచారానికి సిద్ధమవుతున్నారన్న వార్తలు పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. ఆ మేరకు అనంతశ్రీరాం, ఎయిర్పోర్టులో శివప్రకాష్ ని కలసినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఏలూరు ఎంపీ సీటు ఆశిస్తున్న తపన చౌదరి, అది సాధ్యం కాకపోతే కైకలూరు అసెంబ్లీ సీటు ఆశిస్తున్నారట.

పార్టీ నిబంధనల ప్రకారం వయసు ఎక్కువ అన్న కారణంతో మాజీ మంత్రి కామినేని శ్రీనివాసు, టికెట్ ఇవ్వరన్న ప్రచారం పార్టీ వర్గాల్లో కొద్దిరోజుల నుంచి వినిపిస్తోంది. ఇక కాకినాడ నుండి విశ్వం పేరు, ముగ్గురి పేర్లలో ఉండటంపై సీనియర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆరెస్సెస్ నేతలు కొందరు చక్రం తిప్పారని బీజేపీ సీనియర్లు చెబుతున్నారు.

కాగా బీజేపీకి 5 లేదా 6 సీట్లు దక్కే అవకాశం ఉండటంతో, ఎవరికి సీట్లు దక్కుతాయన్న ఉత్కంఠ కనిపిస్తోంది. అయితే ఈ స్థాయిలో పార్టీలో ఎప్పుడూ పోటీ కనిపించకపోవడం విశేషం. ప్రస్తుతం లోక్సభ ఆశిస్తున్న వారిలో ఒకరిద్దరు మినహా, మిగిలినవారంతా ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చేవారే కావడం ప్రస్తావనార్హం. ఇదిలాఉండగా ఇటీవల బీజేపీ జాతీయ సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ ఏపీ నేతలతో ‘ఎన్నికల అంశంపై చర్చించారు. ఆ మేరకు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురిని ఎంపిక చేశారు. పురందేశ్వరి తాజా ఢిల్లీ పర్యటనలో, దానిపై శివప్రకాష్ తో మరోసారి చర్చించనున్నారు. ప్లాన్ బి ప్రకారం.. పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థుల వడపోత కూడా జరగవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కాగా, బీజేపీ అసెంబ్లీ సీట్లకు దరఖాస్తు చేసుకోని వారి పేర్లు సైతం ముగ్గురి పేర్లలో ప్రత్యక్షమవుతుండంపై, బీజేపీ సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని కొందరు ఆరెస్సెస్ నేతలు, టికెట్ల ఎంపికలో జోక్యం చేసుకుంటున్నారని, వారిని “అన్ని విధాలా సంతృప్తి ” పరిచేందుకు, ఆశావహులు క్యూలు కడుతున్నారన్న చర్చ, పార్టీ వర్గాల్లో బహిరంగంగానే జరుగుతోంది.

‘టీటీడీ-జనసేనతో పొత్తు దాదాపు ఖరారయింది. సీట్ల దగ్గరే కొంత ప్రతిష్ఠంభన నెలకొంది. సంఖ్య తేడా కూడా పెద్దగా ఏమీలేదు. ఎక్కడోచోట దానికి తెరపడుతుంది. అయితే ఏ రాజకీయ పార్టీ అయినా ప్లాన్ బి తయారుచేసుకుంటుంది. అందులో భాగంగానే మొన్న వచ్చిన దరఖాస్తులపై కసరత్తు జరుగుతుంది. ఆ రకంగా రెండు జాబితాలనూ పార్టీ సిద్ధం చేసుకుంది’ అని ఒక సీనియర్ నేత వివరించారు.

Leave a Reply