– కష్టపడిన పోలీసులు, జీహెచ్ఎంసీ, రెవిన్యూ అధికారులు, సిబ్బందికు అభినందనలు
– ఏర్పాట్లను హెలికాప్టర్ నుంచి పరిశీలించిన మంత్రి తలసాని
తెలంగాణ ప్రభుత్వం పండుగలు, ఉత్సవాల విశిష్టతను మరింత పెంపొందించే విధంగా ఏర్పాట్లను చేస్తూ ఘనంగా నిర్వహిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గణేష్ నిమజ్జనం సందర్బంగా ఆయన నగరంలోని పలు ప్రాంతాలలో పర్యటించి శోభాయాత్రమ్ నిమజ్జనాన్ని పరిశీలించారు. ముందుగా ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్రలో పాల్గొన్నారు.
అనంతరం చార్మినార్, మోజం జాహి మార్కెట్, ఆబిడ్స్, లిబర్టీ, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ ల వద్ద శోభాయాత్ర గా వస్తున్న విగ్రహాలను స్వాగతం పలికారు. తదనంతరం హుస్సేన్ సాగర్ లో బోట్ లో తిరుగుతూ నిమజనాన్ని పర్యవేక్షించారు. అదేవిధంగా మధ్యాహ్నం బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి హెలికాప్టర్ లో హోంమంత్రి మహమూద్ అలీ, DGP అంజనీ కుమార్, పోలీస్ కమిషనర్ CV ఆనంద్, GHMC కమిషనర్ లోకేష్ కుమార్ లతో కలిసి ఏరియల్ వ్యూ ద్వారా నగరంలో గణేష్ విగ్రహాల శోభాయాత్ర, హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనాలు జరుగుతున్న తీరును పరిశీలించారు.
ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మీడియా తో మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో నిర్వహించే గణేష్ ఉత్సవాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. గణేష్ శోభాయాత్ర, నిమజ్జనాల సందర్బంగా వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం వివిధ శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ఈ సంవత్సరం నగరంలోని వివిధ ప్రాంతాలలో సుమారు 90 వేల విగ్రహాలను ఏర్పాటు చేశారని తెలిపారు.
శుక్రవారం ఉదయం వరకు నిమజ్జనాలు కొనసాగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా వీక్షించే 68 అడుగుల ఎత్తు గల ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం మద్యాహ్నం వరకే పూర్తయిందని, భక్తుల అభీష్టం మేరకు ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసిందని వివరించారు. ఎంతో ఉత్సాహంగా భక్తులు విగ్రహాలను నిమజ్జన శోభాయాత్రను నిర్వహిస్తున్నారని అన్నారు.
పోలీసు, టూరిజం, వాటర్ వర్క్స్, ఎలెక్ట్రికల్, హెల్త్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని అన్నారు. నగరానికి చెందిన పోలీసు అధికారులు, సిబ్బందే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా తీసుకొచ్చి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా ప్రత్యేకంగా CC కెమెరాలను ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ద్వారా శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో, గొప్పగా నిర్వహించే విధంగా ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని చెప్పారు.