Suryaa.co.in

Andhra Pradesh

నలుపంటే భయమెందుకో సిఎం చెప్పాలి

అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య

ఎరుపంటే కొందరికి భయం భయం, పసిపిల్లల వారి కన్నా, నయం నయం అన్నారు శ్రీకాకుళం ఉద్యమ కారులు సుబ్బారావు పాణిగ్రాహి. ఎరుపంటే భయపడే ముఖ్యమంత్రులు తెలుసు కానీ, నలుపంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు భయమో తెలియటం లేదని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య సందేహం వ్యక్తం చేశారు.

గురువారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. విజయవాడలో శుక్రవారం నిర్వహించే సభకు డ్వాక్రా మహిళలందరూ కచ్చితంగా హాజరు కావాలని అంటూనే, సభకు వచ్చే మహిళలు నల్ల చీరలు, నల్ల జాకెట్లు ధరించరాదని, నల్ల రిబ్బన్లు, నల్ల చున్నీతో రాకూడదని ఆదేశిస్తున్నట్లు తెలిపారు. ‘ సీఎం సభకు మీరు రాకుంటే, మా ఉద్యోగాలు పోతాయి’ అంటూ రిసోర్స్ పర్సన్స్ పైఒత్తిడి చేస్తున్న విషయాలు పత్రికల్లో చూసి, కంగారు పడ్డ అధికారులు ఆగమేఘాల మీద రిసోర్స్ పర్సన్స్ తో మీటింగ్ లు పెట్టి క్లాసులు పీకారని చెప్పారు.

ఎవరూ వాట్సాప్ లలో మెసేజ్ లు, వాయిస్ మెసేజ్ లు పెట్టరాదు అని, స్వయంగా ఫోన్లు చేసి మహిళలను సమీకరణ చేయాలని, లేకుంటే ఉద్యోగాలు ఊడిపోతాయి అంటున్నారని పేర్కొన్నారు. నల్ల దుస్తులు, నల్ల వస్తువులు తీసుకుని వస్తే చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు అన్నారు. ఒక్కో మహిళకు సౌకర్యాలతో పాటు రూ .200 నుంచి రూ. 300 డబ్బులు కూడా ఇస్తామని చెప్పినట్లుగా తెలిసిందన్నారు.

సింహం సింగిల్ గా వస్తోంది అంటున్న వైకాపా ప్రభుత్వానికి మహిళలు నల్ల దుస్తులు ధరిస్తే వచ్చిన ఇబ్బంది ఏంటో మంత్రులైనా తెలియపరచాలని బాలకోటయ్య డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE