Suryaa.co.in

Andhra Pradesh

మద్యం విక్రయాలలోని అక్రమ సొమ్మును కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మేనేజ్మెంట్

– కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తో పాటు, మద్రాస్ నగరానికి చెందిన మరొక రెడ్డి ఈ మనీ మేనేజ్మెంట్ లో కీలకం
– అక్రమ మద్యం విక్రయం ద్వారా ఎంత సొమ్ము లభిస్తుందో, అది ఎవరికి చేరుతుందో… పూర్తి వివరాలతో సకాలంలో సరైన సమయంలో వెల్లడిస్తా
– గృహిణులు దాచుకున్న సొమ్ము వారి భర్తల ద్వారా కొట్టేసిన జగన్మోహన్ రెడ్డి సర్కార్
– మూడు లక్షల కోట్ల రూపాయల కొట్టేసి.. 2.35 లక్షల కోట్ల రూపాయలను పంచి నేను అంత చేశాను… ఇంత చేశాననడం హాస్యాస్పదం
– రాష్ట్రంలో 40 క్లస్టర్లలో 200 నుంచి 250 నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఉంటే… ఆ శిక్షణ కేంద్రాలు లేవన్నట్లుగా చెబుతున్నారు
– నన్ను రాజకీయ సలహాదారుడిగా నియమించుకొనుకుంటే నేను మంచి సలహాలు ఇచ్చి ఉండేవాడిని
– నరసాపురం ఎంపీ రఘు రామ కృష్ణంరాజు

దోచుకునే దగ్గర నో డిజిటల్ చెల్లింపులు… కొట్టి వేయలేని దగ్గర మాత్రం పరిపూర్ణ పారదర్శకంగా వ్యవహరిస్తున్నామంటూ కబుర్లు చెబుతున్నారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామకృష్ణంరాజు అన్నారు. మద్యం విక్రయాలు నగదులో కొనసాగించడానికి, డ్యూటీ పే చేసిన సరుకు విక్రయాల సొమ్ము రాష్ట్ర ఖజానాకు చేరుతుంటే… డ్యూటీ పే చేయకుండా మద్యం దుకాణాల ద్వారా విక్రయిస్తున్న సరుకు సొమ్ము వ్యక్తిగత ఖాతాలో జమ అవుతోంది. అది ఎవరి వ్యక్తిగత ఖాతానో ప్రజలందరికీ తెలుసు. స్కిల్ డెవలప్మెంట్ స్కీం లో స్కామ్ జరిగిందని సచివులంతా మాట్లాడుతున్నారు.

మద్యం విక్రయాలలో జరుగుతున్న లక్షల కోట్ల రూపాయల కుంభకోణం గురించి ఏ ఒక్కరూ సమాధానం చెప్పడం లేదు. మద్యం విక్రయాలలోని అక్రమ సొమ్మును కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మేనేజ్మెంట్ చేస్తున్నారు. ప్రతిరోజు అక్రమ మద్యం విక్రయం ద్వారా ఎంత సొమ్ము లభిస్తుందో, అది ఎవరికి చేరుతుందో… పూర్తి వివరాలతో సకాలంలో సరైన సమయంలో వెల్లడిస్తామని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తో పాటు, మద్రాస్ నగరానికి చెందిన మరొక రెడ్డి ఈ మనీ మేనేజ్మెంట్ లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మద్యం అమ్మకాల ద్వారా ఎక్సైజ్ డ్యూటీ రూపంలో నాలుగున్నర ఏళ్ల లో 91 వేల కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ఖజానాకు చేరుకుంది. ఐదేళ్లలో లక్ష పదిహేను వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుంది.

ఎన్నికలకు ముందు దశలవారీగా మధ్య నిషేధం అమలు చేస్తానని మహిళలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, మధ్య నిషేధమన్నది అమలు చేయకుండా గృహిణులు దాచుకున్న 3 లక్షల కోట్ల రూపాయలను వారి భర్తల ద్వారా కొట్టేశారని రఘు రామకృష్ణంరాజు అన్నారు. ఆడపడుచుల, భర్తల రక్త, మాంసాలను దోచుకొని అందులో కొంత పంచి ” జగన్ ఎందుకు కావాలి… ఎందుకు రావాలో” ప్రచారం చేయాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన మండిపడ్డారు.

రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… గతంలో 60 రూపాయలకు నాణ్యమైన మద్యం సీసా క్వార్టర్ లభించగా, ఇప్పుడు నాసిరకమైన క్వార్టర్ మద్యం సీసాను 160 రూపాయలకు విక్రయించి లక్షల కోట్ల రూపాయల డబ్బు దోచుకుంటున్నారన్నారు. ఈ డబ్బంతా రూపాయి, రూపాయి చొప్పున మహిళలు దాచుకున్న సొమ్మే. దోమ మనిషికి తెలియకుండానే రక్తాన్ని పీల్చినట్టుగా, జలగ సైజు కలిగిన ఈ దోమ మీ భర్త రక్తాన్ని లాగేస్తూ… తిరిగి మైక్రో మిల్లీమీటర్ అంతా రక్తాన్ని వెనక్కి ఇచ్చి సంఘసంస్కర్త మాదిరిగా ఫోజులు కొట్టడం ఆశ్చర్యంగా ఉంది.

ప్రజలకు అంతా తెలుసు. మహిళలారా మేల్కొనండి… కీలేరిగి వాత పెట్టే సమయం వచ్చింది. మీ భర్తలకున్న మద్యం అలవాటును ఇప్పటికిప్పుడు ఎలాగూ మానిపించలేరు. మరో ఆరు నెలలు ఓపిక పట్టండి. నాణ్యమైన మద్యాన్ని సేవించే అవకాశం వారికి రానున్న ప్రభుత్వ హయాంలో లభిస్తుంది. అప్పుడు మీ భర్తల జీవితకాలం మరో 20 నుంచి 30 ఏళ్లు పాటు పదిలంగా ఉంటుంది. రాష్ట్రంలో విక్రయిస్తున్న నాసిరకం మద్యం సేవించడం వల్ల, 20 నుంచి 30 సంవత్సరాల పాటు ఆరోగ్యంగా బ్రతకాల్సిన వారు అర్ధాంతరంగా … ఏడాది, రెండేళ్లకే అవయవాలు చెడిపోయి చనిపోతున్నారు.

నాసిరకమైన మద్యం సేవిస్తున్న వారికి, నాణ్యమైన మద్యం అందిస్తే ఆ కుటుంబానికి ఏడాదికి 50 నుంచి 60 వేల రూపాయలు ఆదా అవుతుంది. ఈ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల కంటే మెరుగైన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు హామీ ఇస్తున్నారని రఘు రామ కృష్ణంరాజు గుర్తు చేశారు.

ఉన్నది లేనట్టుగా… లేనిది ఉన్నట్టుగా భ్రమలు కల్పిస్తున్నారు
పీసీ సర్కార్ వంటి మాంత్రికుడు ఉన్నది లేనట్టుగా… లేనిది ఉన్నట్లుగా భ్రమలు కల్పించినట్లుగానే రాష్ట్రంలో కూడా మెజీషియన్ పాలన కొనసాగుతోందని రఘురామకృష్ణం రాజు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తాను మాంత్రికుడని అనడం లేదు.. ఈ ప్రభుత్వంలో ఇంకా ఎంతో మంది మాంత్రికులు ఉన్నారు. రాష్ట్రంలో 40 క్లస్టర్లలో 200 నుంచి 250 నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఉంటే… ఆ శిక్షణ కేంద్రాలు లేవన్నట్లుగా చెబుతున్నారు.

గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో నైపుణ్య శిక్షణ కేంద్రాలు బేషుగా కొనసాగాయి. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవి, బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఆయన ఆశీస్సులతో నైపుణ్య శిక్షణ కేంద్రాలు సక్రమంగా పని చేశాయని చైర్మన్లుగా వ్యవహరించిన మధుసూదన్ రెడ్డి, అజయ్ రెడ్డిలు పేర్కొన్నారని రఘు రామకృష్ణంరాజు గుర్తు చేశారు. ఇప్పుడు సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ కేంద్రాలనేవి లేవని పుసుక్కున నోరు జారారు.. ఇక్కడ ఉన్నది కూడా లేనట్లుగా చూపే ప్రయత్నాన్ని చేస్తున్నారు.

పిసి సర్కార్ తన జూనియర్ సర్కార్లతో ఈ విధంగా మాట్లాడిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఎక్కడకు పోయాయో చూస్తే తెలుస్తుంది. కానీ నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడనివ్వడం లేదు. ఇక లేనిది ఉన్నట్లుగా చూపేందుకు ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు విస్మయాన్ని కలిగిస్తోంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు అమరావతి అన్నదే లేకుండా చేశారు .

ఇక ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకముందే, ఇన్నర్ రింగ్ రోడ్డులో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. లేని దాన్ని ఉన్నట్లుగా చెబుతూ… ఇన్నర్ రింగ్ రోడ్డులో కుంభకోణం జరిగిందని ప్రభుత్వ అధి నేత మెప్పుకోసం సిఐడి పోలీసులు తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు తో పాటు, నారా లోకేష్ ను ముద్దాయిలుగా చేర్చడం సిగ్గుచేటు.

ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన ఐఫోన్ 15 ను కొంతమంది దొంగలించారని ఫిర్యాదు చేయ బోగా, ఐఫోన్ 15 ఎక్కడ కొన్నావని సదరు వ్యక్తిని పోలీస్ అధికారి ప్రశ్నించగా… తాను ఐఫోన్ 15 కొనుగోలు చేస్తే వారు దొంగిలిస్తారని అనుమానం ఉంది అన్నట్లుగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు వ్యవహారం ఉందని రఘురామ కృష్ణంరాజు చమత్కరించారు.

చెత్త పన్ను వసూల్లేమో ఆన్లైన్ ద్వారా… ఆదాయం వచ్చే మద్యం, ఇసుక అమ్మకాలు మాత్రం నగదు లోనా? ఇదెక్కడి విడ్డూరం??
రాష్ట్ర ప్రభుత్వ పాలన ఎంత పారదర్శకంగా ఉందంటే ప్రధానమంత్రి డిజిటల్ ఇండియా ఆశయ సాధన కోసమన్నట్టు గా చెత్త పన్నును ఆన్లైన్ ద్వారా వసూలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి సర్కార్, మద్యం, ఇసుక అమ్మకాలను మాత్రం నగదులోనే విక్రయిస్తుందని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరుకునే చిలిపి బిల్లులను ఆన్లైన్ ద్వారా వసూలు చేస్తూ… మద్యం, ఇసుక చెల్లింపులకు మాత్రం నో ఆన్లైన్ అని అంటున్నారు.

ఇసుక అమ్మకాలకు ఆన్లైన్ లో చెల్లింపులకు కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారని, పారదర్శకంగా నగదు లో ఇసుక విక్రయాలను కొనసాగిస్తున్నామని రాష్ట్రమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొనడం విస్మయాన్ని కలిగిస్తుంది. ఇసుక కొనుగోలుదారులు మంత్రి చెప్పినట్లుగా ఆన్లైన్లో చెల్లింపులకు ఎందుకు ఇబ్బందులు పడతారో ఎంత ఆలోచించినా అంతు చిక్కడం లేదు. దీన్నిబట్టి ప్రజలకు సినిమా అర్థమయింది.

దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ రేట్లు అధికంగా ఉన్నాయి. సేల్స్ టాక్స్ ద్వారా వచ్చే ఆదాయం అదనం. అయినా, నేను బటన్ నొక్కుతున్నాను… బటన్ నొక్కుతున్నానని జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కే కార్యక్రమానికి తమ అవయవాలను పాడు చేసుకుంటూ, రక్తాన్ని ధారపోస్తున్నది రాష్ట్రంలోని మహిళల భర్తలే.

ఒక్క అవకాశం అంటే… ఒక్క రూపాయి జీతానికి పని చేస్తాడని నమ్మి అవకాశం ఇస్తే హెలికాప్టర్ కోసమే 100 కోట్ల రూపాయలు, తన భవంతి మరమ్మతులకు పాతిక వేల కోట్లు, విశాఖపట్నంలో మరొక భవంతి నిర్మాణానికి వందల కోట్లు, రాష్ట్రవ్యాప్తంగా హెలిప్యాడ్ల నిర్మాణానికి ఎన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. పేదల కోసం ఎన్నో స్కీములను అమలు చేయాలనుకుంటే… రాష్ట్రంలోని మగవారు తాగడం మానివేస్తే ఎలా అని రేపటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తారు కాబోలు అంటూ రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు.

వ్యవస్థలను ఇప్పుడు మీరు మేనేజ్ చేస్తున్నారని అంటే ఊరుకుంటారా?
గతంలో చంద్రబాబు నాయుడు పై నమోదు చేసిన కేసులను న్యాయస్థానాలు కొట్టివేస్తే, ఆయన వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ఆరోపణలు గుప్పించినవారు… ఇప్పుడు ఆయన చేయని తప్పుకు జైల్ కు వెళ్లి 20 రోజులు అవుతున్న బయటకు రాలేదు అంటే ఇప్పుడు మీరు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని అంటే ఊరుకుంటారా? అంటూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను రఘు రామకృష్ణంరాజు ప్రశ్నించారు.

గతంలో నన్ను అరెస్టు చేసినప్పుడు, ఒక్కరోజులోనే జైలు నుంచి బయటకు వచ్చాను. నన్ను దొంగ చాటుగా లాకప్ లో చిత్రహింసలకు గురిచేశారు. ఈ విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి కూడా ధైర్యంగా బయటకు చెప్పుకోలేకపోయారు. కోర్టులో తీర్పులన్నీ వ్యతిరేకంగా వస్తే చంద్రబాబు నాయుడు ఇన్నాళ్లు న్యాయస్థానాలను మేనేజ్ చేసినట్లు ఎలా అవుతుందని నిలదీశారు.

న్యాయవ్యవస్థను చులకనగా చేసి మాట్లాడిన వారిపై అడ్వకేట్ జనరల్ మాట్లాడిన తీరు నా మనసును దోచుకుంది. అయితే, గతంలో న్యాయమూర్తులపై… న్యాయ వ్యవస్థ పై దుర్మార్గమైన వ్యాఖ్యలు చేసిన వారు ఇప్పుడు రియలైజ్ కావడం హర్షించదగ్గ పరిణామమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అంటగట్టి వ్యాఖ్యలు చేశారని ఆయనకు బాధ తెలిసి వచ్చింది. న్యాయమూర్తులపై ఎవరు వ్యాఖ్యలు చేసినా తప్పు తప్పే.

ఇటీవల తాను చేసిన తప్పులు తెలుసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి మరింతగా తన తప్పులను తెలుసుకుని మారితే, రానున్న ఎన్నికల్లో కనీస స్థానాలైనా దక్కుతాయి. జగన్మోహన్ రెడ్డి నియమించుకున్న సలహాదారులు మంచి సలహాలను ఇచ్చి ఆయనను సక్రమ మార్గంలో నడిపించాలని సూచించారు. నన్ను రాజకీయ సలహాదారుడిగా నియమించుకొనుకుంటే నేను మంచి సలహాలు ఇచ్చి ఉండేవాడిని. కానీ నా పేరు చివరన రాజు ఉంది రెడ్డి లేదని రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు .

చంద్రబాబు నాయుడు అదనంగా జైలులో గడపాల్సిన పరిస్థితి నెలకొనడం దురదృష్టకరం
తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల వల్ల అదనంగా జైలులో గడపాల్సిన పరిస్థితి నెలకొనడం దురదృష్టకరమని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. నాట్ బిఫోర్ మీ అనే అధికారం న్యాయమూర్తులకు ఉన్నదని, గతంలో నా కేసులలో కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. న్యాయమూర్తులు పారదర్శకంగా వ్యవహరిస్తున్నారనడానికి ఇది ఒక సంకేతం.

స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ స్కామ్ లో A36 గా ఉన్న సత్యప్రసాద్ గంటా, ఆగస్టు మాసంలో ముందస్తు బెయిల్ అడిగినప్పుడు నిరాకరిస్తే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్టోబర్ మూడవ తేదీన ఆ కేసు వాదనలు కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం విననున్న నేపథ్యంలో, చంద్రబాబు నాయుడు కేసు కూడా అదే బెంచ్ కు కేటాయిస్తారా?, లేకపోతే మరొక బెంచ్ కు కేటాయిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

బుధవారం నాడు చంద్రబాబు నాయుడు అభిమానుల ఆశలు అడియాశలు అయ్యాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూత్రా తీవ్ర ప్రయత్నాన్ని చేశారు. అక్టోబర్ మూడవ తేదీన వాదనలను వినడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంగీకరిస్తూ, తగిన బెంచ్ కు కేటాయిస్తామని తెలిపారని రఘురామకృష్ణంరాజు వెల్లడించారు.

LEAVE A RESPONSE