– కిషన్‌రెడ్డికి రాజీనామా లేఖ పంపిన విజయశాంతి
– మెదక్ కాంగ్రెస్ ఎంపీగా పోటీ?
– రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం
– పువ్వు పార్టీలో ముగిసిన విజయ ‘అశాంతి’ పాత్ర
– ఆది నుంచీ ఆమెది అసంతృప్తి ప్రస్థానమే
– కిషన్‌రెడ్డి కులాభిమానంపై రాములమ్మ అసంతృప్తి
– తన వారికే ‘రెడ్డి’కార్పెట్ వేస్తున్నారని సన్నిహితుల వద్ద వ్యాఖ్యలు
– విజయశాంతి సేవలు వాడుకోవడంలో బీజేపీ వైఫల్యం
– బండి సంజయ్ ఉన్నప్పుడే ప్రోత్సాహం
– కిషన్‌రెడ్డి వచ్చాక పూర్తిగా పక్కనపెట్టిన వైనం
– దానితో అసంతృప్తితో వరస ట్వీట్లు
– చివరాఖరకు ‘చే’యెత్తి జైకొట్టిన రాములమ్మ
– ఇక మిగిలింది విశ్వేశ్వరరెడ్డి మాత్రమే
– మళ్లీ మ్యాచ్‌ఫిక్సింగ్‌పై సీనియర్లలో అనుమానాలు
– గతంలో ఐదు సీట్లపై మ్యాచ్‌ఫిక్సింగ్‌ను గుర్తు చేస్తున్న సీనియర్లు
– ఇప్పుడు అనేక చోట్ల జూనియర్లకు టికెట్ల కేటాయింపుతో మళ్లీ అనుమానాలు
– విజయ‘అశాంతి’పై ముందే చెప్పిన ‘సూర్య’
( మార్తి సుబ్రహ్మణ్యం)
అనుకున్నదే అయింది. బీజేపీలో అసంతృప్తితో రగిలిపోతున్న రాములమ్మ ఎట్టకేలకు పార్టీకి రాం రాం చెప్పారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపించారు. శుక్రవారం తెలంగాణకు రానున్న కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ సమక్షంలో, విజయశాంతి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు. దీనితో సుదీర్ఘకాలం బీజేపీలో ఆమె పోషించిన పాత్ర ముగిసినట్టయింది. అయితే రాములమ్మ నిష్క్రమణ నాయకత్వ వైఫల్యమేనన్న వ్యాఖ్యలు బీజేపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లోకి విజయశాంతి?
తెలంగాణ ఫైర్ బ్రాండ్, మాజీ ఎంపి విజయశాంతి బీజేపీకి రాజీనామా చేయటం సంచలనం సృష్టించింది. నిజానికి ఆమె పార్టీకి రాజీనామా చేస్తారని చాలాకాలం నుంచి ప్రచారం జరుగుతున్నా, పార్టీ నాయకత్వం ఆ మేరకు నష్టనివారణకు దిగకపోవడం ఆశ్చర్యం. తన సేవలు వినియోగించుకోని పార్టీ నాయకత్వంపై ఆమె చాలాకాలం నుంచి అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆ మేరకు సందర్భం వచ్చినప్పుడల్లా ట్వీట్లు చేసి, పార్టీని ఇరుకున పెట్టినా, నాయకత్వం ఆమెను బుజ్జగించే ప్రయత్నాలు చేయలేదు. తెలంగాణకు ఇద్దరు ముగ్గురు ఇన్చార్జిలు ఉన్నప్పటికీ, వారెవరూ ఆమెతో మాట్లాడి అసంతృప్తి చల్లార్చే ప్రయత్నాలు చేయకపోవడంపై కార్యకర్తల్లో ఆశ్చర్యం వ్యక్తమయింది. ఆ క్రమంలో ఆమెకు ఆందోళన కార్యక్రమాల కమిటీ చైర్మన్ ఇచ్చినప్పటికీ అది.. రాములమ్మలోని ఆందోళనను సంతృప్తిపరచలేకపోయింది. ఇది కూడా చదవండి: పాపం.. విజయ ‘అశాంతి’
నిజానికి విజయశాంతి సేవలు వినియోగించుకోవడంలో బీజేపీ నాయకత్వం విఫలమైందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. జనంలో ఇమేజ్, సినీ గ్లామర్, ముక్కుసూటి ప్రసంగాలు చేసే విజయశాంతి సేవలను నాయకత్వం సక్రమంగా వినియోగించుకుని ఉంటే, ఉత్తర తెలంగాణలో పార్టీ బలపడి ఉండేదని విశ్లేషిస్తున్నారు. గత అధ్యక్షుడు బండి సంజయ్ కొద్దిమేరకు విజయశాంతికి గౌరవ స్థానం కల్పించినా, కిషన్‌రెడ్డి పూర్తిగా పక్కనపెట్టడంతో ఆమె ఆత్మాభిమానం దెబ్బతిందని చెబుతున్నారు.
తొలుత విజయశాంతిని.. కేటీఆర్‌పై సిరిసిల్లలో పోటీ చేయించాలన్న చర్చ జరిగింది. అయితే తాను సిరిసిల్ల, కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో ఎక్కడినుంచయినా పోటీ చేసేందుకు సిద్ధమేనని విజయశాంతి నాయకత్వానికి స్పష్టం చేశారు. దానితో ఆమె కేటీఆర్-కేసీఆర్‌లలో ఒకరిపై పోటీ చేయడం ఖాయమన్న ప్రచారం జరిగింది. అయితే చివరి జాబితాలో కూడా తన పేరు లేకపోవడం, లోక్‌సభ ఎన్నికల్లో పోటీపైనా స్పష్టత లేకపోవడంతో ఇక బీజేపీలో తనకు భవిష్యత్తు లేదన్న నిర్ణయానికి వచ్చినట్లు ఆమె తాజా నిర్ణయం స్పష్టం చేసింది.
కిషన్‌రెడ్డి అనుసరించే కులతత్వంపై, ఆమె పలువురు నేతల వద్ద అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. కిషన్‌రెడ్డికి రెడ్లపై మమకారం ఎక్కువని, పార్టీ-ప్రభుత్వ పదవులతోపాటు..తన చుట్టూ ఉన్న వారిని, తన సొంత కార్యక్రమాలకు రెడ్లనే నియమిస్తున్నారంటూ ప్రచారం జరగడం, పార్టీకి మంచిది కాదంటూ… విజయశాంతి పలు సందర్భాల్లో, తనను కలిసిన పార్టీ నేతల వద్ద వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు.
కిషన్‌రెడ్డి ప్రమాణస్వీకార సభకు హాజరైన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాకను ఆక్షేపిస్తూ, విజయశాంతి అర్ధంతరంగా సభ నుంచి నిష్క్రమించడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ‘తెలంగాణకు అడ్డుపడ్డ వారితో వేదిక పంచుకోవడం ఇష్టం లే కనే వెళ్లిపోయాన’ంటూ చేసిన ట్వీట్ ఆమె అసంతృప్తిని స్పష్టం చేసింది. చివరకు ప్రధాని మోదీ-హోంమంత్రి అమిత్‌షా- పార్టీ అధ్యక్షుడు నద్దా హైదరాబాద్‌కు వచ్చినప్పటికీ, వారిని కలవకుండా ముఖం చాటేశారు. దానితో అప్పుడే విజయశాంతి పార్టీ మార్పు సంకేతాలు వెలువడ్డాయి. ఇది కూడా చదవండి: మోదీ సభకు డుమ్మాతో క్లారిటీ
కాగా విజయశాంతిని రానున్న లోక్‌సభ ఎన్నికల్లో, మెదక్ బరిలోకి దించేందుకు కాంగ్రెస్ పార్టీ సూత్రప్రాయమైన హామీ ఇచ్చిందని సమచారం. గతంలో టీఆర్ఎస్ ఎంపీగా కూడా, మెదక్ నుంచే విజయం సాధించడం ప్రస్తావనార్హం. కేసీఆర్ కంచుకోటల్లో ఆమెను నిలబెట్టడం ద్వారా, బీఆర్ఎస్ను చావుదెబ్బతీయాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. ఆ మేరకు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆమెకు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం.
అయితే బీజేపీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి- వివేకా నిష్క్రమించిన తర్వాత విజయశాంతి, కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా రాం రాం చెబుతారన్న ప్రచారం జరిగింది. ఆ ఇద్దరిలో ఒకరైన విజయశాంతి ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేయగా, ఇక విశ్వేశ్వరరెడ్డి ఒక్కరే మిగిలినట్లయింది. అయితే శేరిలింగంపల్లి సీటును తాను సిఫార్సు చేసిన అభ్యర్ధికి ఇచ్చినందున, బహుశా ఎన్నికల వరకూ విశ్వేశ్వరరెడ్డి పార్టీ మారకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందే ఆయన, విజయశాంతి దారిలోనే చేయెత్తి జైకొట్టవచ్చని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కాగా విజయశాంతి నిష్క్రమణతో పార్టీ శ్రేణుల్లో ఒకే తరహా అనుమానాలు-చర్చకు తెరలేచింది. బీఆర్ఎస్ను వ్యతిరేకించే బలమైన నేతలందరినీ.. పొమ్మనలేక పొగబెట్టడం వెనుక కుమ్మక్కు రాజకీయాలున్నాయని, పార్టీ సీనియర్లు అనుమానిస్తుండటం ప్రస్తావనార్హం. కేటీఆర్‌తోపాటు, కీలకమైన మంత్రులపై బలమైన అభ్యర్ధులను పోటీకి దింపకపోవడం, టికెట్లు తీసుకున్న అభ్యర్ధులు.. బీఆర్ఎస్ అభ్యర్ధులకు ఎక్కడా ఇబ్బంది కలిగించకపోవడం, అసలు చాలామంది అభ్యర్ధులు ప్రచారపర్వంలోనే సీరియస్‌గా కనిపించకపోవడంతో.. క్యాడర్లో అనేక అనుమానాలకు తెరలేచింది.
దానితో మళ్లీ గత ఎన్నికల ముందు, గ్రేటర్ హైదరాబాద్‌లోని ఐదు స్థానాల్లో .. ఉస్మానియా వర్శిటీ సాక్షిగా జరిగిన మ్యాచ్‌ఫిక్సింగ్ రాజకీయమే, మళ్లీ పునరావృతమైందా అన్న చర్చ పార్టీ సీనియర్లలో బాహాటంగానే జరుగుతోంది. అప్పుడు నగరంలో వాజ్‌పేయి విగ్రహ ప్రతిష్ఠ అంశంపై చర్చించేందుకు వెళ్లిన సందర్భంలో… ఐదు నియోజకవర్గాల్లో తమపై బలహీనమైన అభ్యర్ధులను నిలబెట్టాలని నాటి టీఆర్ఎస్తో ఒప్పందం జరిగిందన్న ప్రచారాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
తాజాగా హైదరాబాద్ నగరంలోని కొన్ని కీలక నియోజకవర్గాల్లో.. బలహీనమైన జూనియర్ నేతలకు టికెట్లు ఇవ్వడం ద్వారా, మ్యాచ్‌ఫిక్సింగ్ అనుమానాలకు నాయకత్వమే ఆస్కారం ఇచ్చిందన్న వ్యాఖ్యలు పార్టీ సీనియర్లలో వ్యక్తమవుతున్నాయి.