Suryaa.co.in

Political News

ఆంధ్రపై మోడీకీ ఓ ‘విజన్’ ఉంది!

‘విజన్’ అనే పదం వినపడగానే, చంద్రబాబు నాయుడి పేరు గుర్తుకు వస్తుంది. ఆయన పేరు తో ఆ పదం అంతగా మమేకమై పోయింది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమి పాలవడంతో…. ఆ పదం బాగా మసకబారి పోయింది.

ఇప్పుడు ఎన్నికల సీజన్ లోకి ఆంధ్రప్రదేశ్ అడుగు పెట్టడం తో, మళ్ళీ ‘ విజన్ ‘ అనే పదం బాగా వాడుక లోకి వస్తున్నది. అయితే, చంద్రబాబు నాయుడుకు మాత్రమే కాదు, ప్రధాని మోడీకి కూడా ఆంధ్రప్రదేశ్ పై ఒక ‘విజన్ ‘ ఉంది. దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నప్పటికీ ; నరేంద్ర మోడీకి రెండు రాష్ట్రాల పైనే ‘విజన్’ ఉంది. ఒకటి – గుజరాత్, రెండు – ఆంధ్రప్రదేశ్. అందుకే – ప్రధాని హోదాలో గుజరాత్ వెళ్ళినన్ని సార్లు ఏ రాష్ట్రం వెళ్లి ఉండరు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అపాయింట్ ఇచ్చినన్ని సార్లు….. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికీ ఇచ్చి ఉండరు. అందుకే, గుజరాత్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పట్ల ప్రధాని మోడీకి అభిమాన పాత్రులు. గుజరాత్ లో మోజేపీ ( మోడీ నేతృత్వంలోని బీజేపీ )నేతృత్వంలోనే ప్రభుత్వ నిర్వహణ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో లేదు. అదొక్కటే తేడా.

దేశం లో ఎక్కడైనా ముస్లిం వాయిస్ గట్టిగా ఉంటేనే బీజేపీ కి ఉనికి ఉంటుంది . తెలంగాణ లో ” ఇది ” గట్టిగానే ఉంది . అందుకే అక్కడ బీజేపీ ఉంది . గుజరాత్ లో రెండువేల మంది ముస్లిం లను సొరకాయలు కోసినట్టు ఊచకోత కోశారు. అందువల్ల అక్కడ బీజేపీ ఉంది . బలం గా ఉంది. ఉత్తర్ ప్రదేశ్ లో ముస్లిం ల నుంచి హిందువులకు భయం ఉంది . అందుకని అక్కడ బీజేపీ ఉంది . అస్సాం లో , బెంగాల్ లో , మహారాష్ట్ర లో, రాజస్థాన్ లో …. వగైరా రాష్ట్రాల్లో ముస్లిం ప్రభావం బలం గా ఉండడం వల్ల ..; బీజేపీ ప్రభావం కూడా గట్టిగా ఉంటుంది.

తెలంగాణ లో ఎంఐఎం ఉంది. అందుకని కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారు. ఆంధ్ర సమాజం లో ముస్లిం ప్రభావం…. హిందువులు భయపడాల్సినంతగా లేదు. హిందువులు – ముస్లిం లు భాయి – భాయి అనుకుంటూ పాలు – తేనె లా కలిసిపోయి జీవిస్తుంటారు.అందుకని ఆంధ్ర లో బీజేపీ కి ఆదరణ లేదు. ఉండదు కూడా. అటువంటి ఆంధ్ర లో బీజేపీ అధ్యక్ష పదవికి కామరాజు అయితే ఏమిటి….., సోమరాజు అయితే ఏమిటి అన్నట్టుగా ఆ పార్టీ కేంద్ర నాయకులు వ్యవహరిస్తుంటారు. అందుకే సోము వీర్రాజు ను తీసేసి పురందేశ్వరి ని బెట్టారు. ఆవిడనూ రేపో… మాపో తీసేసి మరొకరిని పెట్టినా ఆశ్చర్యం ఏమీ లేదు.

రాష్ట్రం లోని అధికార వైసీపీ పార్టీ కి ఆవిడ పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. అందువల్ల, ఆవిడను తీసేసి, వైసీపీ కి నొప్పి కలగకుండా సన్నాయి నొక్కుల లాటి విమర్శలతో కాలక్షేపం చేసే వారిని బీజేపీ అధ్యక్షులు గా నియమించినా ఆశ్చర్యం ఏమీ లేదు. ప్రధాని నరేంద్ర మోడీ ఏకైక లక్ష్యం…. మూడోసారి ప్రధాన మంత్రి కావడం అనడం లో ఎవరికీ సందేహం లేదు . ఆ దిశగానే ఆయన ఆలోచనలు, చర్యలు, పర్యటనలు, ప్రసంగాలు ఉంటున్నాయి.

రెండు సార్లు ప్రధాన మంత్రి కావడం లో పెద్ద ” కిక్ ” ఏమీ లేదు. రాజకీయాలలో తాడు, బొంగరం కూడా లేదని రాజకీయ వర్గాల వారిలో అధికులు భావించే మన్మోహన్ సింగ్ కూడా రెండు సార్లు ప్రధాన మంత్రి అయ్యారు. అందువల్ల, మూడోసారి ప్రధాని కావడమే నరేంద్ర మోడీ ఏకైక లక్ష్యం. దానికోసం ఏ రాష్ట్రం లో అయినా…ఎన్ని సార్లయినా పర్యటించ డానికి ఆయన సిద్ధం. ఏ వేదిక మీద ఎవరిని ఆలింగనం చేసుకోడానికయినా ఆయన సిద్ధం.

ఆంధ్ర లో మాత్రం టీడీపీ ని ఆలింగనం చేసుకోడానికి మాత్రం సిద్ధం గా లేరు. కనీసం ఒక వేదిక ను పంచుకోడానికి కూడా ప్రధాని మోడీ సుముఖంగా లేరు. ఏపీ పై మోడీ ‘విజన్’ కు, చంద్రబాబు ‘విజన్’ భిన్నం గా ఉండడం తో మోడీ కి కుదరడం లేదు. మోడీ, తన విజన్ ను నేరుగా అమలు చేయలేరు కదా! దానిని జగన్మోహన్ రెడ్డి సారధ్య ప్రభుత్వం అమలు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ సారధులు దానికి సంపూర్ణంగా సహకరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మోడీ “ఎజెండా”,” విజన్” ఇంకా అసంపూర్ణంగా ఉండి ఉంటే ; మరో అయిదేళ్లపాటు జగన్ సారధ్య ప్రభుత్వం ద్వారా – మోడీ తన ఎజెండా ను అమలు చేయించాలని అభిలషిస్తూ ఉండి ఉండవచ్చు కూడా.

అయితే ; బీజేపీ కి ‘మిత్ర ‘ పక్షం గా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ ( అంటే జన సేన ) మాత్రం టీడీపీ వైపు వెళ్లకుండా మోడీ ఆపలేకపోయారు. పవన్ కళ్యాణ్ టీడీపీ వైపు వెళ్లకుండా ఉంటే, ఆయనకు ఇంకా బాగుండి ఉండేది. టీడీపీ పొడ గిట్టని నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ టీడీపీ వైపుకు వెళ్లకుండా నిలువరించలేక పోయారనే విషయం మాత్రం అర్ధం కాదు. ఒక వేళ, పవన్ కళ్యాణ్ ద్వారా జగన్ పార్టీ కి చెక్ పెట్టాలని భావించి ; ఆ కంటి తో జగన్ ను, ఈ కంటి తో పవన్ ను ప్రోత్సహిస్తున్నారేమో తెలియదు.

“ఆంధ్ర లో మోడీ అభిమతాన్ని కాదని బయట తిరిగినా….. మాకేమీ ఇబ్బంది లేదు…. ” అంటూ తెలంగాణ మోజీపీ… పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుంది. తెలంగాణ లో ఉన్నదో… లేదో తెలియని పవన్ రాజకీయ బలాన్ని నమ్ముకుని 8సీట్లు వదిలిపెట్టిన బీజేపీ ; మరి, తెలంగాణ లో గణనీయమైన బలం కలిగివున్నప్పటికీ ; టీడీపీ ని మాత్రం దగ్గరకు కూడా రానివ్వలేదు. తెలంగాణ లో స్నేహ హస్తం అందిస్తే ; రేపు ఆంధ్ర లో కూడా టీడీపీ తో జత కట్టాల్సి వస్తుందేమో నన్న అనుమానం లో బీజేపీ పడిపోయి ఉంటుంది.

టీడీపీ తో బహిరంగంగా జత కడితే : జగన్ సారధ్య ప్రభుత్వానికి ఢిల్లీ నుంచి కన్ను గీటడం కుదరదు. ఎన్నికల ప్రచారం కోసం వచ్చి టీడీపీ ని అభినందించడం…., జగన్ ను విమర్శించడం కుదరదు. మోజేపీ అనేది ఆంధ్ర లో ప్రధాన ప్రతిపక్షమూ కాదు, ప్రధాన రాజకీయ పార్టీ కూడా కాదు. టీడీపీ పొలిటికల్ ఫ్రెండ్ కు…. జస్ట్ ఓ పొలిటికల్ ఫ్రెండు. అందుకే, ఆంధ్ర లో వైసీపీ ని కాదని టీడీపీ వైపు మోజీపీ చూడడం లేదు . తెలంగాణ లో రావడానికి అవకాశం ఉన్న రాజకీయ ప్రయోజనాన్ని కూడా అది వదిలేసుకుంది. తెలంగాణ లో టీడీపీ ని మోజీపీ వదిలేసుకోవడం వల్ల కలిగే లాభనష్టాలు…. ఏమిటి అనే విషయం రేపు డిసెంబర్ 3 వ తేదీన తెలుస్తుంది. ఆ తరువాత ఆంధ్ర లో మోడీ -షా వ్యూహం మారితే మార వచ్చు.

మరి, ఆంధ్ర లో టీడీపీ పొడ కూడా గిట్టని మోజీపీ ; చంద్రబాబు కుటుంబానికే చెందిన పురందేశ్వరికి రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి ఎందుకు అప్పగించిందో తెలియదు. జగన్ ప్రభుత్వాన్ని ఆమె డైలీ బేసిస్ లో తూర్పార బడుతున్నారు. జగన్ ప్రభుత్వం నిర్వాకాలపై సీబీఐ, ఈడీ విచారణలకు ఆమె పట్టుబడుతున్నారు. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. టీడీపీ నేతల విమర్శలకు మించి మరీ ఆమె వైసీపీ ని విమర్శిస్తున్నారు. విమర్శలే కాదు. క్రియాశీలకం గా వ్యవహరిస్తున్నారు కూడా.

జగన్ రాజకీయానికి “ఇరుసు ” లాటి విజయసాయి రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కూడా ఆమె అదే పనిగా డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్టీ కేంద్ర నాయకులు ఆమెతో గొంతు కలపడం లేదు కానీ ; పురందేశ్వరి ప్రకటనలను, భావాలను, దూకుడును ఖండించడం కూడా లేదు. అంటే…. ఆమె మాటలను వారు వింటూ….,చూస్తూ ఊరుకుంటున్నారు. దీనితో, కేంద్ర బీజేపీ నేతల మనసులలో ఏమి ఉందో అనే సందేహాలు కలగడం సహజం.

కేంద్ర బీజేపీ నాయకులకేమో టీడీపీ అంటే పడదు అనేది ఇప్పుడు బహిరంగ రహస్యం గా మారిపోయింది . అదే పార్టీ రాష్ట్ర నాయకత్వానికేమో వైసీపీ అంటే పడదు. అలాగే, ఎన్డీఏ లో సభ్యుడిని అని చెప్పే పవన్ కళ్యాణ్ కేమో వైసీపీ అంటే పడదు. ఆయనను రాజకీయంగా కౌగిలించుకుంటూ తిరిగే మోజీపీ కేమో టీడీపీ వాసన పడదు. పోనీ పవన్ కళ్యాణ్, ఆంధ్ర మోజీపీ పార్టీ మాత్రమే కలిసి ఎన్నికలకు వెడితే…. ఏమవుతుందో పవన్ కళ్యాణ్ ఇదివరకే స్పష్టంగా చెప్పారు. ఆ విషయం తెలిసినప్పటికీ ; తమకు నష్టం ఏముంది కొత్తగా అనేది బీజేపీ పాయింట్.

కానీ, తాము స్నేహ హస్తం అందిస్తే ; టీడీపీ – జనసేన కూటమి ఎక్కడ బలపడి పోతుందో అన్న బెదురు లో ఢిల్లీ పెద్దలు ఉన్నారేమో తెలియదు.లేకపోతే, సొంతం గా పోటీ చేస్తే…. ఒక్క స్థానం లోనూ డిపాజిట్ రాక, అటు వైసీపీ తోనూ బహిరంగంగా కలవలేక, ఇటు టీడీపీ కీ మద్దతు ప్రకటించలేక….; ఆంధ్ర రాజకీయాల్లో నరేంద్రమోడీ సారధ్య బీజేపీ ఎటువంటి పాత్ర పోషిస్తున్నట్టు?

ఒక రాజకీయ పార్టీ అన్న తరువాత ; అధికార పార్టీ వైపు అయినా నిలబడాలి…. లేదా ప్రతిపక్షం వైపు అయినా నిలబడాలి. ఈ రెండింటి లో బీజేపీ ఏదీ ఓపెన్ గా చేయడం లేదు. వైసీపీ తో బహిరంగంగా పొత్తుపెట్టుకుని ఎన్నికలకు వెడితే, బీజేపీ కి ఇంతకంటే వచ్చే నష్టం ఏమిటి? వస్తే… గిస్తే… లాభమే గానీ ; నష్టం అనే ప్రశ్నే లేదు. వైసీపీ కి కేంద్రం నుంచి నైతిక మద్దతు లభించినట్టు ఉంటుంది. బీజేపీ నాయకులకు వైసీపీ నుంచి సమస్త వనరులూ సమకూరడానికి ఇబ్బంది ఉండదు కూడా. బోడి గుండు కు కొత్తగా ఊడిపోయేది ఏముంటుంది? వస్తే నాలుగెంట్రుకలు మొలవాలి గానీ.

మరి, వైసీపీ ప్రభుత్వం పై ఒంటి కాలితో లేస్తున్న అంధ్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ని ఆ పదవి నుంచి ఇందుకోసం తప్పిస్తారా? ఈశాన్య రాష్ట్రాల్లో దేనికో దానికి గవర్నర్ గా పంపేసి, వైసీపీ కి తలనొప్పి లేకుండా చేస్తారా? లేకపోతే పొండిచేరి కూడా గవర్నర్ లేకుండానే నడుస్తుంది. ఆవిడ ” అక్కడ ” ఉన్నంత కాలం వైసీపీ తో అధికారికం గా సయోధ్య కుదరదు అనేదే పరిశీలకుల భావన. మరి పవన్ కళ్యాణ్ ను ఏం చేస్తారు? వదిలేస్తారా?

తెలంగాణ లో ఆయనకు ఇచ్చిన 8 సీట్లలో ఆయన బలమెంతో చూశాకే ; ఆంధ్ర లో ఆయనతో ఎలా డీల్ చెయ్యాలనే విషయం లో బీజేపీ కేంద్ర పెద్దలు ఒక అంచనా కు వస్తారేమో. మొత్తం మీద ఆంధ్ర లో రాజకీయానికి ఒక సిద్ధాంతం అంటూ ఏమీ లేదు. ఒక పధ్ధతి అంటూ కూడా ఏమీ ఉన్నట్టు లేదు. మ్యూజికల్ చైర్స్. కేంద్ర బీజేపీ కి టీడీపీ పొడ గిట్టదు. బీజేపీ పార్టీ రాష్ట్ర శాఖకు వైసీపీ పొడ గిట్టదు. వైసీపీ కి పవన్ కళ్యాణ్ పొడ గిట్టదు. జనసేన ను వీపు పై గట్టిగా కట్టుకుని టీడీపీ ….; కేంద్రం చూపించే అభిమానం తో వైసీపీ – ‘అధికారం’ అనే మ్యూజికల్ చైర్ చుట్టూ గుండ్రం గా తిరుగుతున్నాయి. ఈ “పిలక తిరుగుడు ” రాజకీయాలకు చెక్ పెట్టవలసింది ఓటర్లే.

భోగాది వేంకట రాయుడు
medhomadhanam@gmail.com

LEAVE A RESPONSE