Home » ఇంకా నమ్మించడానికి వైకాపా ఎందుకు ప్రయత్నిస్తోంది?

ఇంకా నమ్మించడానికి వైకాపా ఎందుకు ప్రయత్నిస్తోంది?

– ఒక మనిషి అబద్దానికి ఎలా ప్రభావితం అవుతాడు?

కాగ్నిటివ్ బైయాస్ (అభిజ్ఞా పక్షపాతం) : మన మెదళ్లు సమాచారాన్ని త్వరగా అర్థం చేసుకోడానికి మానసిక షార్ట్‌కట్‌లను ఉపయోగిస్తాయి. కానీ ఈ షార్ట్‌కట్‌లు కొన్నిసార్లు మనలను తప్పుదోవ పట్టించవచ్చు.

ఉదాహరణకు, మన మౌలిక నమ్మకాల్ని ధృవీకరించే సమాచారానికి మెదడు ప్రాధాన్యం ఇస్తుంది, అది తప్పుడుది అయినప్పటికీ.

2019లో జగన్ గెలుస్తాడు అని చెప్పారు అలాగే జరిగింది. ఇప్పుడూ చెబుతున్నాడు కాబట్టి గెలుస్తాడు అని వైకాపాను నమ్మే అభిమానులు నమ్ముతారు.

ఎమోషనల్ మానిపులేషన్ (భావోద్వేగాలకు గురిచెయ్యడం) : మనలను భావోద్వేగాలకు తరచుగా గురిచేసే ప్రచారం పట్ల ఆకర్షితులం అవుతాం. ఉదాహరణకు భయం, కోపం లేదా దేశభక్తి. ఇది మన నిర్ణయాలను తారుమారు చేస్తుంది. దానిని ప్రశ్నించకుండా ఏదైనా నమ్మడానికి మనలను మరింత ప్రేరేపిస్తుంది.

ఉదాహరణకు, అమరావతి అనేది కమ్మ కులం వారిది అనే అబద్దాన్ని ప్రచారం చేసి, నమ్మింపజేసి, దాని పట్ల కోపాన్ని పెంచడం. అక్కడ విధ్వంసం చేసి భయాన్ని సృష్టించి మిగిలిన వారిని సంతోషపెట్టడం. మూడు రాజధానులు అని మూడు ప్రాంతాల్లో భావోద్వేగాలకు గురిచేయడం. వైజాగ్‌లో ప్రమాణస్వీకారం చేస్తున్నాడు 9వ తేదీ జగన్ అనేది ఆ కోవలోదే. ఆ పార్టీ వస్తే మన మైనారిటీలకు ముప్పు అనే భయాన్ని రేకెత్తించడం. ఇలాంటి ప్రచారం వాట్సాప్‌లలో ఎక్కువగా పంపిస్తుంటారు.

క్రిటికల్ థింకింగ్ పవర్ లేని అసమర్థత (విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాల యొక్క కొరత): ఇది తప్పుడు ప్రచారం అని ప్రతి ఒక్కరూ గుర్తించలేరు. ప్రచారంలో ఏమాత్రం నిజం వుంది అని నిష్పక్షపాతంగా ఆలోచన చేసి, దాని యొక్క ఉద్దేశాన్ని గుర్తించడం లాంటి వాటికి కొంత సాధన – సమయం తీసుకుంటుంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నించరు.

ఉదాహరణకు, జగన్ చెప్పే వైనాట్ 175 అనేది అబద్దం అని తెలుసు. అది అయ్యేపనా కాదా అని ఆలోచించలేని అసమర్థత ఉండే మనుషులు కూడా ఉండవచ్చు.

ట్రస్ట్ ఇన్ అథారిటీ ఫిగర్స్ (వ్యవస్థల/సంస్థల పట్ల విశ్వాసం) : ప్రజలు గౌరవనీయమైన వార్తా సంస్థ లేదా ప్రభుత్వ అధికారి వంటి నమ్మకమైన సోర్స్ నుండి వచ్చిన సమాచారాన్ని నమ్మే అవకాశాలు ఎక్కువ.

ఉదాహరణకు, సాక్షి ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా పెట్టి, టీవీ9 లాంటి స్పాన్సర్ మీడియాలలో రజినీకాంత్ ఇంటర్వ్యూ / విశ్లేషణలు పెట్టించి, వాటితో అబద్దాలను ప్రచారం చేయడం. ఒక్కోసారి ప్రభుత్వ సలహాదారు సజ్జల లేదా ఎసిబి లేదా పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో మీడియా ఇంటర్వూలు ఇప్పించి నమ్మించడానికి ప్రయత్నించడం.

ఎన్నికల్లో గెలుస్తున్నాం అని పదే పదే సజ్జలతో / మంత్రులతో చెప్పించడం ఆ కోవలోదే. జాతీయ దినపత్రికతో ప్రచారానికి ఎంఓయూ చేసుకొని, ఆ డబ్బులు ఇప్పించినదువలన తమ స్పాన్సర్డ్ సంస్థతో చేయించిన సర్వేని అందులో వేయించి, ఆ దినపత్రిక సర్వేలా నమ్మించాలని ప్రయత్నించడం. ఆ తరువాత ఆ సర్వేని ఉటంకిస్తూ సొంత సాక్షిలో కొమ్మినేని లాంటి వారితో సంపాదకీయం వ్రాయించడం.

ఎక్స్‌పోజర్ & రిపిటీషన్ (వ్యాప్తి మరియు పదే పదే ప్రచారం చెయ్యడం) : నమ్మించాలనుకొన్న మాటను ప్రజలకు పదేపదే చెప్పడం. అది నిజం కాకపోయినా, నమ్మే అవకాశం ఎక్కువ. ఇది ప్రచారకర్తలు తరచుగా ఉపయోగించే పద్ధతి.

ఉదాహరణకు, ఎన్నికలు అయ్యాక కూడా మేము గెలుస్తున్నాం అని నాయకులతో చెప్పించడం. జనం నమ్మకపోయినా.. దేశం నుండి వెళుతూ వెళుతూ మనం ఇంకా భారీ ఎత్తున గెలుస్తున్నాం అని జగన్ తో చెప్పించడం. మళ్లీ ఓడే కుప్పం లాంటి స్థానాల్లో కూడా గెలుస్తున్నాం గెలుస్తున్నాం అని పెద్దిరెడ్డి లాంటి వారితో అబద్దాలను పదే పదే చెప్పించడం.

మొదట మనసు అంగీకరించకపోగా నవ్వు వస్తుంది. తరువాత సంశయం కలుగుతుంది. ఆ తరువాత భ్రమకు గురవుతారు. ఆ తరువాత దశలో నమ్ముతారు.

ఇవన్నీ ఎందుకు అంటే.. ఇంకా వ్యవస్థలతో చేయించుకోవాల్సిన పనులు ఉన్నాయి. ఉదాహరణకు, అక్రమ రవాణా బియ్యం నుండి ఇసుక వరకు ఉండవచ్చు. అవి తరలించేసుకోవాలి. గనుల లీజులు కావచ్చు. విదేశాలకు చెక్కేయడానికి ఏర్పాట్లు చేసుకోవాల్సిన సెటిల్మెంట్స్ వుండవచ్చు. ముఖ్యంగా గౌరవంగా పోవడానికి ఓట్ల లెక్కింపు వద్దకు ఏజెంట్లు కావాలి. ఓ పాతిక మంది వచ్చినా రన్నింగ్ పార్టీగా బేరం పెట్టి పోవడానికి కావచ్చు.

కారణాలు ఏవైనా, మేకపోతు గాంభీర్యంతో జూన్ 4 వచ్చే ఫలితాల లోపు ఎన్నో అబద్దాలను ప్రచారం చేస్తోంది వైకాపా. విశ్లేషణ చేసుకోలేని మనుషులు భ్రమపడి నిజమనుకోవచ్చు. అవి నమ్మి బెట్టింగ్ లకు పోయి పోగొట్టుకోకుండా ఈ వ్యాసం ఉపయోగపడి, ఒక్క జీవితాన్ని నిలబెట్టినా ప్రయోజనం నెరవేరినట్లే.

– చాకిరేవు

Leave a Reply