Suryaa.co.in

Telangana

కేంద్ర ప్రభుత్వ సంస్థలో తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం

-బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ దక్షిణాది రాష్ట్రాల మీడియా సలహాదారుగా చంద్రశేఖర్‌రెడ్డి
-ప్రధాని మోదీ ప్రారంభించిన ‘లైఫ్ మిషన్’కు నోడల్ అధికారిగానూ నియామకం
-హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు
-ఉత్తర్వులు జారీ చేసిన బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ భాక్రే
-ప్రస్తుతం ఈఈఎస్ఎల్ దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీనియర్ సలహాదారుగా ఉన్న రెడ్డి

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలో తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం లభించింది. ఇంధన సామర్థ్య రంగంలో ఎన్నో ఏళ్ల అనుభమున్న అస్పరి చంద్రశేఖరరెడ్డికి కేంద్ర విద్యుత్తు శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) సంస్థ ముఖ్యమైన బాధ్యతలు అప్పగించింది. దక్షిణాది రాష్ట్రాలకు బీఈఈ మీడియా సలహాదారుగా నియమిస్తూ ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ అభయ్ భాక్రే ఉత్తర్వులు జారీ చేశారు. కాగా కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రభుత్వ రంగ విద్యుత్తు సంస్థలకు మద్దతునివ్వడం, సలహాలు, సూచనలతో మార్గనిర్దేశం చేయడం చంద్రశేఖర్ బాధ్యలుగా బీఈఈ నిర్థేశించింది.

ముఖ్యంగా పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో, తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, విద్యుత్తు సంస్థలు, ఇతర భాగస్వామ్య పక్షాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఇంధన సామర్థ్య లక్ష్యాలను సాధించడానికి హైదరాబాద్ ప్రధాన కార్యాలయం నుంచి కృషి చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో సూచించింది. అలాగే ‘లైఫ్’ మిషన్‌కు నోడల్ అధికారిగా కూడా చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది.

ఈ మిషన్‌కు చంద్రశేఖరరెడ్డి నోడల్ అధికారిగా ఉంటూ.. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇంధన సామర్థ్యం, సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. అలాగే ఇంధన సంరక్షణ, పొదుపుకు సంబంధించి బీఈఈ చేపడుతున్న కార్యక్రమాలను పర్యవేక్షించాలని డీజీ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇది మూడు దశాబ్దాల వృత్తిగత జీవితంలో చంద్రశేఖర్ రెడ్డి చిత్తశుద్ధి, నిజాయితీ, నిబద్ధత, దృఢ సంకల్పం, అంకిత భావానికి దక్కిన గుర్తింపుగా‌ ఇంధన రంగ అధికారులు పేర్కొంటున్నారు.

పాత్రికేయుడిగా మొదలైన ప్రస్థానం:
పాత్రికేయుడిగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన చంద్రశేఖరరెడ్డి..రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సమాచార, పౌరసంబంధాలు, ఇంధన సంరక్షణ విభాగాల్లో తనకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించి.. ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఇంధన సంరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) సీఈవోగా బాధ్యతలు చేపట్టి, ఇంధన సంరక్షణలో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలపడంలో కీలక పాత్ర పోషించి పదవీ విరమణ చేశారు.

ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)‌ దక్షిణ భారతదేశం, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాపార అభివృద్ధి, ప్రభుత్వ వ్యవహారాల సీనియర్ సలహాదారుగా కొన్ని నెలల క్రితం నియమించింది.ఈ క్రమంలోనే చంద్రశేఖర్ రెడ్డి చిత్తశుద్ధి, అంకిత భావాన్ని గుర్తించిన మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీఈఈ..తాజాగా దక్షిణాదిన ఆ సంస్థకు మీడియా సలహాదారుగా పదవీ అవకాశాన్ని కల్పించింది. దేశవ్యాప్తంగా అనేకమంది ఇంధన రంగ నిపుణుల దరఖాస్తులను పరిశీలించి, ఇంటర్వ్యూలు నిర్వహించి‌ చివరిగా చంద్రశేఖరరెడ్డిని బీఈఈ ఎంపిక చేసింది. బీఈఈ సెక్రటరీ మిలింద్ దేవరా సమక్షంలో డీజీ అభయ్ భాక్రే ఢిల్లీలో చంద్రశేఖరరెడ్డికి నియామక ఉత్తర్వులు తాజాగా అందజేశారు.

అత్యున్నత అవార్డులు..ప్రశంసలు:
ఇంధన సంరక్షణ, పొదుపులో చంద్రశేఖర్ రెడ్డి పనితీరుకు ఆయనకు దక్కిన జాతీయ అవార్డులే నిదర్శనం. 2015 నుంచి 2022‌ వరకూ ఐదు సార్లు ప్రతిష్ఠాత్మక జాతీయ ఇంధన సంరక్షణ అవార్డులను ఆయన నేతృత్వంలోనే ఏపీఎస్ఈసీఎం దక్కించుకుంది. 2022, డిసెంబరు 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రథమ స్థాయిలో జాతీయ ఇంధన సంరక్షణ అవార్డును ఆయన స్వయంగా అందుకుని ప్రశంసలు పొందారు. ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలు ద్వారా రూ.3800 కోట్ల విలువైన 5600 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఆదా చేయడంతోనూ తోడ్పడ్డారు.

మాజీ సీఎంలు విజయభాస్కర రెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డిలకి సీపీఆర్వోగా, ప్రెస్ సెక్రటరీగా ఆయన పనిచేశారు. రోశయ్య,కిరణ్ కుమార్ రెడ్డిలకు ప్రెస్ సెక్రటరీగా ఉండేవారు. ఆ సమయంలో వారందరి మన్ననలు పొందారు.ఇంధన సామర్థ్య రంగంలో దక్షిణాది రాష్ట్రాల్లో సేవలందించేందుకు తనకు అవకాశం కల్పించిన బీఈఈ డీజీ అభయ్ భాక్రే, ఈఈఎస్ఎల్ సీఈవో విశాల్ కపూర్‌లకు ఆయన ధన్యవాదాలు చెప్పారు.

పెద్దపుదిళ్ల నుంచి ఢిల్లీ వరకూ:
అస్పరి చంద్రశేఖర్ రెడ్డి కర్నూలు జిల్లా పెద్దపుదిళ్లలో 1963, జూన్ 1న జన్మించారు.తల్లిదండ్రులు వెంకమ్మ లక్ష్మీరెడ్డిలది వ్యవసాయ కుటుంబం. జిల్లా పరిషత్ హైస్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించారు. ఎస్వీ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎంఏ పట్టా పొందారు. హైదరాబాద్‌లో బ్యాచిలర్ ఆఫ్ కమ్యూనికేషన్, జర్నలిజం చదివారు. అనంతరం ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. 1988లో జర్నలిజంలో కెరీర్‌ను ప్రారంభించారు. ఆంధ్రపత్రిక, ఉదయం దినపత్రికల్లో సబ్ ఎడిటర్, సీనియర్ సబ్ ఎడిటర్, స్టాఫ్ కరెస్పాండెంట్‌గా వివిధ హోదాల్లో 1992 వరకు విధులు నిర్వర్తించారు.

1992 నుంచి 1994 దాకా అప్పటి సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డికి ప్రత్యేక పీఆర్వోగా పనిచేశారు. 1994 నుంచి 2000 వరకు ఏపీ ట్రాన్స్‌కోలో అదనపు పీఆర్వోగా సేవలందించారు. అనంతరం సంస్థ మీడియా అండ్ కార్పొరేట్ విభాగంలో అసిస్టెంట్ సెక్రటరీ నుంచి చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగారు. 2005లో సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సీపీఆర్వోగా నియమితులయ్యారు. 2006లో అప్పటి సీఎంకు ప్రెస్ సెక్రటరీగా (ప్రభుత్వ కార్యదర్శి హోదాలో) నియమితులయ్యారు.

2011 వరకు సీఎం ప్రెస్ సెక్రటరీగా పనిచేశారు. 2011లో ఇంధన శాఖలో సభ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. అనంతరం ఏపీ సీడ్కో ఎండీ, సీఈవోగా, ఏపీఎస్ఈసీఎం సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు.పదవీ విరమణ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి చెందిన రెండు ప్రతిష్ఠాత్మక సంస్థలు, అదీ ఆర్నెల్లలోపే చంద్రశేఖర్ రెడ్డికి రెండు కీలక బాధ్యతలు అప్పగించడం విశేషం.

 

LEAVE A RESPONSE