– ప్రగతిభవన్ ఇనుప గేట్ల బద్దలుతో మొదలు
– ఇందిరాపార్కులో ధర్నాలపైనా కేసీఆర్ ఆంక్షలు
– స్వేచ్ఛను చిదిమేసిన కేసీఆర్ పాలన
– రేవంత్ రాకతో తెలంగాణలో ప్రజాస్వామిక పాలన
– తన కోసం ట్రాఫిక్ ఆపవద్దన్న రేవంత్
– తన కుటుంబానికి కాన్వాయ్ వద్దని ఆదేశాలు
– కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోసం పదేళ్లు తిరిగానన్న ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్శింహారెడ్డి
– రేవంత్‌తో ఇప్పటికి పదిరోజుల్లో నాలుగుసార్లు కలిశానన్న ఆనందం
– మీడియాతో రేవంత్ రెగ్యులర్ చిట్‌చాట్
– సెల్‌ఫోన్లలో స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్న ప్రజాప్రతినిధులు
– అసెంబ్లీలో స్వేచ్ఛాయుత వాతావరణం
– విపక్షాలకు మైకు ఇవ్వాలన్న తొలి సీఎం రేవంత్
– బాబు-వైఎస్ జమానా దృశ్యాలు ఆవిష్కృతం
– మేనేజ్‌మెంట్-పేమెంట్ కోటా సంవాదాలు
– కేసీఆర్ జమానాలో స్వేచ్ఛకు సంకెళ్లు
– కేటీఆర్ అపాయింట్‌మెంటే గగనం
– కేసీఆర్ హయాంలో హరించుకుపోయిన మీడియా స్వేచ్ఛ
– నాటి సర్ ‘కారు’లో ‘దొర’స్వామ్యం.. ఇప్పుడు పరిఢవిల్లుతున్న ప్రజాస్వామ్యం
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘సెలవింక డెమోక్రసీ సిరిసిరిమువ్వా’ అన్న మహాకవి శ్రీశ్రీ బతికుండి, ఇప్పుడు తెలంగాణలో రేవంత్ పాలన చూస్తే, ఆ విధంగా వ్యాఖ్యానించేవారు కారేమో?! అవును నిజం!! స్వేచ్ఛ కోల్పోయి, పదేళ్లు ‘దొర’స్వామ్యం అనుభవించిన తెలంగాణ సమాజం… ఇప్పుడు ప్రజాస్వామిక పాలనలో స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్న మధుర క్షణాలు మరి!!! ప్రజాస్వామిక లక్షణాలు అణువంతైనా లేని, పదేళ్ల ‘దొర’స్వామ్యంలో స్వేచ్ఛ ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయిన రోజులు, ఎవరు మాత్రం మర్చిపోతారు? ముఖ్యమంత్రిని కలవాలంటే మహారాజులను కలిసేంత బిల్డప్ ఇచ్చిన.. నాటి నిరంకుశ-నియంత-అహంకార పోకడలను, తెలంగాణ సమాజం ఎందుకంత తేలికగా మర్చిపోతుంది? ప్రజాయుద్ధనౌక గద్దరన్నను, గంటలపాటు ప్రగతిభవన్ గేటు వద్ద నిలబెట్టి, అవమానకర రీతిలో వెనక్కి పంపిన అహంకారస్వామ్యాన్ని, తెలంగాణ ప్రజలు అంత సులభంగా ఎలా మర్చిపోతారు? తెలంగాణ ఏర్పడేందుకు కారకుడైన కోదండరాం సారును, అధికారం వచ్చిన తర్వాత కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా పది కిలోమీటర్ల దూరం పెట్టిన ‘దొర’ హంకారాన్ని విద్యార్థిలోకం అంత సులభంగా ఎందుకు మర్చిపోతుంది? ఉద్యమాలకు ఊపిరిలూడిన ఉస్మానియాలో విద్యార్ధుల మెడపై ఆంక్షల కత్తి వేళ్లాడదీసిన అహంకారపోకడలను విద్యార్థిలోకం ఎందుకు మర్చిపోతుంది?
మందబలంతో అసెంబ్లీలో విపక్షాల గొంతు నొక్కిన, ఆ నియంత పాలనను ప్రజాస్వామ్యవాదులు ఎలా మర్చిపోతారు? జర్నలిస్టుల గొంతునొక్కి .. వరంగల్ సభ సాక్షిగా, వారి స్వేచ్ఛను ‘పదడుగుల లోతు’ పాతేస్తానన్న నయా నిజాం నియంతల అహంకారాన్ని, అక్షరప్రపంచం అంత వీజీగా ఎందుకు మర్చిపోతుంది? మాకు వ్యతిరేకంగా రాసే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఎందుకిస్తామన్న, నియంతల జమానాను అక్షర ప్రపంచం అంత సులభంగా ఎలా మర్చిపోతుంది?
ఇవన్నీ.. తాను గత పదేళ్లుగా నాటి సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తే, ఒక్కసారీ ‘దొర’కలేదన్న టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్శింహారెడ్డి వ్యాఖ్యల నేపథ్యం! కానీ పదిరోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డిని, నాలుగుసార్లు కలిశానన్న వ్యాఖ్యల నేపథ్యం!! మరి ‘దొర’ స్వామ్యానికీ.. ప్రజాస్వామ్యానికీ తేడా కనిపించడం లేదూ? కచ్చితంగా కనిపిస్తుంది. కనిపిస్తోంది కూడా!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తీరు చూస్తే.. స్వేచ్ఛ మళ్లీ ఊపిరిపోసుకుందా? చంపేసిన ప్రజాస్వామ్యం మళ్లీ బతికొచ్చిందా? అహంకార ‘దొర’స్వామ్యంపై, ప్రజాస్వామ్యం విజయం సాధించిందా? నయా నవాబుల అహంకారం స్థానంలో, స్వేచ్ఛాయుత వాతావరణం ప్రవేశించిందా? అన్న అభిప్రాయం.. మెడపై తల ఉన్న ఎవరికైనా రావడం సహజం. అలాంటి సందేహం రాకపోతే.. సదరు వ్యక్తికి, మెదడుపై తల లేనట్టే లెక్క. పదేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో ప్రజాస్వామ్యం బట్టలూడదీసి.. జమ్మిచెట్టుపైకెక్కించిన వాస్తవం, దాచినా దాగని నిజం. ఎంతలా అంటే.. మనం మనుషులం అన్నంత నిజం!
ప్రశ్నించే గొంతులపై నిర్దయ-నిర్దాక్షిణ్యంగా, పోలీసులు ఇనుప బూట్లు నేలకు నొక్కిపెట్టిన నిఖార్సయిన నిజం. విపక్ష పార్టీల శాసనసభాపక్షాలను, అధికారమదంతో విలీనం చేసుకుని.. దానికి ‘నియోజకవర్గ అభివృద్ధి’ అని ముద్దుపేరు పెట్టి, వికటాట్టహాసం చేసిన నయా నియంతల దరహాసం. నాటి పాలకుడు కేసీఆర్‌ను కలిస్తే, ఏ బ్రహ్మ-విష్ణు లను కలిసినంత ఆనందం. ఆయన దయతలిస్తేనే దర్శనభాగ్యం. చివరాఖరకు కేటీఆర్‌ను కలవాలన్నా గగనం.
పెద్ద దొర ఎటూ ఎవరినీ కలవరు. చిన్నదొరను కలిస్తే అదో మహదానందం. చచ్చీ చెడీ చిన్నసారును కలిస్తే, దానికి మురిసి ముక్కలవాల్సిందే. ఎలిజిబెత్ రాణిని కలసినంత సంబరం. దొరగారు ముచ్చటపడి వందల కోట్లతో నిర్మించిన సెక్రటేరియేట్‌లో, జర్నలిస్టుల ప్రవేశాన్ని నిషేధించిన తొలి నియంత పాలకుల గొప్పతనం గురించి, ఎంత చెప్పుకున్నా తక్కువే.
అయినా నియంతల నిర్ణయాన్ని ప్రశ్నించకుండా.. నవరంధ్రాలూ మూసుకుని దొరలపాలనకు సలాము కొట్టి, గులాములైన జర్నలిస్టుల సంఘాల భక్తి ప్రపత్తులకు జోహార్లు అర్పించని వారు, పాపాత్ముల కిందే లెక్క. ఫాంహౌస్ పాలనను ప్రశ్నించకుండా.. అడ్వరైజ్‌మెంట్ల ఆదాయం కోసం, ‘దొర’హంకార పదేళ్లపాలనలో అడుగులకు, మడుగులొత్తిన ‘జీహుజూరు’ మీడియా సైతం.. స్వేచ్ఛాయుత పాలనను ఆస్వాదిస్తున్న మధురక్షణాలివి.
దొరగారు జనాలను కలవరు. పైగా ప్రగతిభవన్ చుట్టూ ఇనుపకంచెలు. సీఎం ప్రజలను కలవాల్సిన అవసరం లేదన్నది, చిన్నసారు కేటీఆర్ గారి భాష్యం. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకూ ఎవరినీ దొరలు కలవరు. పోనీ ఫోన్లలో మాట్లాకునే స్వేచ్ఛ ఉందా అంటే అదీ లేదు. అందరిపైనా నిఘా నేత్రాలే. అలాగని మంత్రులకు స్వేచ్ఛ ఉందా అంటే అదీ లేదు. అంతా సీఎంఓ ఆదేశాల ప్రకారం సంతగించాల్సిందే. వారందరికీ చివరాఖరకు మిగిలిందేమిటంటే.. బుగ్గకార్లు, నౌకర్లు, చాకర్లు. దట్సాల్!
ఇప్పుడు అవన్నీ ఏమీ వినిపించడం లేదు. కనిపించడం లేదు. అంతా స్వేచ్ఛాయుత ప్రజాస్వామిక వాతావరణం. నేరుగా సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రజలను నిషేదించిన అదే ప్రగతిభవన్‌లో జనం సమస్యలు వింటున్న ప్రజాస్వామిక దృశ్యాలు. ఒక టీచర్ ఎమ్మెల్సీ స్వయంగా. తాను పదేళ్ల పాటు సీఎంగా ఉన్న కేసీఆర్‌ను కలవ లేకపోయా. ఇప్పుడు సీఎం రేవంత్‌ను పదిరోజుల్లో నాలుగుసార్లు కలిశానన్న ఒక్క ప్రకటన చాలు.. తెలంగాణలో మళ్లీ స్వేచ్ఛాయుత ప్రజాస్వామిక పాలన ఊపరిపోసుకుందో చెప్పడానికి!
అలుగుబెల్లి నర్శింహారెడ్డి అనే టీచర్ ఎమ్మెల్సీ వెల్లడించిన నిష్ఠుర నిజాలు పరిశీలిస్తే.. పదేళ్లు తెలంగాణ సమాజం, దొరల జమానాలో ఏం కోల్పోయింది? ఇప్పుడు ఏం అనుభవిస్తున్నదీ, సులభంగానే అర్ధమయి తీరుతుంది. అసలు అధికార పార్టీ మంత్రులు-ఎమ్మెల్యేలు-ఎంపీలకే దొరగారి దర్శనభాగ్యం దిక్కులేకపోతే.. ఇక విపక్ష పార్టీ ఎమ్మెల్సీ, దొరగారి అపాయింట్‌మెంట్ ఆశించడం అత్యాశ, అమాయకత్వమే.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తీరు, నాటి ఉమ్మడి పాలనను గుర్తుకుతెస్తోంది. చంద్రబాబు-వైఎస్ సంవాదాలను జ్ఞప్తికి తెస్తోంది. పదేళ్ల సొంత రాష్ట్రంలో కనిపించని స్వేచ్ఛ-సుహృద్భావ వాతావరణం ఇప్పుడు కనిపిస్తోంది. పదేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో టీడీపీ-కాంగ్రెస్ శాసనసభాపక్షాలను, రెండుసార్లు మందబలంలో విలీనం చేసుకున్న అప్రజాస్వామిక ఘటనలు చూశాం.
ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారితే తప్పేమిటి? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నక్కలపాలు కాకూడదంటే బలమైన ప్రభుత్వం కావాలని కేసీఆర్ భాష్యం ఇంకా అందరికీ గుర్తే. విపక్షాల నోళ్లను మందబలంతో నొక్కేసిన వైనం చూశాం. కానీ ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమైన దృశ్యాలు తెలంగాణ అసెంబ్లీలో సాక్షాత్కరిస్తున్నాయి.
స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి విపక్షాలకు, అవసరమైనప్పుడు మైకు ఇవ్వాలని స్పీకర్‌ను కోరిన అరుదైన దృశ్యం మున్నెన్నడూ చూడనిది. ప్రభుత్వ తీరు నచ్చకపోతే, ధర్నాచౌక్ వెళ్లి నిరసస తెలపమన్న రేవంత్ సూచన.. ఈ పదేళ్లలో తెలంగాణ సమాజం విననిది. కననిదీ! పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎప్పుడూ వినిపించనది కూడా!!
అసలు ఇందిరాపార్కులో దర్నాచౌక్‌నే ఎత్తేయించిన నియంతలకు, రేవంత్ సున్నితంగా ఇచ్చిన సీరియస్ ఝలక్ అది. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులను సవివరంగా వెల్లడిస్తూ, నాటి సర్‘కారు’ను.. నగ్నంగా ప్రజల ముందు నిలబెట్టిన రేవంత్ మాటకారితనాన్ని అభినందించాల్సిందే. ఇక మేడిగడ్డ కుంగుబాటుపై, కవితక్క వ్యాఖ్యల ఆధారంగా.. సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించిన రేవంత్ మేధస్సును, ఎంత అభినందించినా తక్కువే.
ఇక సభలో రేవంత్-కేటీఆర్.. మేనేజ్‌మెంట్-పేమెంట్ కోటాల వాగ్వాదం.. సంవాదం పరిశీలిస్తే, తెలంగాణలో స్వేచ్ఛ ఎంత గట్టిగా ఊపిరితీసుకుంటుందో స్పష్టమవుతోంది. పదేళ్ల కేసీఆర్ పాలనలో.. ఇంత స్వేచ్ఛాయుత చర్చ జరిగిన దాఖలాలు, భూతద్దం పెట్టి వెతికినా కనిపించవు. వినిపించవు. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ మీడియాతో స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. సభ మధ్యలో చిట్‌చాట్ చేస్తున్నారు. జర్నలిస్టులు కూడా ఆయనతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో, ఆస్థాన భట్రాజ మీడియా జర్నలిస్టులు తప్ప.. సాధారణ జర్నలిస్టులు ఇంత స్వేచ్ఛ అనుభవిస్తే ఒట్టు.
నిజానికి తెలంగాణ కోసం పోరాడిన వారిలో, జర్నలిస్టులదే ముందువరస. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో జర్నలిస్టులు, తెలంగాణ కోసం ఎంత తెగించారో అందరూ చూసిందే. మంత్రుల పర్యటనలు అడ్డుకున్నారు. తెలంగాణ ఎప్పుడిస్తారని నిలదీశారు. ఆంధ్రా మీడియా యాజమాన్యాల్లోనూ స్వేచ్ఛ అనుభవించారు. వారంతా పాపం సొంత రాష్ట్రం వస్తే, కేసీఆర్ తమను నెత్తిన పెటుకుంటారని భ్రమించారు.
కానీ సీఎంఓలో నిషేధంపై మొదలైన కేసీఆర్ ఆంక్షల ప్రస్థానం.. తమకు వ్యతిరేకంగా వార్తలు రాసే జర్నలిస్టులను, పది అడుగుల లోతు పాతరేస్తామన్న దగ్గర నుంచి.. తమ సర్కారుకు వ్యతిరేకంగా వార్తలు రాసే జర్నలిస్టులకు, ఇళ్ల స్థలాలు ఇవ్వం అనేంత అహంకారస్థాయికి వెళ్లినా, ఆయనను ప్రశ్నించిన జర్నలిస్టు సంఘ నేతలే లేకపోవడం దౌర్భాగ్యం. ఇప్పుడు తెలంగాణలో అలాంటి నియంతలు లేరు. ప్రజాస్వామిక పాలన తప్ప!
ఎవరికయినా నడిచినంత వరకే!! వక్రాచార్యుడు సైతం గద్దెనెక్కితే సక్రాచార్యుడవుతారు. అందుకు ఎవరూ మినహాయింపు కాదు. పదేళ్లపాటు ‘దొర’స్వామ్యంలో కోల్పోయిన ప్రజాస్వామ్యం.. రేవంత్ పాలనలో పరిఢవిల్లాలని కోరుకోవడం, ఏమాత్రం అత్యాశ కాదు. ఎందుకంటే అది తెలంగాణ ప్రజల ఆకాంక్ష కాబట్టి!