Suryaa.co.in

Andhra Pradesh

తెలంగాణలోనే అన్న షర్మిల ఇక్కడికెందుకు వచ్చారో?

– వైఎస్సార్‌ అభిమానుల ఓట్లు చీలతాయనే షర్మిలమ్మ ఎంట్రీ
– నోటా కంటే తక్కువ ఓట్లున్న కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం వల్ల ఎవరికి లాభం..?
– చచ్చిన శవం లాంటి కాంగ్రెస్ కు ఎవరూ జీవం పోయలేరు
– 2019లో ఏపీ కాంగ్రెస్‌ను పట్టించుకోని కేంద్ర నాయకత్వం బాబు కోసమే ఇప్పుడు ఆమెను పంపింది
– ఈ రాష్ట్రంలో ఉంది ఒకటే ఒక కాంగ్రెస్‌..అది వైఎస్సార్‌ కాంగ్రెస్‌
– కాంగ్రెస్‌ పార్టీ ఆమె కుటుంబానికి ఎలా ద్రోహం చేసిందో మర్చిపోయారా?
– వైఎస్సార్‌ గారి పేరు చార్జ్‌షీట్‌లో పెట్టిన పార్టీ కాంగ్రెస్‌ పార్టీ
– జగన్‌ చెల్లెలుగా, రాజశేఖరరెడ్డి కూతురుగా ఆమెను అభిమానించే వారు ఉండొచ్చు
– కానీ అది కూడా ఆమె పోగొట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు
– కాంగ్రెస్‌ తరఫున వకాల్తా పుచ్చుకున్న షర్మిలమ్మే హోదాపై సంజాయిషీ ఇవ్వాలి
– ఆనాడు హోదా అంశాన్ని చట్టబద్ధం ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలి
– అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని ఎందుకు విడగొట్టారో చెప్పాలి
– ప్రత్యేక హోదాపై జగన్‌ స్టాండ్‌ ఎప్పుడూ ఒకటే
– కేంద్రం మనపై ఆధారపడే రోజు వరకూ హోదా అంశాన్ని సజీవంగా ఉంచుతున్నాం
– అందులో భాగంగానే ప్రధాని మోడీ పాల్గొన్న విశాఖ సభలోనూ హోదా అంశాన్ని లేవనెత్తిన సీఎం వైఎస్‌ జగన్‌
– తనను కలిసిన మీడియాతో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి

కాంగ్రెస్‌ పార్టీ ఆమె కుటుంబానికి చేసిన ద్రోహం మరచినట్లున్నారు:
పీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా షర్మిలమ్మ మాట్లాడిన భాష కానీ, చేసిన హడావుడి కానీ చూశాక వైఎస్సార్‌ కుటుంబానికి సన్నిహితుడిగా, వైఎస్సార్‌ ఆశయాలకు పూర్తిగా పేటెంట్‌ కలిగిలిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకునిగా స్పందిస్తున్నా.

మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాకుండా జగన్మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ తనయుడిగా, ఆయన రాజకీయ వారసుడిగా కూడా నిరంతరం వైఎస్సార్‌ ఆశయాలకు కట్టుబడి నిబద్ధతతో పనిచేశారు.

ప్రజలు, ముఖ్యంగా పేదలు, దళితులు, మైనార్టీలు, ఎస్టీలు, వెనుకబడిన వర్గాలు..మొత్తం సమాజం అంతా అక్కున చేర్చుకున్న నాయకుడు జగన్‌. ఒక రకంగా షర్మిలను చూస్తే జాలి కలుగుతోంది. హఠాత్తుగా ఊడిపడినట్లు రావడం, నిన్నటి వరకూ తెలంగాణలో ప్రయోగం చేయడం, ఆ తర్వాత ఉన్నట్లుండి ఇక్కడ ప్రత్యక్షం అయ్యారు. అక్కడున్న వారిలో కేవీపీ, రఘువీరారెడ్డి తప్ప ఆమెకు తెలిసిన వారు కూడా ఎవరూ లేరు.

కాంగ్రెస్‌ పార్టీ గురించి అయినా తెలుసా అంటే అదీ తెలియదు. ఆమెకు తెలిసుంటే కాంగ్రెస్‌ పార్టీ ఆమె కుటుంబానికి ఎలా ద్రోహం చేసిందో తెలిసి ఉంటుంది. ఏ రాజశేఖరరెడ్డితే ఆ పార్టీ కేంద్రంలో రెండు సార్లు అధికారంలోకి రావడానికి కారణమయ్యారో… వైఎస్సార్‌ ప్రధాన కారణమని ఆనాడు మన్మోహన్‌ సింగ్‌ కూడా చెప్పారు. ఆయన మరణానంతరం జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు. అక్రమ కేసులు బనాయించి నేరుగా వైఎస్సార్‌ పేరు చార్జ్‌షీట్‌లో పెట్టిన పార్టీ కాంగ్రెస్‌ పార్టీ. తన అన్న, నేటి ముఖ్యమంత్రి జగన్‌ ని 16 నెలలు అక్రమంగా జైల్లో పెట్టారు.

ఆనాడు ఆ పార్టీ నాయకుడు శంకర్రావు, టీడీపీ నుంచి ఎర్రంనాయుడు, అశోక్‌ గజపతి రాజులు కలిసి కుమ్మక్కై వేసిన కేసు చార్జ్‌షీట్లో వైఎస్సార్‌ పేరు పెట్టారు. సోనియా గాంధీ చెప్తేనే తాను కేసు వేశానని ఆనాడు శంకర్రావు కూడా చెప్పాడు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన గులాం నబీ అజాద్‌కూడా ఆనాడు మాట వినుంటే కేసులు పెట్టేవాళ్లం కాదన్నారు.

తెలంగాణలో ఏం చేశారు..? హఠాత్తుగా ఇక్కడకెందుకు ఊడిపడ్డారు..?:
ఆ పార్టీ గురించి చెప్తే పెద్ద పురాణం. రాష్ట్రంలో ఉనికి లేని పార్టీ కాంగ్రెస్‌ పార్టీ. ఈ రోజు హఠాత్తుగా, ఆవేశంగా, భాష, యాస కూడా మార్చి చంద్రబాబు చెప్పే డైలాగులే చెప్తుంటే జాలి కలగకుండా ఉంటుందా? , ఆమె వైఎస్సార్‌ కూతురు కావడం, ముఖ్యమంత్రి సహోదరి కావడం, ఆమె ఇస్తున్న పిలుపులు కన్ఫ్యూజన్‌ క్రియేట్‌ చేసేలా ఉండటం వల్ల మేం స్పందించాల్సి వచ్చింది.

ఒకప్పుడు కుటుంబ సభ్యురాలిగా అన్నకు మద్దతుగా నిలిచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సహజంగా ఆమెపై మాట్లాడాలంటే కాస్తంత ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఆమె మాత్రం నేరుగా జగన్‌ రెడ్డీ అన్నారు..నియంత అన్నారు. నేను ఒక రాజకీయ వేదికపైకి వెళ్లాక ఏం మాట్లాడాలో అదే మాట్లాడాను అన్నట్లుంది. ఇవే మాటలు మరోసారి రావచ్చు..అందుకే మేం సమాధానం చెప్పాల్సి వస్తోంది.

షర్మిలమ్మ నిన్నటి వరకూ మూడేళ్లుగా తెలంగాణలో ఏం చేశారు..? అక్కడనుంచి హఠాత్తుగా ఇక్కడికి ఎందుకు వచ్చారు? తెలంగాణలో కాంగ్రెస్‌ ఉంది కదా..అక్కడ ఎందుకు చేయలేకపోయారు..? హఠాత్తుగా డిప్యుటేషన్‌ ఎందుకు..? ఎవరి ప్రయోజనాలు కాపాడటానికి? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్ల శాతం ఉంది.నోటాకు 1.28 శాతం వస్తే 1.17 శాతం ఓట్లు కాంగ్రెస్‌ పార్టీకి పోలయ్యాయి. రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే లక్ష్యంతో ఇక్కడకు వచ్చి ఆమె చేయలగలిగింది ఏముంది?

ఏదైనా ఆమె చేయగలిగింది ఉంటే తెలంగాణలో చేయవచ్చు. మొన్నటి ఎన్నికల్లో అత్తెసరు సీట్లే వచ్చాయి. రాజశేఖరరెడ్డి పేరు అక్కడి ఎన్నికల్లో యథేచ్ఛగా వాడుకున్నారు. షర్మిలమ్మ తన పలుకుబడి ఉపయోగించి తిరిగితే రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడానికి పనికి వచ్చేదేమో? మరి ఇక్కడకెందుకు వచ్చారు? ఆమె లక్ష్యం రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడం కాదు..చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం ఎలా అనేదే ఉన్నట్లుంది. చంద్రబాబునాయుడు తన లక్ష్యం కోసం అన్ని అస్త్రాలను ఉపయోగించడంతో పాటు ఆఖరున ఈమెను కూడా తీసుకొస్తే వైఎస్సార్‌ అభిమానుల ఓట్లు చీల్చడానికి ఉపయోగపడుతుదేమోనని ఆయన ప్రయత్నం. మళ్లీ యాంటి ఇంకబెన్సీ ఓటు చీలకూడదు…కేవలం క్రిస్టియన్‌ మైనార్టీలు, దళితుల ఓట్లు మాత్రమే టార్గెట్‌ స్పీచ్‌ తయారు చేసి పంపారు.

కాంగ్రెస్‌ తరఫున హోదాపై షర్మిలమ్మే సంజాయిషీ ఇవ్వాలి:
మేం అడుగుతున్నది ఒక్కటే. అసలు ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే చంద్రబాబుతో కుమ్మక్కై ఆనాడు కాంగ్రెస్‌ చేసింది. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి మనల్ని పక్కకి పంపారు. మన హక్కులను రక్షించకుండా, స్పెషల్‌ స్టేటస్‌ చట్టబద్ధం చేయకుండా అన్యాయం చేసింది. ఈ రోజు ఆ వేదికపై ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు. అసలు చీల్చిందే మీ పార్టీ కదా? ఆ రోజు ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టి ఉంటే అసలు పోరాడాల్సిన అవసరమే ఉండదు కదా?

రాజధానికి కావాల్సిన ఆర్థిక వనరులు ఇస్తామని ఆ రోజు చట్టంలో పెట్టి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా? తాను చేసిన తప్పుకు తాను సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పార్టీ ఇప్పుడు అడ్రస్‌ లేకుండా పోయింది. ఆ పార్టీ తరఫున షర్మిలమ్మ వకల్తా పుచ్చుకుని జగన్‌ ని అడుగుతోంది. వ్యక్తిగతంగా ఆ పార్టీ తరఫున ఆమె సంజాయిషీ ఇవ్వాలి. ఆమె మమ్మల్ని ప్రశ్నించడం చిత్రంగా ఉంది. ఆమె వ్యక్తిగతంగా సంజాయిషీ ఇవ్వాలి. ఒక పార్టీ తరఫున మాట్లాడుతున్నప్పుడు ఆమె సమాధానం చెప్పాలి.

ఇన్నాళ్లూ తెలంగాణలో ఏం చేశావు..? ఇదే షర్మిలమ్మ తన తండ్రి పేరు అక్రమంగా కేసులో పెట్టారు అని అన్నారు. ఇంత అన్యాయం చేసిన పార్టీ అని మరి ఈ రోజు అదంతా ఎలా మర్చిపోయారు? చివర్లో ఆమె రియలైజ్‌ అయింది అనుకున్నా కాంగ్రెస్‌ వాళ్లు వచ్చి ఈమెను మద్దతు కోరారా? 119 సీట్లో పోటీ చేస్తున్నా అన్న ఆమె మళ్లీ ఎందుకు చేయలేదు..? అసలు తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్పకుండానే పక్కకు ఎందుకు జరుగుతున్నారు? ఈ రాష్ట్రంలో మీకు పనేముంది అని తోసేయడానికి తెలంగాణ కాంగ్రెస్‌ వారు ట్రై చేశారు.

రేవంత్‌రెడ్డి…ఇక్కడ ఆమెకు అవకాశం లేదు పొమ్మంటే చంద్రబాబు నేను ఉపయోగించుకుంటాను అని తెచ్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇక్కడకు రావడం రావడమే ఈ పదేళ్లలో ఏం జరిగింది అంటూ మాట్లాడుతూ జగన్‌ రెడ్డీ అనడం, నియంత అనడం, బాష అన్నీ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. ఆ రోజు తప్పు చేసిన మీ కాంగ్రెస్‌ పార్టీపై మా విధానం ఈరోజు కూడా ఒక మాటపై కట్టుబడి ఉన్నాం. పోరాటం ఏఏ పద్దతుల్లో చేయాలో చేయడంతో పాటు..కేంద్రంలో వత్తిడి పెట్టగలిగిన సంఖ్య, కేంద్రం మనపై ఆధారపడే పరిస్థితి వచ్చే వరకూ ఆ అంశాన్ని సజీవంగా ఉంచుతున్నాం. ఎప్పటికప్పుడు హోదా అంశాన్ని లేవనెత్తుతూ..ఎప్పుడైతే ఆ అవకాశం వస్తుందో అప్పుడు దాన్ని సాధించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం.

అందులో భాగంగా ప్రధాని పక్కనే ఉన్నా విశాఖ సభలో జగన్‌ గారు హోదా అంశాన్ని లేవనెత్తారు. దాన్ని చాపకింద తోయలేదు.. మర్చిపోలేదు. మా ప్రభుత్వం రాగానే ఢిల్లీలో జరిగిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో కూడా స్పష్టంగా చెప్పారు. మా మీద ఆధారపడే అవసరం మోడీకి లేదు అనేది ఈ పరిస్థితికి కారణమవుతోందని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలు ఆమె తీసుకున్నప్పుడు ఆ రోజు ఆ పార్టీ స్పెషల్‌ స్టేటస్‌ చట్టంలో చేర్చలేదు..? అడ్డగోలుగా కాంగ్రెస్‌ ఈ రాష్ట్రాన్ని విభజించింది..ఎందుకు ఏపీకి సరైన గ్యారెంటీలు కల్పించకుండా ఏకపక్షంగా విభజించారో జవాబు ఇవ్వాలి కదా? అలా సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదంటే నోటా కంటే తక్కువ ఓట్లు ఇచ్చి ప్రజలు శిక్ష వేశారు.

ఇప్పుడు ఈమె పార్టీని భుజాన ఎత్తుకుని రాహుల్‌ గాంధీని ప్రధానిని చేస్తాను అంటున్నారు కాబట్టి ఆమె సంజాయిషీ ఇవ్వాల్సి వస్తుంది. ఈ మూడేళ్లు నేను తెలంగాణ బిడ్డను, అక్కడ ఉంటాను అంటే తెలంగాణ యాసలో మాట్లాడి కాంగ్రెస్‌ను తూర్పారబట్టారు. నా జీవితం అంతా తెలంగాణలోనే అన్న ఆమె ఎందుకో ఇటు వచ్చారు. కేవలం జగన్‌ గారున్నారనే..ఆమెకు ఒక వెపన్‌ అవుతుందని..ఆ వెపన్‌ చంద్రబాబుకు ఎలా ఉపయోగపడుతుందో కూడా ప్రజలకు తెలుసు.

వైఎస్సార్‌ అభిమానుల ఓట్లను, దళితులు, మైనార్టీల ఓట్లలో చీలిక తీసుకురావచ్చనే కుట్రలో భాగంగానే ఈమె ఒక అస్త్రం అయ్యారు. ఎవరైనా కన్ఫ్యూజన్‌కి గురవుతారేమోనని మళ్లీ మళ్లీ చెప్తున్నాం..రాష్ట్రంలో ఉన్నది ఒకటే కాంగ్రెస్‌ పార్టీ..అది వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ. హస్తం గుర్తు కాంగ్రెస్‌ ఎప్పుడో పోయింది..వైఎస్సార్‌ అందరి గుండెల్లో ఉన్నారు..ఆయన తనయుడు జగన్‌ వారసుడిగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు.

ఈ రాష్ట్రంలో ఉన్న మైనార్టీలు, క్రైస్తవులు, దళితులతో పాటు ఎవరికైనా రక్షణ ఇవ్వగల శక్తి, నిబద్ధత తనకుందని ఈ పన్నెండేళ్ల నుంచి జగన్‌ రుజువు చేసుకుంటూనే ఉన్నారు. ఇక వేరే ప్రత్యామ్నాయం ఈ రాష్ట్రంలో అవసరం లేదు..ఆ అవకాశం లేదు. మతం ఎదైనా వ్యక్తిగతంగానే ఉండాలి కానీ అది రాజకీయంగా, పరిపాలనలో దాని ప్రభావం ఉండకూడదని బలంగా విశ్వసించిన వ్యక్తి జగన్‌. ఏ దేవుడ్ని ఎవరు కొలిచినా అన్నిటి భావం ఒకటే అని నమ్మిన వ్యక్తిగా వాటికి అతీతంగా ఉన్నారు.

ఎవరికి ఏ అన్యాయం జరిగిన వారిని రక్షించడం, అక్కున చేర్చుకోవడం చేస్తున్నారు. మత ప్రాతిపదికన ఎవరికి ఏ అన్యాయం జరిగినా ఆయన సహించడు..అలాంటిది జరగనివ్వడని ఐదు కోట్ల మంది ప్రజలు విశ్వసిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన వ్యక్తిగత విశ్వాసాలు కాకుండా రాష్ట్రం అవసరాలు, ప్రజల ఆకాంక్షలు ఇవే ప్రధానంగా మన రాజకీయ విధానాలను నిర్ధేశించాలని బలంగా నమ్మే వ్యక్తి జగన్‌. కేంద్రంలో ఎవరున్నా వారితో సమన్వయం చేసుకుని వీలైనంత వరకూ రాష్ట్రానికి మేలు చేయాలని ఆలోచించే వ్యక్తి జగన్‌ .

ఎక్కడో ఏ మూలనో ఏదో జరిగితే ప్రతి దానిపైనా రియాక్ట్‌ కావడానికి ఆయన సంపాదకీయ వర్గం కాదు..ఒక వ్యక్తి కాదు. ఈ రాష్ట్రానికి ఏం చేయగలమనేదే ఆలోచించాలి. అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలు కాపాడాలి. ఆ విషయంలో ఎప్పుడూ రాజీపడే ప్రసక్తే లేదు. అంతేకానీ..మన ప్రభావం చూపలేని వాటి గురించి నోటి దూల తీర్చుకోడానికి ప్రసంగాలు, స్టేట్‌మెంట్లు ఇవ్వడం ఆయనకు ఇష్టం ఉండదు. అది ప్రజలకు తెలుసు..అందుకే ఆయన్ను అందరూ నమ్ముతున్నారు. జగన్‌ చెల్లెలుగా, రాజశేఖరరెడ్డి కూతురుగా ఆమెను అభిమానించే వారు ఉండొచ్చు. కానీ అది కూడా ఆమె పొగొట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ రోజు ఆమె మాట తీరు చూస్తుంటే అర్ధం అవుతోంది.

తెలంగాణలో ఉన్న యాస ఇక్కడకు వచ్చాక మారింది కానీ.. మిగిలినవన్నీ సేమ్‌ టు సేమ్‌. ఆమె కాంగ్రెస్‌ను తిట్టిన విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదు. కాంగ్రెస్‌ పార్టీ ఆమె సేవలు అక్కడ ఎందుకు ఉపయోగించుకోలేదు..? ఎందుకు పక్కన పెట్టారు..? ఎందుకు ఇప్పుడు ఏపీకి తెచ్చారు? 2019లో అసలు పట్టించుకోని కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం ఇప్పుడు హఠాత్తుగా ఈమెను ఎందుకు పంపారు..? మరో వైపు సీఎం రమేష్‌ ఫ్లైట్‌లో వచ్చిన ఆమె భర్త అనిల్‌ కుమార్‌ వెనుక బీటెక్‌ రవి ఉన్నాడు.

ఆనాడు సోనియా గాంధీ వద్దకు వెళ్లిన ముగ్గురిలో ఈమె కూడా ఉన్నారు. ఆమె కఠినంగా బిహేవ్‌ చేశారని షర్మిలమ్మే అన్నారు. ఇప్పటికీ జనం గుండెల్లో సజీవంగా ఉన్న రాజశేఖరరెడ్డి కుటుంబం గురించి రోడ్డుపై పడి చర్చించుకోవాల్సి రావడం బాధాకరం. రోజూ టీడీపీ, జనసేన మాట్లాడేవే షర్మిల కూడా మాట్లాడారు. అవే మాట్లాడితే లేని పార్టీకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు.

LEAVE A RESPONSE