Suryaa.co.in

Devotional

శ్రీరాముడు పరంధామము చేరు ఘట్టం

శ్రీరామాయణ ఉత్తరకాండలో చివరగా చెప్పే కొన్ని భావోద్వేగ ఘట్టాలు ఒకసారి లీలామాత్రముగా అవలోకనం చేసుకుందాము. శ్రీరాముడు తన అవతార స్వీకారం సమయంలో “దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ” అంటే 11000 సంవత్సరాలు తాను భూమండలాన్ని ఏలి ధర్మాన్ని పునరుద్ధరిస్తానని మాట ఇచ్చిన ప్రకారం 11 వేల ఏళ్ళు ఆయన రాజ్యం చెయ్యగా బ్రహ్మదేవుడు కాలపురుషుని తపస్వి రూపంలో శ్రీరాముని వద్దకు పంపుతాడు.

కాలపురుషుడు శ్రీరామునితో ఏకాంతంలో మాట్లాడాలని, ఈ సంభాషణను విన్నను చూచినను వారు నీచేతిలో వధింపబడవలెను అని కోరగా శ్రీరాముడు ద్వారం వద్ద ఉన్న ప్రతీహారిని పంపి లక్ష్మణుడే అక్కడ కావలి ఉండాలని ఆజ్ఞాపిస్తాడు. అంతట కాలపురుషుడు వైకుంఠంనుండి వచ్చేటప్పుడు ఇన్ని సంవత్సరాలు ధర్మసంస్థాపన చేస్తావని ప్రతిజ్ఞ పూని ఇన్నేళ్ళు ఇక్కడ రాజ్యం చేసావు.

నీవు మరికొన్ని ఏళ్ళు ఈ ప్రజలను ఏలవలెననుకుంటే ఇక్కడ వుండుము, లేదా నీ విష్ణువు అవతారంలో ముల్లోకాలను ఏలమని బ్రహ్మదేవుడు మీకు మనవి చేసారని చెప్పగా తప్పక తాను తన పని పూర్తి అయింది కనుక భక్తపరాధీనుడిని కనుక బ్రహ్మ వాక్కును పాటిస్తాను అని చెబుతాడు.

ఇంతలో దూర్వాసమహాముని ద్వారం వద్దకు వచ్చి తాను అత్యవసరంగా కలవాలి అంటే క్షణం నిలువమన్న లక్ష్మణుని తనను లోనికి ప్రవేశ పెట్టకపోతే మొత్తం వంశాన్ని శపిస్తానని కోపంతో చెప్పగా లక్ష్మణుడు లోనికి పోతే పోయే తన ప్రాణం కన్నా వంశనష్టం కష్టమని లోనికి పోయి ఈ విషయం నివేదిస్తాడు. అంతట కాలపురుషుడు వెళ్ళిపోగా దూర్వాసముని వచ్చిన సంగతివిని ఆయన్ను సంతృప్తి పరుస్తాడు రాముడు.

కానీ అన్న మాట ప్రకారం లక్ష్మణుని వధించాలి అన్న విషయానికి మిగుల బాధ పడగా వశిష్టుడు తమ్ముని వదిలి వేసినచో అతడిని వధించినట్టే అన్న ధర్మసూక్ష్మాన్ని బోధించగా లక్ష్మణుడు అశ్రునయనాలతో తన ఇంటికి కూడా పోవక సరయూనది వద్దకు పోయి ఆచమించి అంజలి ఘటించి, ఇంద్రియాలను నిగ్రహించుకుని, ప్రాణవాయువులను నిరోధించి తన శరీరంతో పాటు అచటనున్న వారందరికీ అదృశ్యమయ్యాడు. శ్రీమన్నారాయణుని చతుర్ధంశను ఇంద్రునితో సహా దేవతలందరూ ఆయన్ను పూజించారు.

అటుపై భరతుని పట్టాభిషేకం చేస్తాననగా భరతుడు తాను కూడా అన్నగారిని అనుగామిస్తానని లవకుశులకు పట్టాభిషేకం చేయిస్తాడు. మధురాపురంలో ఉన్న శత్రుఘ్నునికి తమ మహాభినిష్క్రమణ విషయం చెప్పమని వేగులను పంపుతారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలందరూ శ్రీరాముని వద్దకు వచ్చి తాము, తమ కుటుంబ సభ్యులు కూడా శ్రీరాముని అనుసరిస్తామని ప్రార్ధించగా శ్రీరాముడు వారికి అభయమిస్తాడు.

ఇంత కర్ణకఠోరమైన విషయం విన్న శత్రుఘ్నుడు తన రాజ్యాన్ని తన కుమారులకు పంచి ఇచ్చి, తాను కూడా వేగంగా అయోధ్య చేరి అన్న పాదాలపై పడి తాను కూడా వారి వెంటే వెళ్తానని ఆమోదించమని ప్రార్ధించగా ఆయనకు కూడా అనుమతి ఇస్తాడు. ఇలోపు అసంఖ్యాకంగా వానరాలు, భల్లూకాలు సుగ్రీవుని నాయకత్వమున శ్రీరామ దర్శనానికి వస్తారు. రాక్షసులు, వారి రాజైన విభీషణుడు కూడా దర్శించి అందరూ వస్తామని వేడుకోగా, సుగ్రీవుని – అనుమతిస్తాడు

విభీషణుని – సూర్య చంద్రులు ఉన్నంత వరకు రాజ్యపాలన చెయ్యమని ఆజ్ఞాపిస్తాడు. (చిరంజీవి ) హనుమంతుని – బ్రహ్మ వరప్రభావం వలన నీవు చిరంజీవివి, రామనామ కీర్తన ఉన్నన్నాళ్ళు నీవు నామ సంకీర్తన చేస్తూ పరమానందము పొందు అని అభయమిస్తాడు (చిరంజీవి )…. జాంబవంతుని, మైందుడు, ద్వివిదుడు – కలిపురుషుడు అడుగిడనంతవరకు మీరు ఈ భూమి మీద ఉండాలని, కలిద్వాపర సంధికాలంలో అనగా శ్రీకృష్ణఅవతారం వరకు వారు ఉండాలని ఆదేశిస్తాడు.

మరునాడు ప్రాత:కాలమున బ్రాహ్మణులతో కూడి ప్రజ్వలించు అగ్నిహోత్రములు ముందు నడువగా శ్రీరాముడు సన్నని వస్త్రములను ధరించి, స్వయంగా రెండు చేతులతో కుశాలను గ్రహించి దివ్యమంత్రమును పఠిస్తూ పాదుకలు ధరించక ఎవరినీ చూడక నడుస్తున్నారు.

ఆయన కుడిపక్కన లక్ష్మీదేవి, ఎడమవైపు భూదేవి, ముందు సంహార శక్తి నడుస్తున్నారు. ఆయన ధనుస్సు, అనేక బాణములు, అలాగే సమస్త ఆయుధములు పురుష రూపములు ధరించి స్వామిని అనుసరిస్తున్నారు. భరతశత్రుఘ్నులు, గాయత్రిమాత, ఓంకారము, వషట్కారము, బ్రాహ్మణులు, ఋషులు, అయోధ్యా నగర వాసులు, పశుపక్ష్యాదులు, భల్లూక వానర రాక్షసులు, పురజనులు, అందరూ స్వామిని అనుసరించగా ఒకటిన్నర యోజనం ప్రయాణించి పడమరదిశగా ప్రయాణిస్తున్న సరయూనది చేరారు.

అంతట బ్రహ్మదేవుడు శ్రీరాముని ప్రార్ధించి ఆయనకు సరి అనిపించిన ఏదైనా రూపం ధరించమని ప్రార్ధించగా సశరీరంగా తమ్ములతో కూడి తేజోమయమైన శ్రీవిష్ణువు రూపమును పొందెను. అటుపై తనకోసం వచ్చిన వారందరికీ బ్రహ్మలోక ప్రాప్తి కలిగించమని బ్రహ్మను ఆదేశించగా వారందరినీ సాంతానికము అన్న లోకానికి చేరుస్తాడు. దేవతల అంశాలతో పుట్టిన వానర భల్లూక మానవులు వారి వారి రూపంలో లీనమైపోతారు.

సుగ్రీవుడు సూర్యమండలానికి, ఇతర వానరములు పితృదేవతల రూపంలో లీనమయ్యారు. సరయూ నదిని తాకిన వారందరూ తమ మానవ రూపాన్ని వదిలి దివ్య దేహాలతో దివ్యవిమానాలు అధిరోహించి దేవలోకాన్ని పొందారు. అంతట దేవతలు, గంధర్వులు, యక్ష, కిన్నర కింపురుషులు అందరూ స్వామిని భక్తితో పూజించి జయజయ ధ్వానాలు చేసారు.

ఇది శ్రీరాముడు పరంధామమునకు చేరిన వైనము.
(నిన్న ఒక గొర్రె సరయూలో ఆత్మహత్య చేసుకున్న రాముడు ఎక్కడకు పోయాడు అని ఒక ముష్టి ముదనష్టపు ప్రశ్న వేశాడని ఇది రాయడం. మేకులు కొడితే దేవుడా నన్నోదిలేసావా అని ఏడ్చేవాడు కాదురా బడుద్ధాయి దేవుడంటే ధర్మం కోసం మానవుడిలా జీవించి, ధర్మ ప్రతిష్టాపన చేసి శరీరాన్ని తృణప్రాయంగా వదలడం దైవత్వం, అయినా మా రాముడు సశరీరంగా విష్ణురూపం తీసుకుని అవతార సమాప్తి చేసాడు…. పోనీ ఆ వెర్రి గొర్రె వలన మనం ఒకసారి స్వామిని మననం చేసుకున్నామన్న సంతోషం ! )

ఓం నమో వేంకటేశాయ !!
సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు

LEAVE A RESPONSE