Suryaa.co.in

Devotional

అయ్యప్పదీక్ష అంతరార్ధం

అయ్యప్ప దీక్ష కేవలం 40 రోజుల పాటు గడిపే నియమబద్ధ జీవితం కాదు. అది అద్వైతానికి దిక్సూచి. ఆత్మ, పరమాత్మల సంయోగానికి వారిధి. వేదాంతసారమైన ఉపనిషద్వాక్యాల్ని జీవనసారంగా మలుచుకునేందుకు మనిషి తనకు తానుగా పాడుకునే ఆత్మ చైతన్యగీతిక. ఎన్నో అనుభవాలు. మరెన్నో అనుభూతులు. అన్నీ కలిస్తే… మహోన్నతమైన పరివర్తనకు అంకురార్పణే అయ్యప్ప దీక్షాధారణ.

కోట్లకు అధిపతి అయినా, కార్మికుడైనా… నాయకుడైనా, శ్రామికుడైనా… దీక్ష తీసుకున్న మరుక్షణం నుంచి మనిషి నియమధారి అవుతాడు. చన్నీటి స్నానం, నల్లనివస్త్రాలు, తులసి, స్ఫటికమాలలు, విభూది, గంధం ధరించడం, కటిక నేలపై శయనించడం, ఏకభుక్తం, పాదరక్షల్ని విడిచిపెట్టడం, బ్రహ్మచర్యాన్ని పాటించడం, త్రికాలాల్లోనూ స్వామి అర్చన, తోటివారందరినీ స్వామీ అని సంబోధించడం… ఇలా అన్ని రకాలుగా మనిషి దైవంగా మారే సాధన కనిపిస్తుంది.

40 రోజుల దీక్ష పూర్తిచేసుకుని శబరిమల స్వామి ఆలయాన్ని చేరుకుని, పదునెట్టాంబడి ఎక్కగానే ఆలయం ముందుభాగంలో ‘తత్త్వమసి’ అనే మహావాక్యం కనిపిస్తుంది. ఇది వేదసారం, ఉపనిషద్బోధ. తత్‌, త్వం, అసి అనే మూడు పదాల కలయిక తత్త్వమసి. ‘అది నీవై ఉన్నావు’ అనేది ఈ వాక్యానికి అర్థం. ఇన్ని రోజుల పాటు కఠోర నియమాలు ఆచరించి, ఏ స్వామి దర్శనానికి వచ్చావో ఆ స్వామి నీవేనంటూ దీక్షాధారుడికి ప్రబోధిస్తుంది ఈ వాక్యం.

దీక్ష ప్రారంభించిన రోజు నుంచి ఆ వ్యక్తిని అందరూ ‘స్వామీ’ అని సంబోధిస్తారు. ఇది నియమం. దీక్ష తీసుకున్న వ్యక్తి ఏ దైవాన్నయితే ఆరాధిస్తున్నాడో ఆ స్వామి పేరుతోనే ఇతరులనూ సంబోధించడం ఇక్కడ విశేషం. శివాభిషేక ప్రారంభంలో చదివే మహన్యాసం ‘నా రుద్రో రుద్రమర్చయేత్‌’ – తాను స్వయంగా రుద్రుడిగా మారి రుద్రుడిని అర్చించాలి. లేకపోతే శివారాధనకు అధికారం లేదని చెబుతుంది. అయ్యప్పదీక్ష కూడా వేదప్రతిపాదితమైన ఈ వాక్యాన్ని అనుసరిస్తుంది. దీక్షాధారుడు స్వయంగా ‘స్వామి’గా మారి అయ్యప్ప స్వామిని అర్చించటం ఇందులోని అంతరార్థం.

LEAVE A RESPONSE