‘కాగల కార్యం గంధర్వులు తీర్చారు ‘ అంటే ఇదే.
జగన్ ను, ఆయన బృందాన్ని విమర్శించడానికి ఆపసోపాలు పడుతున్న తెలుగు దేశం నేతల వల్ల కావడం లేదని…. ఆ ఉపన్యాసాలు వింటున్నవారికి అనిపిస్తే, ఆశ్చర్యం లేదు. ఇనప గుగ్గిళ్ళు మిక్సీ లో వేసి, టీడీపీ నేతలు అదేపనిగా రుబ్బుతూ వస్తున్నారు. అవే మొహాలు. అవే విమర్శలు. అవే విషయాలు. అవే హెచ్చరికలు. అవే శాపనార్ధాలు. దేని లోనూ ఫ్రెష్ నెస్ లేదు. కాకపోతే, జగన్ దెబ్బకు దడిచి పోయిన వారు తెలుగు దేశం వైపు చూస్తున్నారు.
ఈ విమర్శల నుంచి, ఈ పాత మొహాల నుంచి, ఈ రొటీన్ పంచ్ ల నుంచి…. తెలుగు ప్రజలకు గొప్ప రిలీఫ్ లభించింది. ఆ రిలీఫ్ పేరే వై. యస్. షర్మిల. ఆనాటి రాజశేఖర రెడ్డి ఏకైక కుమార్తె గా…. ఆమె తల చుట్టూ వెలుగు చక్రం. ముఖ్యమంత్రి వై యస్ జగన్ సోదరిగా… ఆమె తలపై కీర్తి కిరీటం. ఆమె ఘన రాజకీయ వారసత్వాన్ని ఎవరూ తృణీకరించలేరు.
జగన్ పై మంచి కసి మీద ఉన్నది. నదురు లేదు, బెదురు లేదు, మాటలకు తడుముకునే పని లేదు. వెనుక నుంచి కాంగ్రెస్ దిగ్గజాలు వెన్నుదన్నుగా ఉన్నాయి.
కర్ణాటక (ఉప ) ముఖ్యమంత్రి డీ కే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవసరాన్ని బట్టి…. చెరో భుజం కాస్తారు. మొత్తం సమన్వయానికి…. కళ్ళతోనే మాట్టాడే కేవీపీ రామచంద్ర రావు ఉన్నారు. కాంగ్రెస్ లో దిగ్గజాలుగా ఓ వెలిగి, ప్రస్తుతం ఎవరి కలుగుల్లో వారు విశ్రాంతి తీసుకుంటున్న నేతలు షర్మిల సభలకు హాజరవుతున్నారు, తోకలన్నీ వినయంగా లోపలకు మడిచేసి. ఇన్ని అండ దండలను కొంగున ముడివేసుకున్న షర్మిల(మ్మ), బాణాలు బయటికి తీశారు.
వైసీపీ ని రఫ్ఫాడిస్తున్నారు.
“ఇప్పుడు ట్రైల్ ఫిల్మ్. సినిమా ముందుంది…” అని పీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు.
నిజమే అనిపిస్తున్నది.
జగన్ పైన, ఆయన బృందం పైన షర్మిల ఇప్పుడే విమర్శలు మొదలు పెట్టారు. ఎన్నికలకు గడువు సమీపిస్తున్న కొద్దీ ఆమె విమర్శలలో తీవ్రత పెరుగుతుంది. చెప్పాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి అనేది పరిశీలకుల మాట. ఆ విషయాలు ఎవరు మాట్టాడినా, వాటికి విలువ ఉండదు. జనం కూడా పట్టించుకోరు.
షర్మిల నోరు తెరిస్తే మాత్రం…. జనం కూడా నోళ్లు తెరుస్తారు, ” ఔరా…!” అనుకుంటూ.
జగన్ బృంద సభ్యులు షర్మిలను విమర్శిస్తే ఒక తంటా. విమర్శించక పోతే ఇంకో తంటా!
షర్మిల పుణ్యమా అని రాష్ట్రం లో ఎన్నికల వాతావరణానికి ‘ఎలక్షన్ కళ ‘ వచ్చింది.