Suryaa.co.in

Andhra Pradesh

ఒక్క ఓటు కూడా మిస్ కానివ్వద్దు

-గుంటూరు పశ్చిమ టిడిపి నాయకుల ఆత్మీయ పరిచయ కార్యక్రమంలో డాక్టర్ పెమ్మసాని
– పశ్చిమ ఎప్పుడు అభ్యర్థులకు మెజారిటీ ఇచ్చేదే: కోవెలమూడి రవీంద్ర (నాని)

‘రాబోయే ఎన్నికల్లో ఏ ఒక్క ఓటును మిస్ కానివ్వద్దు, ఒక్క ఓటు కూడా ప్రత్యర్థికి పడకుండా కాపాడుకుందాం.’ అని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టిడిపి నేతలతో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆత్మీయ పరిచయ కార్యక్రమం స్థానిక టిడిపి జిల్లా కార్యాలయంలో గురువారం జరిగింది.

ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికి నాయకులు ఎంతమంది మారినా, పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కార్యకర్తలకు, నాయకులకు, పశ్చిమ నియోజకవర్గ కలియుగ కర్ణుడైన నానికి ఆయన మనస్పూర్తిగా అభినందనలు తెలిపారు. అదేవిధంగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి దాదాపు రెండు దశాబ్దాలకు పైగా నాని ఎన్నో సేవలు చేశారన్నారు. ఆయనతో పాటు కార్యకర్తలు ఉమ్మడిగా పనిచేసి గెలిపించినా సరే ఓ నాయకుడు పార్టీని మోసం చేసి వెళ్లారని, అయినా సరే నేటికీ ఈ నియోజకవర్గ బాధ్యతలను వదిలిపెట్టకుండా నాని పనిచేస్తున్నారని అన్నారు. ఒక వ్యక్తి తన జీవితంలో 30-35 ఏళ్ల సమయంలోనే ఎదగడం, విజయాలు సాధించడం వంటివి చేయగలరని, అంతటి విలువైన సమయాన్ని కూడా పార్టీకి వెచ్చించి కష్టపడ్డ వ్యక్తి నాని అని కొనియాడారు.

ప్రపంచంలో డల్లాస్, దుబాయ్ తర్వాత హైదరాబాదును అత్యంత ప్రముఖ నగరంగా పేర్కొంటారని, ఓ రాజర్షి చేసిన కృషి ఫలిత ఫలితంగానే హైదరాబాదుకు ఆ స్థాయి దక్కిందని పేర్కొన్నారు. తాను బుధవారం నాడు నారా లోకేశ్ ను కలుసుకున్నానని, ఒక్క రోజులో ఆయన పడుతున్న కష్టం ఆశ్చర్యపోయానన్నారు. లోకేష్ కు ప్రోటోకాల్ పై ఆసక్తి లేదని, రోజులో 24 గంటలు పని, పని అని పరిగెడుతుంటారని వివరించారు. 80 వేల మందికి అన్నం పెడుతున్న జయదేవ్ కు చెందిన అమర్ రాజా ఫ్యాక్టరీని రాష్ట్రం నుంచి పంపించేంతవరకు ఈ జగన్ నిద్ర పోలేదని, అన్ని వేల మందికి అన్నం దూరమవుతుందని తెలిసినా లెక్కచేయని వ్యక్తి జగన్ అని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి ఎన్నో అరాచకాలను చూసి తట్టుకోలేకే తాను రాజకీయాల్లోకి వచ్చానని పెమ్మసాని స్పష్టం చేశారు. మరోసారి ఈ రాష్ట్రంలో అనుకోనిది ఏదైనా జరిగితే, ఈ రాష్ట్రాన్ని మరెవ్వరూ కాపాడలేరని సూచించారు. పశ్చిమ ఇంచార్జ్ నానికి తన వైపు నుంచి ఏ సహాయం చేయాలో అంతా చేస్తానని అన్నారు. అలాగే గుంటూరు వెస్ట్ టిడిపి ఇంచార్జ్ కోవెలమూడి రవీంద్ర(నాని) మాట్లాడుతూ మానవత్వం, సేవ విలువ తెలిసిన పెమ్మసాని లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం చాలా అరుదుగా చూస్తుంటామని అన్నారు.

ఎన్నికలకు మరో 48 రోజులు సమయం ఉందని, వాడ వాడల్లో, వీధి వీధినా కార్యకర్తలు తిరిగి పనిచేసి తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి దోహదపడాలని కోరారు. అనాదిగా గుంటూరు వెస్ట్ లో టిడిపికి ఎప్పుడు మెజారిటీ ఇస్తూ వస్తున్నామని, ఈసారి కూడా చంద్రశేఖర్ కు మెజారిటీ అందించి విజయతీరాలకు నడిపించాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతి డివిజన్, క్లస్టర్ ఇన్చార్జి మొదలు కార్పొరేటర్లు, నాయకుల వరకు పెమ్మసాని విజయానికి కృషి చేయాలన్నారు.

అనంతరం తాడికొండ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ కష్టపడి చదివి, ఎదిగిన పెమ్మసాని అనేక సేవా కార్యక్రమాలను తన సొంత ఖర్చుతో నిర్వహించారని, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల ద్వారా ఆ సేవలు మరింత ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో వచ్చారని పేర్కొన్నారు. టిడిపి టౌన్ అధ్యక్షులు డేగల ప్రభాకర్ మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టిడిపికి అత్యధిక మెజారిటీ తీసుకొచ్చే ప్రాంతమని, పెమ్మసానికి కూడా అదే స్థాయిలో మెజారిటీ తీసుకొచ్చే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు రాయపాటి సాయి కృష్ణ, మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి, క్రిస్టియన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల మ్యాని తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE