అధికారంలోకి వచ్చాక జిఓ నెం.5,6 రద్దుచేస్తాం
అసలైన లబ్ధిదారులకు ఆటోనగర్ స్థలాలు ఇస్తాం
ఆటోనగర్, ఆటో కార్మికులు, ఆటో యూనియన్, ఎసి మెకానిక్ లతో లోకేష్ భేటీ
అమరావతి: టీడీపీ అధికారంలోకి రాగానే మోటారు రంగ కార్మికులను అన్నివిధాలా ఆదుకుంటామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో ఆటోనగర్ వర్కర్స్ యూనియన్, ఏపీ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు, ఆటో కార్మికులు, ఆటో యూనియన్ ప్రతినిధులతో ఆదివారం లోకేష్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా ఆటోనగర్లలో విలువైన స్థలాలను కాజేందుకే జగన్ ప్రభుత్వం జిఓ నెం.5,6లను తెచ్చిందన్నారు. లక్షలాదిమంది కార్మికుల జీవితాలతో ముడివడి ఉన్న ఆ రెండు జిఓలను అధికారంలోకి వచ్చినవెంటనే రద్దుచేస్తామని చెప్పారు. మంగళగిరి ఆటోనగర్ ను విస్తరించి, నిజమైన లబ్ధిదారులకు స్థలాలు, షాపులు కేటాయిస్తాం. మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం. దేశంలో బెస్ట్ గా మంగళగిరి ఆటోనగర్ గా రూపుదిద్దుతాం.
ఆటోనగర్ లో టీడీపీకి మద్దతు తెలుపుతున్న వారిపై బెదిరింపులకు దిగుతున్న వైకాపా నాయకులను ఉపేక్షించబోం. కార్మికులకు శిక్షణ ఇచ్చి ఆదాయాన్ని పెంచుతాం అని లోకేష్ అన్నారు. ఆటోనగర్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. ఆటోనగర్ లో 120 ప్లాట్లను ఏపీఐఐసీ వెనక్కి తీసుకుందని, టీడీపీ ప్రభుత్వంలో అర్హులకు అందజేయాలని కోరారు. టీడీపీకి సహకరించిన వారి షాపులను ఖాళీచేయిస్తున్నారని, అద్దెలు పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్బందుల్లో ఉన్న మోటారురంగ కార్మికులను ఆదుకోవాలని కోరారు.
ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కార్పోరేషన్
ఆటో కార్మికులతో నిర్వహించిన సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం విధిస్తున్న జరిమానాల వల్ల ఆటో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి మరో చేత్తో వంద లాక్కుంటున్నారు. పెట్రో, డీజిల్ ధరలు పెరగడంతో భారంగా మారింది. ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటుచేసి ఆర్థిక చేయూతనిస్తాం. అన్ని పట్టణాల్లో ఆటో డ్రైవర్లకు ప్రత్యేక పార్కింగ్ జోన్ ఏర్పాటుచేస్తాం.
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం వల్ల ఆటో కార్మికులకు ఎలాంటి నష్టం జరగదు. కర్ణాటక, తెలంగాణలో ఆటోలకు డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. పదిశాతం మాత్రమే ప్రభావం చూపుతుంది. ఆటో డ్రైవర్ల ఆదాయం పెంచే మార్గాలు అన్వేషిస్తాం. ఆటోలపై జరిమానాల భారం తగ్గించడంతో పాటు గ్రీన్ ట్యాక్స్ ను తగ్గిస్తాం. ఆటోల ఇన్సూరెన్స్ వ్యయభారం కూడా పెరిగింది. కార్పోరేషన్ ఏర్పాటుద్వారా భారం తగ్గుతుంది. చంద్రన్న బీమా ద్వారా కార్మికులను ఆదుకుంటాం.
పార్కింగ్ ప్రదేశాల్లో రుసుము లేకుండా చేస్తాం. అమరావతి రాజధానిగా ఉంటుంది. తద్వారా ఈ ప్రాంత అభివృద్ధి ద్వారా అన్నిరంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని లోకేష్ చెప్పారు. ఆటో కార్మికులు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తెస్తూ ఆటో డ్రైవర్లకు రూ.10వేలు ఇస్తూ జరిమానాల రూపంలో 50వేల వరకు గుంజుతున్నారు. ఇన్సూరెన్స్ వసతి, ఆరోగ్య వసతి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసుల వేధింపులను నివారించాలని కోరారు.
ఏసీ వర్కర్స్ కు శిక్షణ,పనిముట్లు అందిస్తాం
ఏసీ వర్కర్స్ యూనియన్ ప్రతినిధుల భేటీలో లోకేష్ మాట్లాడుతూ.. ఏసీ వర్కర్స్ కు మెరుగైన శిక్షణతో పాటు పనిముట్లు అందిస్తాం. చంద్రన్న బీమా సౌకర్యాన్ని కల్పిస్తాం. కార్మిక సంక్షేమ బోర్డు పరిధిలో ఏసీ కార్మికులను కూడా చేరుస్తాం. నిరుపేదలకు ఇళ్లు కట్టించి ఇస్తాం. మంగళగిరి నియోజకవర్గంలో పన్నుల భారం తగ్గిస్తాం. పెంచిన కరెంట్ ఛార్జీలను తగ్గించి పేదలపై భారం లేకుండా చేస్తాం.
ఏసీ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తెస్తూ లేబర్ డిపార్ట్ మెంట్ లో ఏపీ వర్కర్స్ ను కూడా చేర్చాలన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ నుంచి కూడా తమకు సహకారం అందడం లేదన్నారు. అసోసియేషన్ కు స్థలం ఇవ్వడంతో పాటు బీమా సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.