Suryaa.co.in

Editorial

ఐపీఎస్సుల.. కస్సు!

– ఈనాడు, ఆంధ్రజ్యోతిపై విజయవాడ సీపీ కాంతిరాణాటాటా ఫైర్
– ఆ ముగ్గురిపై చర్య తీసుకుంటామని హెచ్చరిక
-వారిపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడి
– ఐపిఎస్ అసోసియేషన్ ఈసీ సభ్యుడి హోదాలో ఖండన లేఖ
– అటు ఈనాడుపై సీఎస్ ఆగ్రహం
– మొదటిపేజీలోనే ఖండన ఇవ్వాలని ఆదేశం
– రాణా తీరుపై ఐపిఎస్‌ల ఆగ్రహం
– ఈసీ హోదాలో ఎలా ప్రకటన ఇస్తారని ప్రశ్న
– సెక్రటరీ ఆమోదం లేకుండా ఎలా లేఖ రాస్తారని ఆగ్రహం
– సెక్రటరీ మీనా అందుకు అనుమతించారా?
– ప్రెసిడెంట్, సెక్రటరీ అనుమతి లేకుండా లేఖలేమిటి?
– అది రాణా వ్యక్తిగత లేఖ అని ఐపిఎస్‌ల స్పష్టీకరణ
– కొత్త కార్యవర్గాన్ని ఎవరు ఎన్నుకున్నారని ప్రశ్నలు
– ఎన్నికల సమాచారం తమకు తెలియదంటున్న సీనియర్ ఐపిఎస్‌లు
– అసలు ఐపిఎస్ అసోసియేషన్ పనిచేస్తోందా అని ప్రశ్నలు
– గతంలో డీజీపీ, ఏడీజీలను ఈసీ మార్చినప్పుడు లేఖలు రాయని సంఘం సభ్యులు
( అన్వేష్)

ఏపీలో ఐపిఎస్ అధికారులు కస్సుమంటున్నారు. తాము ఏర్పాటుచేసుకున్న ఐపిఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌లో జరుగుతున్న అతిక్రమణలపై వారు మండిపడుతున్నారు. సెక్రటరి, ప్రెసిడెంట్ అనుమతి లేకుండా ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ అసోసియేషన్ తరఫున మీడియాకు ప్రకటన విడుదల చేయడంపై, సీనియర్ ఐపిఎస్ అధికారులు కారాలుమిరియాలు నూరుతున్నారు. ఇది ఇప్పుడు ఏపీ ఐపిఎస్ అధికారులలో హాట్‌టాపిక్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పులువురు ఐపిఎస్ అధికారులపై, ఈసీకి ఫిర్యాదు చేస్తూ ఒక లేఖ రాశారు. వారిని మార్చాలని అందులో సూచించారు. ఆ సందర్భంగా వారిపై ఉన్న
Complaint-on-IPS-1 ఆరోపణలు పేర్కొంటూ.. ఆ అధికారులను ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలని, గత 26న ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. వారి స్థానంలో ఎవరుంటే బాగుంటుందో కూడా, ఆమె ఆయా అధికారుల పేర్లు సూచించారు.

దానిని ఆలస్యంగా తెలుసుకున్న ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు ఆమె లేఖకు అధిక ప్రాధాన్యం ఇస్తూ పతాకశీర్షికకెక్కించారు. నిజానికి అది పురందేశ్వరి రాసిన లేఖ సారాంశమే తప్ప, మీడియా రాసిందేమీ లేదు. ఆమె తన లేఖపై ఏ అధికారిపై ఏయే ఆరోపణలున్నాయో బాక్సులు కట్టి మరీ ఫిర్యాదు చేశారు. ఇక అటు ఈనాడు కూడా డైరక్టు- ప్రమోటీ ఐపిఎస్ జాబితాపై ప్రభుత్వం చేసిన సిఫార్సులను విమర్శిస్తూ ఒక కథనం రాసింది. ఈసీ నేరుగా ఐపిఎస్ అయిన వారి పేర్లు మాత్రమే పంపాలని కోరిన విషయాన్ని ప్రస్తావించింది.

ఇది ఐఏఎస్-ఐపిఎస్ వర్గాల్లో దుమారం రేపింది. ప్రభుత్వం కావాలనే కొందరు నాన్ క్యాడర్ ఐపిఎస్ ల పేర్ల మధ్య, తనకు అనుకూలురైన డైర క్ట్ ఐపిఎస్ అధికారుల పేర్లు సిఫార్సు చేసిందని, అందులో ముగ్గురికి పోస్టింగులు వచ్చాయంటూ మీడియా కథనాలతో కొత్త చర్చకు తెరలేచింది. దీనిపై ఆగ్రహించిన సీఎస్ జవహర్‌రెడ్డి.. ఈనాడు వార్తను ఖండిస్తూ ఒక ప్రకటన పంపారు. మొదటి పేజీలో తన ఖండన వార్తను ప్రచురించకపోతే, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తామంతా ఎన్నికల సంఘం పరిథిలో పనిచేస్తున్నామని, ప్రభుత్వ సిఫార్సులను ఆమోదించే అంశంపై ఈసీదే నిర్ణయాధికారమని స్పష్టం చేశారు.

ఇక ఐపిఎస్ అసోసియేయన్ అధికారు సంఘం ఈసీ మెంబరు హోదాలో విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిలాల్ రాణా కూడా.. ఆంధ్రజ్యోతి, ఈనాడు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఐపిఎస్ అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతీయడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. వారిపై ఈసీకి ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదీ ఐపిఎస్ అధికారులపై మీడియాలో వచ్చిన కథనాలకు సంబంధించిన ప్రతిస్పందన.

ఇంతవరకూ బాగానే ఉంది. అయితే.. ఐపిఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున కేవలం ఈసీ సభ్యుడైన కాంతిరాణా టాటా పత్రికా ప్రకటన విడుదల చేయడంపైనే ఐపిఎస్ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆయన గతంలో కూడా సెక్రటరి మీనా అనుమతి లేకుండా ఫర్ సంతకం పెట్టి, విడుదల చేసిన పత్రికా ప్రకటన పై స్వయంగా మీనా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు, అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఆ అనుభవంతో ఇప్పుడు కొంచెం జాగ్రత్తపడి.. ఐపిఎస్ అసోసియేషన్ ఈసీ సభ్యుడి హోదాలో, రాణా పత్రికా ప్రకటన విడుదల చేయడం వివాదంగా మారింది. నిజానికి ఇలాంటి కీలక అంశాలను అసోసియేషన్ సెక్రటరీనే చూడాలని, అధ్యక్ష-కార్యదర్శుల అనుమతి లేకుండా మిగిలిన సభ్యులెవరూ సొంతగా ప్రకటనలివ్వకూడదని, సీనియర్ ఐపిఎస్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఇప్పుడు రాణా కేవలం ఈసీ సభ్యుడి హోదాలో, సెక్రటరీ అనుమతి లేకుండా ఏకపక్షంగా విడుదల చేసిన లేఖతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆ లేఖ ఆయన వ్యక్తిగతంగానే భావించాలని పలువురు ఐపిఎస్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై ఐపిఎస్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

‘అసలు ఈసీ మెంబరుకు ప్రెస్‌రిలీజ్ చేయమని మా సెక్రటరీ ఏమైనా ఆధరైజేషన్ ఇచ్చారా? ప్రెసిడెంట్ ఏమైనా ఆధరైజేషన్ ఇచ్చారా? వాళ్లిద్దరి తర్వాత కార్యవర్గంలో ముఖ్యమైన పదవులు చాలా ఉన్నాయి. వారెవరితో చర్చించకుండా, అసోసియేషన్ అనుమతి లేకుండా ఒక ఎగ్జిక్యూటివ్ సభ్యుడు ఎలా ప్రెస్‌రిలీజ్ చేస్తారు? రేపు మరో సభ్యుడు ఇప్పుడు ప్రెస్ రిలీజ్ చేసిన దానికి విరుద్ధంగా మరో నోట్ విడుదల చేస్తే అప్పుడేం చేస్తారు? అంటే సంఘానికి క్రమశిక్షణ అవసరం లేదా? నిబంధనలు ఉల్లంఘించిన ఈసీ సభ్యుడిపై ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి’’ అని ఒక సీనియర్ ఐపిఎస్ వ్యాఖ్యానించారు.

కాగా అసలు ఏపీ ఐపిఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ పనిచేస్తోందా? అని మరికొందరు అధికారులు ప్రశ్నిస్తున్నారు. పదవీకాలం ముగిసినప్పటికీ కొత్త కార్యవర్గం ఇప్పటికీ ఎన్నుకోని విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

‘2017లోనో, 2018లోనో చివరి సారి మా అసోసియేన్ మీట్ అయినట్లు గుర్తు. ఈ నాలుగైదేళ్లలో మీటింగ్ ఉన్నట్లు నాకైతే ఎలాంటి మెసేజీలే రాలేదు. సాధారణంగా ఇలాంటి లేఖ రాసే ముందు అసోసియేషన్‌లో చర్చించాలి. దానికోసమైనా కనీసం ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేయాలి. అవేమీ జరగలేదు. నా పదవీకాలంలో నాకు తెలిసి, నా అనుభవంలో ఒక సాధారణ ఎగ్జిక్యూటివ్ మెంబర్.. విధాన నిర్ణయాలపై ప్రభావితం చేసే అంశాలను ప్రెస్‌కు ఇవ్వకూడదు. ఒకవేళ అలా ఇస్తే అది ఆ సభ్యుడి వ్యక్తిగత ప్రకటనగానే భావించాలే తప్ప, అసోసియేషన్‌కు ఎంతమాత్రం సంబంధం లేదు. మరి మీరు ఎలా ఇచ్చారన్నది నన్ను కాకుండా ఆ నోట్ ఇచ్చిన సభ్యుడినో, మీ ఆథరైజేషన్‌తోనే సదరు సభ్యుడు లేఖ రాశారా అని సెక్రటరీనో అడిగితే బాగుంటుంది. నన్ను అడిగితే ఎలా? అసలు ఐపిఎస్ అసోసియేషన్ పనిచేస్తోందా? ఇప్పటివరకూ ఎన్నిసార్లు సమావేశం నిర్వహించారు చెప్పమనండి’’ అని ఆ సీనియర్ ఐపిఎస్ అధికారి వ్యాఖ్యానించారు.

కాగా కాంతిరాణాటాటా లేఖపై అప్పటి సెక్రటరీ ద్వారకా తిరుమలరావు గానీ కొత్త సెక్రటరీ అని చెబుతున్న ఆర్కే మీనా గాని స్పందిస్తే తప్ప, అసలు వాస్తవాలేమిటో బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. అయితే ఈ పరిస్థితిలో వారిద్దరూ పెదవి విప్పే ధైర్యం చేస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా ఈసీ సభ్యుడైన కాంతిరాణా టాటా ప్రెస్‌నోట్ విడుదల చేసి ఇన్ని గంటలవుతున్నా… దానిపై పోలీసు శాఖలో ఇంత వివాదం అవుతున్నా.. ఇప్పటివరకూ అటు ఐపిఎస్ అసోసియేషన్ అధ్యక్షుడు ద్వారకాతిరుమలరావు గానీ, ఇటు సెక్రటరీ ఆర్కే మీనాగానీ ఎవరూ స్పందించకపోవడంపై పోలీసు అధికారులలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

దాన్నిబట్టి వారిద్దరి ఆమోదంతోనే ఈసీ సభ్యుడు రాణా లేఖ రాసి ఉండవచ్చన్న అభిప్రాయం కొందరు అధికారులలో వ్యక్తమవుతోంది. ‘నిజంగా రాణా లేఖకు మా ప్రెసిడెంట్, సెక్రటరీగారి పర్మిషన్ ఉండవచ్చు. లేకపోతే ఆయన ప్రెస్‌నోట్ రిలీజ్ చేసి ఇన్ని గంటలైనా వారిద్దరూ ఎందుకు మౌనంగా ఉంటారు? ఒకవేళ వారి ఆధరైజేషన్ లేకపోతే వెంటనే వారు కూడా స్పందించి, ఆ ప్రెస్‌నోట్‌తో అసోసియేషన్‌కు ఎలాంటి సంబంధం లేదని మీకు నోట్ పంపేవారు కదా? అలా జరగలేదంటే కాంతిరాణా టాటాకు వారి అనుమతి ఉందని అర్ధం చేసుకోవాలని’’ ఒక ఎస్పీ వ్యాఖ్యానించారు.

అసలు కొత్త ఐపిఎస్ అసోసియేషన్ ఎప్పుడు ఏర్పడింది? దానికి సెక్రటరీగా మీనాను ఎవరు ఎన్నుకున్నారని పలువురు సీనియర్ ఐపిఎస్‌లు ప్రశ్నిస్తున్నారు. ‘అసోసియేషన్‌కు సహజంగా డీజీపీనే గౌరవాధ్యక్షులుగా ఉంటారు. మాకు తెలిసి గతంలో గౌతం సావంగ్ డీజీపీగా ఉన్నప్పుడు, ద్వారకాతిరుమలరావు సెక్రటరీగా ఉన్నారు. మరి ఇప్పుడు మీనా సెక్ర టరీ అంటున్నారు. ఆయనను ఎవరు ఎన్నుకున్నారు? ఎప్పుడు ఎన్నుకున్నారు? మేమైతే ఆ ఎన్నికల్లో పాల్గొనలేదు. కొత్త కార్యవర్గం ఎన్నికైనట్లు కూడా మాకు తెలియదు. ఆ లెక్కన ఇప్పుడు రాజేంద్రనాధ్‌రెడ్డి గౌరవాధ్యక్షులుగా ఉండాలి. కానీ ఆయన ఇన్చార్జి డీజీపీ. పూర్తిస్థాయి డీజీపీనే గౌరవాధ్యక్షులుగా ఉండాలి. మరి ఆయనే గౌరవాధ్యక్ష హోదాలో రాణా ప్రెస్‌నోట్‌కు అనుమతి ఇచ్చారా తెలియదు. అసలు ఏం జరుగుతోంది? ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నప్పుడే ఈ ఐఏఎస్-ఐపిఎస్ అసోసియేషన్లు బయటకు వస్తాయో అర్ధం కావడం లేదు. కాబట్టి కోడ్ ఉన్నా, ఈసీ చేతిలో అధికారం ఉన్నప్పటికీ వ్యవస్థ ఇంకా ఎవరి చేతుల్లో ఉందో అర్ధమవుతుంది’’ అని ఒక సీనియర్ ఐపిఎస్ అధికారి వ్యాఖ్యానించారు.

ఇదిలాఉండగా.. పురందేశ్వరి రాసిన లేఖపై స్పందించి, నిర్ణయం తీసుకున్న ఈసీ వ్యవహారానికి-మీడియా వార్తలకు ముడిపెడుతున్న వైనంపై విస్మయం వ్యక్తమవుతోంది. దీనిపై ఐపిఎస్ అసోసియేషన్ ఈసీ సభ్యుడు తనంతట తానుగా స్పందించి, ప్రెస్‌నోట్ రిలీజ్ చేయటంపై పోలీసువర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది. గత ఎన్నికల ముందు.. వైసీపీ అధినేత జగన్- ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నాటి డీజీపీ, సీఎస్, ఇంటలిజన్స్ ఏడీజీ, ఇతర ఐపిఎస్ అధికారులపై ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వైసీపీ ఫిర్యాదుకు స్పందించిన ఈసీ వారిని ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించిన వైనాన్ని పలువురు అధికారులు గుర్తు చేస్తున్నారు.

మరి ఆనాడు దీనిపై ఐఏఎస్ ఆఫీసర్స్ గానీ, ఐపిఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ గానీ, లేక ఇప్పటిలా ఐపిఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఈసీ సభ్యుడుగానీ ప్రెస్‌నోట్ ఇచ్చిన దాఖలాలు లేవంటున్నారు. చివరకు సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తే కూడా.. సాటిసభ్యుడికి జరిగిన అన్యాయంపై, అసోసియేషన్ పెదవి విప్పని వైనాన్ని పలువురు ఐపిఎస్ అధికారులు ప్రస్తావిస్తున్నారు.

LEAVE A RESPONSE