Suryaa.co.in

Andhra Pradesh

ప్రజలు గెలవాలి… రాష్ట్రం నిలవాలి

-రాష్ట్రానికి ఏం చేసాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు
-పెన్షన్ కుట్రలు, గులకరాయి డ్రామాలను ప్రజలు ఛీ కొట్టారు
-బీఫాం తీసుకున్న ప్రతి అభ్యర్థీ గెలిచిరావాలి
-ప్రచారానికి 20 రోజులే ఉంది…ఈ సమయం మీకు ఎంతో కీలకం
-రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం…సంకల్పంతో ముందుకెళ్లండి
-3 పార్టీల నేతల మధ్య సమన్వయం ఉండాలి… ఓటు బదిలీ జరగాలి
-ప్రజాగళానికి వస్తున్న స్పందన జగన్ పతనాన్ని చాటిచెప్తోంది
-టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
-ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు బీఫాంలు అందించిన చంద్రబాబు
-అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించిన అధినేత

అమరావతి :- రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడో చెప్పుకోలేకే డ్రామాలకు తెరతీస్తున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు విమర్శించారు. పెన్షన్ల విషయంలో జగన్ చేసిన కుట్రలు, ఆడిన గులకరాయి డ్రామాను ప్రజలు ఛీ కొట్టారన్నారు. ప్రజాగళానికి వస్తున్న స్పందనే జగన్ పతనాన్ని చాటిచెప్తోందన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో పార్లమెంట్, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులకు చంద్రబాబు ఆదివారం బీఫాంలు అందించారు. శ్రీకాకుళం జిల్లా నుండి మొదలు పెట్టి అభ్యర్థులకు బీఫాంలు తన చేతుల మీదుగా అందజేశారు.

అనంతరం అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ…‘‘బీఫాంలు తీసుకున్న ప్రతి అభ్యర్థీ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలి. ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థులు ఎంపిక చేశాం. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలు గెలవాలి..రాష్ట్రం నిలవాలన్నదే మన నినాదం. 3 పార్టీల నేతల మధ్య సమన్వయం ఉండాలి… ఓటు బదిలీ జరగాలి. వైసీపీలో సీటు ఇస్తానన్నా తీసుకోకుండా బయటకు వచ్చారు. వైసీపీ నుండి టీడీపీలోకి మంచి వాళ్లను మాత్రమే తీసుకుని నేను సీట్లు ఇచ్చా.

పార్టీలో కొత్తగా చేరిన వారు పార్టీ లైను ప్రకారం నడుచుకోవాలి. ఎన్నికలకు ఇక 22 రోజుల సమయమే ఉంది…ప్రచారానికి 20 రోజులే ఉంది. ఈ 20 రోజులు మీకు ఎంతో కీలకం. నేను ఇప్పటికే 40కి పైగా ప్రజాగళం సభలు నిర్వహించాను. పలు సభలు పవన్ కళ్యాణ్ తోనూ కలిసి నిర్వహించాను. రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం…ప్రతి ఒక్కరూ సంకల్పంతో ముందుకెళ్లండి. లేనిది ఉన్నట్లు…ఉన్నది లేనట్లు చెప్పడంలో జగన్ నేర్పరి. ప్రతిసారీ సానుభూతితో గెలవాలని చూస్తున్నాడు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు రూ.43 వేల కోట్లు అక్రమంగా సంపాదించారని సీబీఐ నిర్ధారిస్తే…దాన్ని నిరూపించుకోకుండా తనపై అక్రమ కేసులు పెట్టారని ప్రచారం చేసుకున్నాడు.

జగన్ బస్సుయాత్రలో వాళ్లే కరెంట్ తీసేసుకున్నారు…చీకట్లో నేను దాడి చేయించానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఘటన జరిగిన కొద్ది క్షణాలకే ప్లకార్డులు పట్టుకుని వచ్చి ధర్నాలు చేశారు. రాయి విసిరిన వ్యక్తితో బోండా ఉమా ప్రమేయం ఉందని చెప్పించేలా కుట్రలు చేస్తున్నారు. పెన్షన్ల పంపిణీకి నిధుల్లేకుండా చేసి…వాలంటీర్లతో పంపిణీ చేయొద్దనడంతో పెన్షన్లు ఆగిపోయాయని విష ప్రచారం చేశారు.

జగనే అందరినీ అంతం చేయడానికి ప్రయత్నిస్తూ…తనను అంతం చేయడానికి వస్తున్నారని ఎదుటివారిపై బురదజల్లుతున్నారు. అమరావతి, పోలవరం విధ్వంసం చేశాడు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నాడు. కేడర్ తో ప్రతి అభ్యర్థీ అనుసంధానం కావాలి. అన్ని వర్గాల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత…మళ్లీ రాష్ట్రంలో మంచి రోజులు రాబోతున్నాయని ప్రజలకు తెలియజేయండి.’’ అని చంద్రబాబు నాయుడు అన్నారు.

LEAVE A RESPONSE