– డీజీపీ, సీఎస్‌పై చర్యల్లో ఎందుకీ తేడా?
– నాడు వైసీపీ ఫిర్యాదుపై ఒక్కరోజులోనే ఈసీ చర్యలు
– మరుసటిరోజునే ఏడీజీ ఏబీవీ పై వేటు
– మూడు రోజుల్లో సీఎస్ పునేఠా బదిలీ
– ఇప్పుడు ఫిర్యాదు చేసి నెల అవుతున్నా చర్యలకు దిక్కులేదు
– ఇప్పటిదాకా సీఎస్, డీజీపీపై వేటు వేయని పరిస్థితి
– ఇక వారిద్దరిపై వేటు లేనట్లేనా?
– బీజేపీ డబుల్‌గేమ్ ఆడుతోందా?
– టీటీడీ జేఈఓ ధర్మారెడ్డికి వద్దంటున్నా డెప్యుటేషన్ పొడిగింపు
– పురందేశ్వరి లేఖలకూ దిక్కులే ని పరిస్థితి
– సొంత పార్టీ అధ్యక్షురాలికే అవ మానం
– జగన్ చెప్పారని రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇవ్వని వైనం
-బలపడుతున్న బీజేపీ-వైసీపీ బంధం
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీ రాజకీయాలలో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందా? అటు టీడీపీ-ఇటు వైసీపీతో ప్రణయం సాగిస్తోందా? పెళ్లి ఒకరితో, కాపురం మరొకరితో చేస్తోందా? అందుకే కూటమి ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకూ సీఎస్-డీజీపీలను బదిలీ చేయలేదా? ఇక వారిద్దరి బదిలీ అటకెక్కనట్లేనా? గత ఎన్నికల ముందు వైసీపీ ఫిర్యాదు ఇచ్చిన మరుసటిరోజే ఏడీజీ ఏబీ వెంకటేశ్వరరావును ఎలా బదిలీ చేశారు? ఆ తర్వాత మూడురోజుల వ్యవధిలో సీఎస్ పునేఠాపై ఎందుకు వేటు వేశారు? మరి ఇప్పుడు ఫిర్యాదులిచ్చి నెలరోజులవుతున్నా, అదే డీజీపీ-సీఎస్‌పై ఎందుకు బదిలీ చేయటం లేదు? అంటే బీజేపీ-వైసీపీ బంధం బలపడుతోందా? ఇద్దరి జుట్టూ తన చేతిలో ఉంచుకునే మాయోపాయం బీజేపీ అమలుచేస్తుందా?.. ఇప్పుడు మెడపై తల ఉన్న అందరికీ వస్తున్న అనుమానాలివి.
ఎన్డీయే కూటమిలో ప్రధాన భాగస్వామి బీజేపీ, తన అవసరాల కోసం టీడీపీని అందులో చేర్చుకుందా? లేక వైసీపీని గెలిపించేందుకు ఎన్డీయేలోకి టీడీపీ-జనసేనను ఆహ్వానించిందా, అన్న అనుమానాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. కారణం.. సీఎం జగన్‌కు అనుకూలంగా పనిచేస్తున్న సీఎస్ జవహర్‌రెడ్డి-ఇన్చార్జి డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డిని బదిలీ చేయాలని.. కూటమి ఇచ్చిన ఫిర్యాదు బుట్టదాఖలవడం!
నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసి, మరికొద్దిరోజుల్లో పోలింగ్ ఉన్నప్పటికీ వారిపై చర్యలు తీసుకోకపోవడం!! బీజేపీ తీసుకున్న కొన్ని ఎమ్మెల్యే-ఎంపీ స్థానాల్లో బలహీన అభ్యర్ధులకు టికెట్లు ఇవ్వడం కూడా ఇలాంటి అనుమానాలకు ఆస్కారం ఇచ్చింది.
గత ఎన్నికల ముందు బీజేపీతో విబేధించిన టీడీపీ సర్కారుపై.. ఎన్నికల సంఘం, పంచకల్యాణి గుర్రం కంటే వేగంగా చర్యలు తీసుకుంది. నాడు కొందరు ఎస్పీలతోపాటు.. సీఎస్ పునేఠా, ఇంటలిజన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును తొలగించాలని, వారు అక్కడ కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
విచిత్రంగా ఆ మరుసటిరోజునే నిఘా దళపతి ఏబీ వెంకటేశ్వరరావును ఎన్నికల సంఘం తప్పించింది. ఆయనను తప్పించిన మూడురోజుల వ్యవధిలో సీఎస్ పునేఠాను తప్పించి, ఆయన స్థానంలో ఎల్సీ సుబ్రమణ్యం నియామకం చేసింది. అప్పుడు సీఎస్ చాలా కఠినంగా వ్యవహరించింది. కారణం బీజేపై నాడు టీడీపీ యుద్ధం ప్రకటించడమేనన్నది బహిరంగ రహస్యం.
ఇప్పుడు టీడీపీ-జనసేన ఎన్డీయే కూటమిలో చేరాయి. పలువురు ఐఏఎస్-ఐపిఎస్, డీఎస్పీ, సీఐ స్ధాయి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్డీయే కూటమి భాగస్వాములయిన, టీడీపీ-బీజేపీ-జనసేన ఎన్నికల సంఘానికి గత నెల రోజుల నుంచి ఫిర్యాదులిస్తూనే ఉన్నాయి. అయితే అందులో ఏడీజీ పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ పోలీసు కమిషనర్ కాంతి రాణా తాతా, ఐజి రఘరామిరెడ్డి సహా కొందరు ఎస్పీ, జిల్లా కలెక్టర్లను బదిలీ చేసింది.
ఆ తర్వాత విచిత్రంగా బదిలీలు ఆగిపోయాయి. టీటీడీ జేఈఓ ధర్మారెడ్డిని తప్పించాలని స్వయంగా, కూటమిలో పెద్దపార్టీ అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఫిర్యాదుచేశారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి కూడా ఫిర్యాదుచేశారు. సహజంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలే ఫిర్యాదుచేసినందున, ధర్మారెడ్డి డెప్యుటేషన్‌ను నిలిపివేసి, ఆయనను బదిలీ చేస్తారని మెడపై తల ఉన్న ఎవరైనా ఊహిస్తారు. కానీ.. ధర్మారెడ్డితో చాలా అవసరాలున్నందున, ఆయనను అక్కడే కొనసాగించాలంటూ జగన్ రాసిన లేఖను, కేంద్రంలోని బీజేపీ మన్నించింది. ఆ రకంగా సొంత పార్టీ అధ్యక్షురాలినే అవమానించినట్లయింది. ఈ చర్య బీజేపీ-వైసీపీ బంధానికి నిదర్శనంగా నిలిచిపోయిందన్న భావన బలపడేందుకు కారణమయింది.
సీఎస్-డీజీపీ బదిలీపై కూటమి, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఈసీ.. గత ఎన్నికల్లో మాత్రం సీఎస్-ఏడీజీపీని మాత్రం, ఫిర్యాదు చేసిన ఒకటి నుంచి-మూడురోజుల వ్యవధిలో బదిలీ చేయటం, ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు. సాధారణ ప్రజల్లో సైతం చర్చనీయాంశమయింది. నాడు-నేడూ ఫిర్యాదు చేసింది ప్రతిపక్షమే అయినప్పడు చర్యల్లో మాత్రం తేడా ఎందుకు?
అప్పుడు కేంద్రంలో ఉన్నది బీజేపీ నే. ఇప్పుడు అధికారంలో ఉన్నది కూడా బీజేపీనే అయినప్పుడు.. చర్యల్లో ఆలస్యానికి కారణమేమిటి? అంటే టీడీపీ-జనసేనను బీజేపీ నమ్మటం లేదా? రేపు కేంద్రంలో లెక్కలు తేడా వచ్చి, ఎటొచ్చి ఎటుపోయినా వైసీపీ అవసరం ఉంటుందన్న ముందుచూపుతోనే, డీజీపీ-సీఎస్‌ను బదిలీ చేయడం లేదా? అన్న ప్రశ్నలు క్షేత్రస్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.
దీన్నిబట్టి ఏపీలో బీజేపీ తన రాజకీయ అవసరాల కోసం, డబుల్ గేమ్ ఆడుతోందన్న భావన ప్రజల్లో బలపడిపోయింది. తన సీట్లు-ఓట్లు పెంచుకునేందుకే టీడీపీ-జనసేనను పావులుగా వాడుకుందన్న భావన కనిపిస్తోంది. జగన్ ఒత్తిడితో రఘురామకృష్ణంరాజుకు ఎంపీ టికెట్ ఇవ్వని బీజేపీ నాయకత్వం.. ఇప్పుడు అదే జగన్ మొహమాటంతో, డీజీపీ-సీఎస్‌ను మార్చలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సొంత పార్టీ వ్యతిరేకించినా లెక్కచేయకుండా , ధర్మారెడ్డిని టీటీడీ జేఈఓగా ధర్మారెడ్డిని కొనసాగించిందంటే.. బీజేపీ-జగన్ బంధం, ఎంత బలంగా ఉందో అర్ధమవుతోందన్న వ్యాఖ్యలు అన్ని వర్గాల నుంచి వినిపినన్నాయి.
కాగా ప్రస్తుత పరిస్థితిలో ఇక ఇన్చార్జి డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డి-సీఎస్ జవహర్‌రెడ్డిని తప్పించడం కష్టమన్న అభిప్రాయం అధికార వర్గాల్లో స్థిరపడిపోయింది. ‘‘నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. గుర్తులు కూడా కేటాయించారు. జన సేన గుర్తు గ్లాసును ఇండిపెండెంట్లకు కేటాయించవద్దని కోరినా లెక్కచేయలేదు. అంటే దీన్నిబట్టి వైసీపీ విజయం కోసం బీజేపీ ఎంత పరితపిస్తుందో అర్ధమవుతోంది’’ అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇదిలాఉండగా.. విశ్వసనీయ సమాచార ప్రకారం, పెన్షనర్లకు డబ్బులు బ్యాంకులో జమచేయాలని, మిగిలిన వారికి ఇళ్లకు వెళ్లి ఇవ్వాలన్న ఈసీ నిర్ణయం వెనుక కూడా.. కూటమి గొప్పతనం ఏమీ లేదని తెలుస్తోంది. ఒక మాజీ ఐఏఎస్ అధికారి సూచన మేరకే, ఈసీ ఆ నిర్ణయం తీసుక్నుట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎన్డీయేలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న బీజేపీ.. ఎవరిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుందన్న చర్చ, మాత్రం కింది స్థాయిలో జరుగుతోంది.