Suryaa.co.in

Andhra Pradesh

జస్టిస్ ఫర్ ఏబీవీ

-ఒక్క రోజు ముగియకముందే #JusticeforABV ఆన్‌లైన్ ఉద్యమానికి విదేశాల నుంచి 15 వేల మంది స్పందన

డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసిన మొదట్లో కొందరు శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారు, రాజ్యం అనేది అత్యంత బలమైన వ్యవస్థ, ఒక వ్యక్తిగా దానితో పోరాడలేవు, నిజమేదైనా, న్యాయం నీ పక్షానున్నా, లొంగిపోవడం ఉత్తమం అని. ఈ మధ్యన తానా సభలకు వెళ్ళినప్పుడు చాలా మంది ఎన్‌ఆర్‌ఐలు కూడా అదే ప్రశ్న అడిగారు. ఎందుకు ఇంత ఫైట్ చేస్తున్నారు, మీరు కేవలం ఒక ఉద్యోగి మాత్రమే కదా, అంత పోరాటం అవసరమా అని.

దానికి ఏబీవీ ఇచ్చిన సమాధానం ఒకటే – ఒక మనిషిగా, ఒక ఉద్యోగిగా నన్ను నేను 30 సంవత్సరాలుగా మలుచుకున్నాను. నా విలువలను నేను ఎంచుకున్నాను. అలాగే నడుచుకున్నాను. ఇవాళ ఒక ఆర్ధిక ఉగ్రవాది, ఒక రాజకీయ నేరస్తుడు, ఒక హంతకుడు వచ్చి నన్ను….. , నన్ను ఒక అవినీతి పరుడినని, ఒక దేశ ద్రోహి అని ముద్ర వేస్తే, నేను తలొంచుకుని వెళ్ళిపోతే, నేను మనిషినవుతానా, నడుస్తున్న శవాన్నవుతానా? అంత హీనమైన బ్రతుకూ ఒక బ్రతుకేనా?

సస్పెన్షన్ లో ఉన్నా గానీ, ఏబీవీ పోలీసు ఉద్యోగం మానలేదు. వివేకా హత్య కేసు సీబీఐ కి ఇచ్చాక సంవత్సరం దాటినా ఏమీ పురోగతి లేని దశలో, ఏబీవీ , సీబీఐ డైరెక్టరుకి రాసిన ఉత్తరం బాంబులా పేలింది. తన దగ్గరున్న వివరాలు ఇస్తాను, ఎవరినయినా పంపమని రెండు సార్లు చెప్పినా ఎవరూ రాలేదని, హత్య కేసు ఇంతవరకూ పరిష్కరించలేదని ఒక సీనియర్ పోలీసు అధికారి బహిరంగంగా అనేసరికి సీబీఐ పూర్తి ఆత్మరక్షణలో పడింది.

ఫలితంగా ఏబీవీ వాంగ్మూలం తీసుకోవడం, అటునుంచి అటే పులివెందుల వెళ్లిన సీబీఐ టీం రెండు నెలలు ఆపకుండా చేసిన దర్యాప్తు ఫలితమే వివేకా హత్య కేసు బద్దలవడానికి నాంది. ఏబీవీ ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉండగా సేకరించిన ఐపిడిఆర్ (ఇంటర్నెట్ వాడకం రికార్డు) ఆధారంగానే అవినాష్ రెడ్డి ఎవరెవరితో ఎప్పుడెప్పుడు వాట్సాప్ లో మాట్లాడాడో సీబీఐ నిర్ధారించగలిగింది.

ఎల్వీ సుబ్రహ్మణ్యం, నిమ్మగడ్డ రమేష్ కుమార్, పీవీ రమేష్ లతో జగన్ ఆడుకున్న తీరు చూసి ప్రభుత్వ ఉద్యోగులంతా బేజారైన సమయంలో, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, రంగనాయకమ్మ, అయ్యన్న పాత్రుడు ల మీదకు పోలీసులను వేట కుక్కల్లా వదిలిన సమయంలో, శుక్రవారం వచ్చిందంటే బుల్డోజర్లు ఎవరి ఇంటి మీదకు వస్తాయో అని వణికే సమయంలో, అత్యంత శక్తివంతుడైన ఒక ఫ్యాక్షనిస్టు మీద ఏబీవీ తొడ గొట్టిన వైనం నిరాశలో కూరుకుపోయిన లక్షలాది మందిలో ఒక ధైర్యాన్ని, ఒక పోరాట పటిమను నిలబెట్టింది. ఫర్వాలేదు, పోరాడి నిలవొచ్చు అనే ఒక ఆశా కిరణం ఏబీవీ రూపంలో కనిపించింది.

అందుకే ఈ రోజు ఏబీవీ కోసం ఇంత మంది తపిస్తున్నారు. ఒక్క రోజు ముగియకముందే 15,000 మంది ఆన్లైన్లో దేశ విదేశాలనించి #JusticeforABV అంటూ మొదలెట్టిన కాంపెయిన్ కి మద్దతు పలికారు. ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఇంత ప్రజా మద్దతు అసాధారణం.

ఇది ఏబీవీ గొప్ప కాదు. అయన చూపిన తెగువ, ఆ తెగువ వెనుక ఉన్న నిజాయితీ, ధైర్యం ల గొప్ప. ఆ విలువలకి సమాజంలో, ప్రజల్లో ఈ మాత్రం విలువ ఉండటం ఎంతో సంతోషించతగ్గ విషయం. అంతా చెడిపోయారు అనే నిస్పృహ నుంచి ఒక ఊరట. అందుకే ఏబీవీ ఒక ప్రజా డీజీపీ!

LEAVE A RESPONSE