Suryaa.co.in

Andhra Pradesh

రఘురామ “డ్రైనేజ్ మెయింటెనెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఉండి” సేవా ఉద్యమం

-ఊహించిన దాని కంటే ఎక్కువగా ప్రజా స్పందన
-ఒక్క ఉండి నియోజకవర్గ ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలు కూడా స్పందించడం ఆనందంగా ఉంది
-విజయవాడ, రాయలసీమ ప్రాంతాల నుంచి కూడా ముందుకొచ్చిన నా శ్రేయోభిలాషులు
-డ్రైనేజ్ మెయింటెనెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఉండి కి ప్రజల నుంచి అనూహ్యస్పందన
-ఇప్పటికే రెండు చోట్ల గుర్రపు డెక్క, పూడికతీత పనులు ప్రారంభం
-ఎల్లుండి లోగా ఏకకాలంలో 15 గ్రామాలలో పనులను ప్రారంభిస్తాం
-ఈ సీజన్ నాటికి రైతులకు కాలువలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటాం
-ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు

ప్రజల భాగస్వామ్యంతో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న సంకల్పానికి అనూహ్య స్పందన లభిస్తోందని ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. బుధవారం ఉండి నియోజకవర్గ కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… జిల్లా కలెక్టర్, నా ఉమ్మడి ఆలోచనలు, సంకల్పంతో చేపట్టిన డ్రైనేజ్ మెయింటెనెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఉండి అనే కార్యక్రమానికి ఉండి నియోజకవర్గ ప్రజల నుంచి ఊహించిన దానికంటే ఎక్కువగా స్పందన లభించిందన్నారు.

ఇప్పటికే చాలామంది చెక్కులు, నగదు రూపంలో ఈ అకౌంట్లో డబ్బులు జమ చేశారన్నారు. నిన్న అకౌంట్ ప్రారంభించిన కొద్దిసేపటి తర్వాత డబ్బులు జమ చేయాలనుకున్న వారికి అకౌంట్ నాట్ ఇన్ ఆపరేషన్ అని పేర్కొనడం జరిగిందన్నారు. ప్రస్తుతం అకౌంట్ ద్వారా ఎవరైనా తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందజేయవచ్చునని పేర్కొన్నారు. ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం ముందుకు రావాలని నేను కోరిన వెంటనే, ఎంతోమంది నా స్నేహితులు, శ్రేయోభిలాషులు ముందుకు రావడం జరిగిందన్నారు.

అలాగే నియోజకవర్గ ప్రజలే కాకుండా, విజయవాడ ప్రాంతానికి చెందిన వారు కూడా ముందుకొచ్చి తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని పేర్కొన్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అలాగే రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి ” రాజుగారు మీరు చేపట్టిన మంచి పనికి నా వంతుగా 20 వేల రూపాయలు అందజేస్తానని” పేర్కొన్నారని చెప్పారు. అయితే అకౌంట్ ప్రారంభించిన వెంటనే ఆయన నగదు జమ చేయడం వల్ల బౌన్స్ అయిందన్నారు.

అన్ని కార్యక్రమాల అమలు కోసం ప్రభుత్వం పైనే ప్రజలు ఆధార పడడం కరెక్ట్ కాదని, ప్రజల సహకారంతో కొన్ని సమస్యలను పరిష్కరించుకోవచ్చునని ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు తెలిపారు. గత ఐదేళ్లుగా పాలకుల వల్ల ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొనడంతో, రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించడానికి, ప్రతి ఒక్కరూ తమవంతుగా సహాయాన్ని అందజేయాలని కోరారు. ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమానికి స్థానిక ప్రజలే కాకుండా, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల ప్రజల స్పందిస్తారని నేనైతే ఊహించలేదని రఘురామకృష్ణంరాజు వెల్లడించారు.

ప్రస్తుతం ఉండి అభివృద్ధికి రూపొందించిన రూట్ మ్యాప్ కోసం, దాదాపుగా అన్ని కమిట్మెంట్స్ తో కలుపుకొని కోటి రూపాయల వరకు నిధులు జమయ్యాయని ఆయన తెలిపారు. రానున్న 15 రోజుల్లో మేము అనుకున్న విధంగా తప్పకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ సమకూరుతుందని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈరోజు రెండు గ్రామాలలో డ్రైనేజ్ క్లియరెన్స్ పనులను చేపట్టడం జరిగిందన్నారు.

కాలువలలో పేరుకుపోయిన గుర్రపు డెక్క, పూడిక వల్ల వేగంగా ప్రవహిస్తుందనుకున్న నీటి ప్రవాహం మందగిస్తుందని తెలిపారు. ఐదు కిలోమీటర్ల వేగంగా ప్రయాణిస్తుంది అనుకున్న నీటి ప్రవాహం, అర కిలోమీటర్ వేగంగా కూడా పయనించదని రఘురామ కృష్ణంరాజు వివరించారు. ఐదేళ్లుగా కాలువలలో పూడికతీత పనులు చేపట్టకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందన్నారు. ఈరోజు రెండు చోట్ల గుర్రపు డెక్క, పూడికతీత పనులను ప్రారంభించామని, ఎల్లుండి లోగా 15 గ్రామాలలోని కాలువలలో పూడికతీత, గుర్రపు డెక్క తొలగింపు పనుల ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు.

ఎక్కడైతే ప్రధాన సమస్య ఉందో అక్కడే పనులను ప్రారంభించడం జరుగుతుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. 40 నుంచి 45 రోజుల వ్యవధిలో నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలలో కాలువల పూడికతీత, గుర్రపు డెక్క తొలగింపు పనుల ద్వారా ప్రస్తుత వ్యవసాయ సీజన్ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితిని కల్పించడం జరుగుతుందన్నారు. వచ్చే వేసవి నాటికి పూర్తిగా ఈ పనులను కంప్లీట్ చేయగలమన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయతలపెట్టిన కిడ్నీ డయాలసిస్ సెంటర్ కు అవసరమైన యంత్రాలను అందజేయడానికి నా మిత్రులు ఇద్దరూ ముందుకు వచ్చారని తెలిపారు. నేను అందజేస్తానని చెప్పిన డయాలసిస్ యూనిట్ కూడా వారే అందజేస్తామన్నారని వివరించారు. ప్రజల భాగస్వామ్యాన్ని కోరిన వెంటనే సామాజికంగానూ, ఆరోగ్యపరంగానూ అద్భుతమైన స్పందన లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఇరిగేషన్, డ్రైనేజ్ సిస్టం అభివృద్ధితోపాటు స్కూళ్ల అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు.

నాడు నేడు పేరిట కొన్ని పనులు చేసి ఉండవచ్చునని, స్కూల్లో అభివృద్ధి కోసం ఉన్న నిధులను ఒడిసి పట్టుకొని, ప్రజల భాగస్వామ్యంతో మరింతగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం స్థానికులతో పాటు నా స్నేహితులు, శ్రేయోభిలాషులే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన నా అభిమానులు ముందుకొచ్చినందుకు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు రఘురామకృష్ణం రాజు వెల్లడించారు.

ఈ ఊరు మనది, ఈ ప్రాంతం మనది, ఈ రాష్ట్రం కూడా మనదేనని… డబ్బున్న వారు కొంచెం పెద్ద మనసు చేసుకొని సమాజ హితం కోసం ఖర్చు చేయాలని కోరారు. ప్రతి పైసా కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం సక్రమంగా వినియోగించగలిగితే ఎంతోమంది తమ వంతు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వస్తారన్నారు. ఒక మంచి పని చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన అకౌంట్ నెంబర్ మీడియా ప్రతినిధుల ముందు ప్రదర్శించారు.

LEAVE A RESPONSE