Suryaa.co.in

Features

డ్యామ్ ల నిర్వహణ లోపాలు.. రైతుల పాలిట శాపాలు

(వి. ఎల్. ప్రసాద్)

టి. ఎం.సి అంటే ( Thousand million Cubic feet ) 1 బిలియన్ లేదా శత కోటి ఘటపు అడుగులు . దీన్ని ఎలా చూస్తారు అంటే వంద కోట్ల అడుగుల పొడవు , వెడల్పు , ఎత్తు పరిమాణంలో పట్టే నీటిని 1 టి.ఎం.సి అంటారు. 283.168 మిలియన్ లీటర్ల నీరు పడుతుంది. అంటే 2831 కోట్ల లీటర్ల నీరు పడుతుందని అర్థం.

క్యూసెక్ ( Cubic feet per Second ) అంటే ఒక సెకనులో క్యూబిక్ ఫీట్ పరిమాణం కలిగిన నీరు విడుదల అని అర్థం. 1 ఘనపు అడుగు అంటే 28.317 లీటర్ల నీరు. ( ఒక ఘనపు అడుగు అంటే ఒక అడుగు పొడవు , వెడల్పు , ఎత్తు లో పట్టేంత నీరు ) . 1 ఘనపు మీటరు పరిమాణంలో 1000 లీటర్ల నీరు పడుతుంది. ప్రవాహ వేగాన్ని క్యూసెక్కుల్లో లెక్కిస్తారు. ఇన్ ఫ్లో అంటే జలాశయం లోకి చేరే నీరని , అవుట్ ఫ్లో అంటే బైటకు విడుదలయ్యే నీరని నీటి పరిమాణాన్ని లెక్కిస్తారు. అదే ఒక 1 టి.ఎం.సి నీరు విడుదల అంటే 11 వేల క్యూసెక్కుల నీరు 24 గం.ల పాటు ప్రవహిస్తే దాన్ని 1 టి.ఎం.సి నీరు వెళ్లింది అంటారు.

ఒక టి.ఎం.సి 10 వేల ఎకరాల సాగుభూమికి సరిపోతుందనేది ఒక లెక్కగా ఉంది. అంటే ఇప్పుడు కర్ణాటక లోని హోస్పేట లోని రాతి నిర్మాణమైన తుంగభద్ర జలాశయం లోని 33 గేట్లలో 19 వ గేటు కొట్టుకుపోయిన కారణంగా వృధాగా సముద్రం పాలయ్యే నీరు 60 టి.ఎం.సి లుగా లెక్కించారు.105 టి.ఎం.సి నిల్వ ఉన్న తుంగభద్రలో 60 టి.ఎం.సి లు కిందకు వదిలేసి మరమత్తులు చేస్తామని కర్ణాటక ప్రభుత్వం చెబుతూ , యుద్ధ ప్రాతిపదికిన కొత్త గేటు పనులు కూడా మొదలు పెట్టింది. పూర్తి రాతి కట్టడం అవ్వడం వల్ల అప్పట్లో స్టాప్ లాగ్ అమరిక ఏర్పరచ లేదు.

ఇప్పుడు ఊడిన గేటు స్థానంలో తాత్కాలికంగా స్టాప్ లాగ్ గేటు అమర్చి వృధాను అరికట్టాలని దేశంలో 550 ఆనకట్టలకు గేట్లను బిగింపును పరిశీలించిన ప్రముఖ ఆనకట్టల గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు గారి సహకారంతో విశ్వ ప్రయత్నం చేసి స్టాప్ లాగ్ గేటును బిగించారు. 30 టి.ఎం.సి ని ఆదా చేయగాలిగారు. పూర్తి నిల్వతో తొణికిస లాడుతున్న స్థితిలో ఉన్నందువల్ల నీటి వత్తిడి గేటుమీద పడి చెయిన్ లింక్ ఊడిందని కన్నయ్య నాయుడు తేల్చారు. రెండు సం.ల క్రితమే ప్రమాదం జరిగే అవకాశం ఉందని కూడా ఆయన హెచ్చరించారట. కృష్ణా వివాదాల ట్రైబ్యునల్ 230 టి.ఎం.సి వాడకం జరుగుతుందని లెక్కించి 151 టి.ఎం.సి వాడకం కర్నాటకకు , 79 టి.ఎం.సి ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపులు చేసింది. ఎ.పి వాడకం రాయలసీమలో జరుగుతుంది. 70 సం.ల ఈ ప్రాజెక్టుకు మొదటగా ఈ ఉపద్రవం వచ్చింది. ఒక ఎకరాకు ప్రభుత్వానికి ప్రత్యక్ష , పరోక్ష పన్నుల ద్వారా 15 వేలకు పైగా ఆదాయం లభిస్తుంది. రైతుకు ఖర్చులు పోను 30 వేలకు పైగా ఆదాయం వస్తుంది.

కేవలం నిర్వహణ లోపం వల్ల వేల కోట్ల నష్టం వాటిల్లింది. అదే ఎ.పి లో గత వై.సి.పి ప్రభుత్వం ఊడిన గేట్లను మరమ్మత్తులు చేయకుండా అలాగే వదిలేసింది. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే మౌనంగా ఉండిపోయింది. నాసిరకం నిర్మాణాల వల్ల ఏటేటా గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు ఒక్కొక్కటిగా కొట్టుకు పోతున్నాయి. గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మాణంకు 2004 ఎన్నికల ముందు చంద్రబాబు శంఖుస్థాపన చేయగా , తరువాత అధికారంలోకి వచ్చిన వై.ఎస్.ఆర్ జలయజ్ఞంలో భాగంగా నిర్మించి 2008 లో పూర్తి చేసిన ప్రోజెక్ట్ ఇది.

వై.సి.పి పాలనలో 2022 ఆగస్ట్ లో ఒకటి , 2023 డిసెంబర్ లో మరొక గేటు కొట్టుకు పోయాయి. దానితో తక్కువ పరిమాణంలో నీటిని నింపుతున్నారు. దీని వల్ల రైతులు , ప్రభుత్వం ఎంతో నష్టపోవల్సి వస్తోంది. మిగిలిన అన్ని గేట్ల పరిస్థితి కూడా అస్తవ్యస్తంగా ఉందని ఏది ఎప్పుడు వూడిపోతుందో తెలియకుండా ఉందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ఇక పులిచింతల బాలెన్సింగ్ రిజర్వాయర్ పరిస్థితి మరో రకంగా ఉంది. వై.ఎస్.ఆర్ కాలంలోనే పులిచింతలకు ద్రోహం చేయబడింది. ప్రాజెక్టు నిర్మాణ పరిధిని 24 గేట్లకు కుదించడంతో రిజర్వాయర్ గేట్లమీద ఒత్తిడి పెరుగుతోంది.

మూడు సం.ల క్రితం 16 వ గేటు కొట్టుకుపోవడంతో వై.సి.పి ప్రభుత్వం మరమ్మత్తులు చేయకుండా వదిలేసింది. 2023 సం.రం వేసవిలో పనులు చేపట్టి గేటు బిగింపు పనులను ఆగస్టులో పూర్తిచేశారు. ఇక అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగిపోయి వరద నీరు గ్రామాలను ముంచెత్తింది. ప్రాజెక్టులోని ఐదు గేట్లలో ఒకటి బిగుసుకు పోయింది. మరమ్మత్తులు లేక , కనీసం గ్రీజు పెట్టడం కూడా వదిలేసారు. ప్రొజెక్ట్ డిజైన్ లోపం ఉందని , ఎక్కువ గేట్లు నిర్మించవలసి ఉండగా ఐదు గేట్లు మాత్రమే నిర్మించారని, ఆ లోపాన్ని గుర్తించిన ఇంజనీర్లు ప్రభుత్వ దృష్టికి తెచ్చినా , సవరించే ఆలోచన చేయక పోవడం , అదే చివరకు ప్రాణం మీదకు తెచ్చింది.

ఒక్క పెట్టున ఊహించని విధంగా వరద మీద పడడంతో ఎంత వరద వస్తుందో ఊహించి , అప్పటికే నిల్వ ఉన్న నీటిని కిందికి సకాలంలో వదలక పోవడం వల్లనూ , ఒక గేటు బిగుసుకు పోవడంతో ఒక్కసారిగా నిల్వ సామర్థ్యం కన్నా ఎక్కువుగా వరద నీరు వచ్చి చేరడంతో డ్యాం కట్టలు తెగి ఊళ్లను ముంచెత్తి , పలువురి మరణాలకు కారణమే కాకుండా వేల కోట్ల నష్టం వచ్చింది. ఎంతో ఉన్నత సాంకేతికత అందుబాటు లోకి వచ్చిన నేటి కాలంలో గేట్లు కొట్టుకు పోవడం అనేది మానవ తప్పిదంగా భావించాలి. జనవరి , ఫిబ్రవరి నెలల్లో గేట్లను పరిశీలించి, ఏమైనా మరమ్మత్తులు వుంటే వేసవి కాలంలో పూర్తి చేసి వర్షా కాలం నాటికి సిద్ధం చెయ్యాలి. ఇది ప్రతి సం.రం ఖచ్చితంగా అమలు చేయవలసిన విధి విధానం. దశాబ్దాలుగా నిర్మాణం జరిగి నేటికీ ఠీవిగా నిలబడిన శ్రీశైలం , సాగర్, ప్రకాశం బారేజి గేట్లు నేటికీ పటిష్టంగా ఉన్నా 10,15 సం.ల క్రితం పూర్తయిన ప్రోజెక్టులు దెబ్బతినడం మానవ తప్పిదం కాక మరేమనాలి ?

శ్రీశైలం డ్యామ్ ముందు పెద్ద గొయ్యి ఏర్పడిందని , అది పూడ్చకపోతే ప్రధాన డ్యామ్ కు ప్రమాదం అని ఇంజనీర్లు హెచ్చరిస్తున్నా గత వై.సి.పి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవరించింది. నీటి నిల్వలు తగ్గిపోతున్న నేటి కాలంలో ప్రతి చుక్కను ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఉంది. మారుతున్న ప్రజల జీవన శైలి , పట్టణీకరణ , నగరీకరణ , పారిశ్రామికీకరణ వల్ల నీటి వినియోగం పెరిగింది. రాబోయే కాలంలో నీటి గురించి యుద్ధాలు జరిగే పరిస్థితి రాబోతోంది. రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.

ఇలాంటి స్థితిలో డ్యామ్ ల నిర్వహణ చాలా పకడ్బందీగా నిర్వహించాలి. నీటిని సముద్రం పాలు చేయకుండా నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఆనకట్టకు కాలపరిమితి 100 సం.లు అయితే , గేట్లకు 45 సం.లుగా ఉంది. కాలపరిమితి మించి గేట్లు పనిచేస్తున్నాయి. మొత్తం గేట్లను మార్చవలసిన సమయం ఆసన్నమైనదని కన్నయ్య నాయుడు గారు తెలియ జేస్తున్నారు. అలాగే శ్రీశైలం , నాగార్జున సాగర్ గేట్లను మొత్తం మార్చాలని ఆయన సూచిస్తున్నారు. అనుభవం , నిబద్ధత ఉన్న సంస్థలకు మాత్రమే గేట్ల నిర్మాణం అప్పగించాలని ఆయన చెబుతున్నారు. మనిషికి ప్రాణవాయువు తర్వాత నీరే ప్రధానం. ఊపిరి లేకపోతే రెండు నిముషాల్లో మరణిస్తే నీరు లేకపోతే రెండో పూటకు హరీ అనవలసిందే. అలాగే పంటలకు , వృక్షాలకు , పరిశ్రమలకు , సమస్త జీవరాశులకు నీరే ప్రధానం. పైసా ఖర్చు లేకుండా ప్రకృతి ఉచితంగా అందించే గాలి , నీటిని సరిగా వినియోగించుకో లేకపోవడం మానవ తప్పిదమే అవుతుంది. గాలి సర్వాంతర్యామి కనుక దానికోసం పెద్దగా శ్రమించకుండా కథ నడుస్తోంది.

నీరు అలాంటిది కాదు. ఎగువ నుండి దిగువకు ప్రవహించి , చివరకు సముద్రం లో కలిసే ప్రవాహమది. దానికి అడ్డుకట్టవేసి అవసరాలకు వినియోగించు కుంటున్నాం. అలాంటి నీటిని సముద్ర పాలు కాకుండా , నిర్మించిన ఆనకట్టలను ఎంతలా కాపాడుకోవాలి ? ఒక్కోసారి సాగుకు సరిపడా లేకపోయినా తాగు నీటికి సరిపడా నిల్వ ఉంచుకో గలగాలి. అందుకు డ్యామ్ లను సంరక్షించుకోవాలి. సకాలంలో మరమ్మత్తులు చేసుకో గలగాలి. ఒక్కోసారి వర్షాపాతం సరిగ్గా లేక కరువు వచ్చి పంటలు పండించలేక పోతుంటే , అధిక వర్షాలతో డ్యామ్ లు నిండి తొణికిస లాడుతున్న దశలో నీటిని నిల్వ చేసుకోలేక సముద్రపాలు చేయడం ప్రభుత్వాల , నిర్వహణ అధికారుల తప్పిదమే అవుతుంది.

రాష్ట్ర వివాదాల పరిష్కారం కోసం కేంద్రం రకరకాల బోర్డులను ఏర్పరచి వందల కోట్లు వాటి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వాల చేత ఖర్చు చేయిస్తుంటే , డ్యామ్ ల నిర్వహణను ప్రభుత్వాలు గాలికి వదిలేస్తున్నాయి. ఏటేటా కోట్లలో పెరుగుతున్న జనాభాకు, పరిశ్రమలకు , ఇతర జీవ రాశులకు సరిపడా నీటిని నిల్వ చేసుకుంటేనే మానవ జాతి మనుగడలో ఉంటుంది. డ్యాముల్లో నీటివల్ల పరిసరాల్లో భూగర్భ జలాల పరిమాణం పెరుగుతుంది. వేల టి.ఎం.సి ల నీరు వృధాగా సముద్రం పాలవుతుంటే , ప్రభుత్వాలు మీన మేషాలు లెక్కిస్తున్నాయి. నదుల అనుసంధానం వల్ల ప్రతి ఎకరాకు నీటి లభ్యత లభించడమే కాక , భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. సరిహద్దుల్లో సైనికుల రక్షణ వల్ల మనం హాయిగా ఎలా నిద్ర పోతున్నామో , జలాశయాల భద్రతను చూసే అధికారుల వల్ల ఆ ప్రాంత ప్రజలు అంతే సుఖంగా నిద్రిస్తున్నారు. నాసి రకం నిర్మాణాలు జరిగినా , భద్రతా ప్రమాణాలను సరిగ్గా నిర్వహించక పోయినా ప్రజల ప్రాణాలు అనంత వాయువుల్లో కలసిపోతాయి.

LEAVE A RESPONSE