– వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి: అబద్ధాలు జన్మ నక్షత్రంగా తప్పుడు ప్రచారాలే లక్ష్యంగా జగన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. విశాఖ అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు అన్ని విధాలా అండగా నిలబడితే నిస్సిగ్గుగా జగన్‌రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారు. బాధితులకు అందుతున్న పరిహారంపై కూడా దిగజారి రాజకీయాలు చేస్తున్న జగన్‌రెడ్డిని ప్రజలు క్షమించరు.
ప్రమాదంలో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ పరిహారం అందించి అన్నివిధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే ధర్నా చేస్తానని జగన్‌రెడ్డి ప్రకటించడం దేనికి సంకేతం? నష్టపోయిన ప్రజలకు లబ్ధి చేకూర్చడం మీకు ఇష్టం లేదా? జగన్ అబద్ధాలకు అంతే లేకుండా పోతోంది. సంఘటన జరిగిన నిమిషాల వ్యవధిలోనే ప్రభుత్వ యంత్రాంగం, అంబులెన్స్‌లు వచ్చి వైద్యం అందిస్తే ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదని జగన్ ఏ విధంగా మాట్లాడతారు. మీ అబద్ధాలు నమ్మమని ముఖం మీద కొట్టి 11 సీట్లకు పరిమితం చేసినా జగన్ వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదు. ప్రజల్లో అపోహలు సృష్టించి రాజకీయ ప్రయోజనాల కోసం జగన్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారు.
విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగినప్పుడు బాధితులందరికీ పరిహారం ఇచ్చి వైసీపీ ప్రభుత్వం ఆదుకుందని జగన్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాద సమయంలో జగన్ ప్రకటించిన పరిహారం పూర్తి స్థాయిలో అందలేదు. దుర్ఘటన జరిగిన తరువాత 15 రోజుల వ్యవధిలో చనిపోయిన ముగ్గురికి రూ.1 లక్షతో పరిహారం సరిపెట్టిన విషయం వాస్తవం కాదా? ప్రమాదంలో నష్టపోయిన వారిని ఆదుకోవాలని నిరసన తెలియజేసిన 30 మందిపై గోపాలపట్నం స్టేషన్‌లో కేసు పెట్టింది జగన్‌రెడ్డి కాదా? వైసీపీ హయాంలో పరిహారాల కోసం రోడ్డెక్కని బాధితులెవరైనా ఉన్నారా? ద్విచక్ర వాహనాలపై రోగులను ఆసుపత్రులకు తీసుకెళ్లిన సంఘటనలు వైసీపీ హయాంలో కోకొల్లలు చోటు చేసుకున్నాయని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.