• మాజీ సీఎం జగన్, మాజీ మంత్రులు ఆర్కే రోజా, తానేటి వనిత, మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిలపై టీడీపీ గ్రీవెన్స్ కు బాధితుడు ఫిర్యాదు
• తాను ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తీసుకు వచ్చారని ఆవేదన
• జీవో లేకుండానే… టూరిస్ట్ పోలీస్ అవుట్ పోస్టులు పెట్టించి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని షణ్ముఖ పవన్ గగ్గోలు
• వైసీపీ నేతల భూ కబ్జాలపై పోటెత్తిన అర్జీదారులు
• వినతులు స్వీకరించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, నేతలు బొల్లినేని రామారావు, నరసింహ ప్రసాద్
జగన్ రెడ్డి భారీ మోసాలు తవ్విన కొద్దీ బయటపడుతున్నాయి. తాజా మరొకటి బయటకు వచ్చింది. వైసీపీ నేతల మోసానికి ఆత్మహత్య చేసుకోబోయి న్యాయం కోసం తిరుగుతున్న విశాఖ వాసి ప్రిజమ్స్ సిరియస్ అడ్వటేజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన షణ్ముఖ పవన్.. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) గ్రీవెన్స్ కు ఫిర్యాదు చేశారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో గురువారం గ్రీవెన్స్ జరిగింది.
నేతలు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, బొల్లినేని రామారావు, నరసింహ ప్రసాద్ లకు పవన్ ఫిర్యాదు చేస్తూ.. నాడు పోలీసుల ఒత్తిడితో ఎలాంటి ఒప్పందం లేకుండానే తాను టూరిజం పోలీస్ సెక్యూరిటీ పోస్టులను ఏర్పాటు చేశానని.. దానికి దాదాపు రాష్ట్రంలో అన్నిచోట్లకు తీసుకున్న మెటిరియల్ తో కలిపి కోటి 80 లక్షల వరకు ఖర్చు అయ్యిందని.. వాటిని 2023 ఫిబ్రవరి 14న ఆన్ లైన్లో బటన్ నొక్కి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి జగన్, అప్పటి హోంమంత్రి తానేటి వనిత, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిలు ప్రారంభించారని తెలిపారు.
ఈ పోస్టుల నిర్వహణకు రూ. 200 కోట్లు రిలీజ్ చేశారని.. ఆ డబ్బులు ఎవరు తిన్నారో ఏమో తెలియదని.. తాను ఏర్పాటు చేసిన పోస్టులకు మాత్రం డబ్బులు ఇవ్వలేదని… డబ్బుల కోసం వెళ్లి అడగ్గా అసలు ఆ పోలీసు సెక్యూరిటీ పోస్టుల ఏర్పాటుకు వైసీపీ ప్రభుత్వం ఎటువంటి జీవో విడుదల చేయలేదని తేలిందని.. అవుట్ పోస్ట్ ల వద్ద డిజిటల్ బోర్టులు ఏర్పాటు చేసుకుని ప్రకటనలపై వచ్చే ఆదాయం తీసుకోవాలని చెప్పి దాన్ని అడ్డుకున్నారని తాను పూర్తిగా మోసపోయానని.. తనకు న్యాయం చేయాలని షణ్ముఖ పవన్ నేతల ముందు కన్నీటి పర్యంతం అయ్యారు. అతని నుండి అర్జీని స్వీకరించిన నేతలు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
మరికొన్ని…
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ బాడీగార్డుగా పనిచేస్తున్న నేలపూడి సురేష్ తన పొలాన్ని లాక్కున్నారని ఏలూరు జిల్లా కలిదిండి మండలం సంతోషపురం పంచాయతీ నరసింహపురం గ్రామానికి చెందిన అంకాలభోగేశ్వరరావు గ్రీవెన్స్ లో నేతలకు ఫిర్యాదు చేశారు. 2022 లో సురేష్ తాను జగన్ సెక్యూరిటీనని చెప్పి తనపై దౌర్జన్యం చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తానని బెదిరించి ఖాళీ స్టాంప్ కాగితాలపై సంతకాలు చేయించువెళ్ళారని వాపోయాడు. దయ చేసి తమ భూమి తమకు ఇప్పించాలని వేడుకున్నారు.
అన్నమయ్య జిల్లా పీటీఎం మండలం మజరా బొంతలవారిపల్లికి చెందిన బొంత నరసింహారెడ్డి విజ్ఞప్తి చేస్తూ.. రీ సర్వే పేరుతో తమ పేర్లమీద ఉన్న భూములను మండల తహశీల్దార్ అక్రమంగా మరొకరి పేరుమీదకు మార్చారని దీనిపై స్పందనలో కూడా అర్జీలు ఇచ్చామని భూ యజమానుల పేర్లు తొలగించి అక్రమంగా మరొకరి పేర్లపైకి భూములు మారుస్తున్న తహశీల్దార్ ను ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగించి తమ భూమి తమకు ఇప్పించాలని ఆయన గ్రీవెన్స్ లో నేతల ముందు వేడుకున్నారు.
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్తవాడ పంచాయతీ వడ్డిపాళెం గ్రామానికి చెందిన విరిగినేని మహేశ్వరరావు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేస్తూ.. తమ గ్రామంలో వైసీపీ నాయకుడు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి జామాయిల్ సాగుచేస్తున్నారుని.. అతడు వెంగమాంబ దేవస్థానం ట్రస్టీగా ఉండి చేసిన అవినీతి వలన తొలగింపునకు గురయ్యారని… అతని చెర నుండి ప్రభుత్వ భూమిని విడిపించాలని మహేశ్వరరావుతోపాటు ఆ ఊరి గ్రామస్తులు పలువురు నేతలను కోరారు.
నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్ కు చెందిన ఇరగల శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేస్తూ.. అప్పులు తెచ్చి ఇచ్చిన సరుకులకు సంబంధించి తమకు రావాల్సిన డబ్బులను అడుగుతుంటే సజ్జల రామకృష్ణారెడ్డి తన ఫ్రెండ్, బంధువు అని చెబుతూ తమపై అక్రమ కేసులు పెట్టించి తమను చంపాలని కొల్లు నరసింహారెడ్డి చూస్తున్నారుని తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని శ్రీనివాసరెడ్డి నేతల ముందు వాపోయాడు.
శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం టి.సదుగాం గ్రామానికి చెందిన చలపతి.. నేతలను వేడుకుంటూ.. తన భూమి 2.14 సెంట్లను గ్రామానికి చెందిన గౌడ చెరువు రమణారెడ్డి ఆక్రమించారుని.. తన కుటుంబానికి ఆ భూమే ఆధారమని.. తమ భూమి కబ్జా నుండి విడిపించి న్యాయం చేయాలని వేడుకున్నాడు.
పల్నాడు జిల్లా మాచర్ల మండలం రాయవరం గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ల ఆంజనేయులు విజ్ఞప్తి చేస్తూ.. సర్వే నెంబర్. 6.43 లో ఉన్న 7ఎకరాల49 సెంట్ల దేవాదాయశాఖ భూమిని తనకు లీజుకు ఇవ్వాలని 2019 లో అర్జీ పెట్టుకోని.. మాచర్ల ఈఓ కృష్ణమూర్తికి రూ.40,000 చెల్లించాక.. అనంతరం వైసీపీ అధికారంలోకి రావడంతో ఆపార్టీకి చెందిన వైసీపీ నేత తురక కిషోర్ టీడీపీ వాళ్లకు ఎటువంటి పొలం ఇచ్చేది లేదని బెదిరించి బూతులు తిట్టారని.. ఈవిషయాన్ని పలుమార్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోలేదని.. తనకు తిరిగి ఆ పొలం లిజుకు ఇప్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు.
• అన్నమయ్య జిల్లా పీటీఎం మండలం శోత్రియం జగడంవారిపల్లి గ్రామంలో తమకు చెందిన భూమిని తహశీల్దార్, మండల సర్వేయర్ మరొకరి పేరుపైకి మార్చారని బొంతలవారిపల్లికి చెందిన గూడె పాపిరెడ్డి గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.
పెద్ద తిప్ప సముద్ర మండలానికి చెందిన గుడె శివరామరెడ్డి, గుడె మంజునాథ్ రెడ్డిలు గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేస్తూ.. రాజకీయ నాయకుల ప్రోద్భలంతో లంచం తీసుకొని డిప్యూటీ తహశీల్దార్, మండల సర్వేయర్, ఇన్ఛార్జ్ తహశీల్దార్లు అక్రమార్కులతో కుమ్మక్కై తమ భూమిని కొట్టేశారని… ఈ విషయంపై రికార్డులను పరిశీలించి కబ్జాదారులకు సహకరించిన అధికారులను శిక్షించి తమకు న్యాయం చేయాలని వారు గ్రీవెన్స్ లో వేడుకున్నారు.
అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం లేవాకువారు పల్లెలో ఉన్న తమ పొలంలో వైసీపీ నేతలు మట్టిని తవ్వేశారని.. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని తమకు న్యాయం చేయాలని నాగినేని వెంకటసుబ్బయ్య నాయుడు గ్రీవెన్స్ లో వేడుకున్నారు.
నెల్లూరు జిల్లా కొండాపురం మండలం మర్రికుంట గ్రామానికిచెందిన మాల్యాద్రి అర్జిని ఇస్తూ.. నెల్లూరు శివారు ఏఎస్ పేట మండలం శిరమన గ్రామంలో 2 ఎకరాల 37 సెంట్లు దాడి శెట్టి వెంకటేశ్వర్లు తాను కలిసి కొని జాయింట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని. కాగా ప్రస్తుతం తన భాగాన్ని కూడా దాడిశెట్టి వెంకటేశ్వర్లు తన కొడుకుల పేర్లపై ఆన్ లైన్ లో ఎక్కించాడని తనకు న్యాయం చేయాలని మాల్యాద్రి గ్రీవెన్స్ లో వేడుకున్నారు.
పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం కనుమల చెరువు గ్రామానికి చెందిన కేతావతు కుమారి బాయి విన్నవించుకొంటూ.. ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ఇంటర్యూలో తన విద్యార్హత కుల రిజర్వేషన్ ప్రాతిపదికన తనకు అంగన్ వాడీ టీచర్ పోస్ట్ ఇచ్చారని. విధులు నిర్వహించేందుకు అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళగా వైసీపీ పార్టీకి చెందిన నాయకుడు తమ్మినేని ఆదిరెడ్డి తనను జుట్టుపట్టుకుని కొట్టి అంగన్ వాడీ కార్యాలయం 20 రోజులు మూయించి తన భార్యకు అంగన్ వాడీ పోస్ట్ ను వచ్చేలా చేశాడని.. అతనిపై చర్యలు తీసుకోని అంగన్ వాడీ పోస్ట్ ను ఇప్పించాలని కుమారి బాయి గ్రీవెన్స్ లో వేడుకొంది.
ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్న వ్యక్తి ప్రభుత్వ భూములను అక్రమంగా తన భార్య పేరుమీద ఎక్కించుకోవడమే కాకుండా తాను సాగుచేసుకుంటున్న భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని.. అంతేకాకుండా చంపుతానని బెదిరిస్తున్నారని.. వెలగచెర్ల గ్రామానికి చెందిన అనుగోలు దామోదర్ పై చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలానికి చెందిన కొప్పుల వెంకటరమణ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.
దళితుల అభివృద్ధికి 1987 లో ప్రభుత్వం ఇచ్చిన భూములు నేటికి తమ పేర్లపై ఆలన్ లైన్ కాలేదని దాంతో ప్రభుత్వం నుండి వచ్చే ఫలాలు అందడంలేదని.. కావున పట్టాదారుల భూముల వివరాలు ఆన్ లైన్ లో ఎక్కించి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు మంజూరు చేయాలని రాజంపేట మండలం ఆకేపాడు గ్రామానికి చెందిన పలువురు విజ్ఞప్తి చేశారు.
గత ప్రభుత్వంలో తమకు అన్యాయంగా పింఛన్ లు తొలగించారంటూ నేడు లబ్ధిదారులు గ్రీవెన్స్ కు పోటెత్తారు. వారిలో వృద్ధులు, వికాలాంగులు అధికంగా ఉన్నారు. తమకు పింఛన్ లు ఇచ్చి ఆదుకోవాలని వేడుకొన్నారు.