Suryaa.co.in

Telangana

రాహుల్… చరిత్ర తెలుసుకో!

– దేశమంతా పాదయాత్ర చేసినా ఏమీ నేర్చుకోలేదని అర్థమైంది
– డోగ్రాల ఆత్మగౌరవమైన రాజా హరిసింగ్‌ను అవమానిస్తారా?
– మండిపడ్డ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
– జమ్మూకశ్మీర్ అభివృద్ధిపై రాజా హరిసింగ్ విగ్రహం వద్ద రాహుల్ గాంధీ బహిరంగ చర్చకు రావాలని బీజేపీ సవాల్
– జమ్మూ కాశ్మీర్ లో డోగ్రా స్వాభిమాన్ సంఘటన్ పార్టీ బీజేపీలో విలీనం సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

జమ్మూకశ్మీర్: ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉంటున్నాయి. మహారాజా హరిసింగ్ విషయంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. రాహుల్ గాంధీ దేశ చరిత్రను తెలుసుకోవాలి.

గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు ఓడించినా మీలో మార్పురాలేదు. దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసినా, దేశ చరిత్రమీద, వాస్తవ పరిస్థితులమీద మీకు కనీస అవగాహన కూడా రాలేదని అర్థమవుతోంది. భవిష్యత్తులోనూ మీరు దేశ పరిస్థితులను అర్థం చేసుకుంటారని నేను అనుకోవడం లేదు.

జమ్మూ కాశ్మీర్ ప్రజల మనసు గెలిచి మహరాజా హరి సింగ్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అలాంటి వ్యక్తి విషయంలో మీరు మాట్లాడిన మాటలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. మహారాజా హరి సింగ్ పారిపోయాడని, మేం పంపించేశామని వారిని అవమానించే రీతిలో మాట్లాడటం హాస్యాస్పదం.

జమ్మూ కాశ్మీర్ లో దాదాపుగా ప్రతి ఇంట్లో మహారాజా హరిసింగ్ ఫోటో ఉంటుంది. జమ్మూ ప్రజలు వారిని అంతలా ప్రేమిస్తారు, గౌరవిస్తారు. అలాంటి మహనీయుడిని అవమానించడమంటే, యావత్ డోగ్రా సమాజాన్ని జమ్మూకాశ్మీర్ ప్రజలను అవమానించడమే.

లెఫ్టినెంట్ గవర్నర్ గురించి కూడా చాలా చులకనగా మాట్లాడారు. బయటి నుంచి వచ్చిన వ్యక్తికి ఇక్కడ పెత్తనమేంటని అన్నారు. మీకు చరిత్ర తెలియదని అన్నది ఇందుకే. జమ్మూకశ్మీర్లో 1965లో గవర్నర్ వ్యవస్థ ప్రారంభమైన తర్వాత, కరణ్ సింగ్ ను మినహాయిస్తే మిగిలిన వారందరూ వేరేప్రాంతాలనుంచి వచ్చిన వారే. దేశవ్యాప్తంగా కూడా ఇలాగే స్థానికేతరులే గవర్నర్లుగా ఉన్నారు. ఉంటారు కూడా.

గవర్నర్ వ్యవస్థను, లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవస్థను మోదీ , బీజేపీయో తీసుకురాలేదు. దేశవ్యాప్తంగా గవర్నర్ వ్యవస్థ ఇలాగే కొనసాగుతోంది. రాహుల్ గాంధీకి నా సూచన ఒకటే. దేశ చరిత్ర రాజకీయ పరిజ్ఞానం పెంచుకున్న తర్వాతే, బహిరంగ వేదికలమీద మాట్లాడటం నేర్చుకోవాలి. పార్లమెంట్లో వివిధ చట్టాలపై చర్చ సందర్భంగా దేశ సైనికుల గురించి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడారు. ఇతర దేశాల్లో మన దేశ వ్యవస్థలను అగౌరవపరుస్తూ మాట్లాడతారు. ఎన్నికల వ్యవస్థను, పార్లమెంటును, ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరుస్తారు. కులాలు,మతాలు, భాషల పేరుతో సమాజాన్ని విడదీసేలా మాట్లాడతారు.

బహిరంగ చర్చకు రావాలని సవాల్!
జమ్మూ కాశ్మీర్ లో 60 ఏళ్లలో మీరేం చేశారో, గత 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వంఏం చేసిందో చెప్పేందుకు బహిరంగ చర్చకు రావాలని రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. మహారాజా హరిసింగ్ పార్కులోని ఆయన విగ్రహం ముందు మీడియా ప్రజలు, మేధావుల సమక్షంలో చర్చకు రావాలన్నారు.

ఎన్నికల ప్రచారంలో ఏది పడితే అది మాట్లాడకుండా చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలన్నారు. మీరు మాట్లాడిన దానికి కట్టుబడి ఉంటే నా సవాల్ స్వీకరించండి. బహిరంగ చర్చకు రండి.

సంక్షేమం, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన విషయంలో జమ్ము కాశ్మీర్లో శాంతి నెలకొల్పడంలో, ప్రతి పేదవాడికి ఇండ్ల నిర్మాణంతో పాటు ఇంటికి టాయిలెట్లు, గ్యాస్ సిలిండర్ ఇవ్వడంలో.. ఐదులక్షల ఆరోగ్య బీమా, యువతకు, మహిళలకు చేయుత నందించడం వంటి ఎన్నో పనులు జమ్మూ కాశ్మీర్ లో మోదీ ప్రభుత్వం చేసింది.

2004-2014 మధ్యలో మీ పరిపాలనలో జమ్మూ కాశ్మీర్ లో అశాంతి, అలజడి తప్ప మీరు సాధించిందేమీ లేదు. గతంలో ప్రతిపక్ష నేతలుగా పని చేసిన అటల్ బిహారి వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ, సుష్మా స్వరాజ్, గులాంనబీ ఆజాద్ లాంటి వాళ్లు.. ప్రతిపక్ష నేతలుగా తమదైన ముద్రవేశారు. దేశ హితం లక్ష్యంగా పనిచేశారు.

కానీ రాహుల్ గాంధీ ఇతర దేశాల్లో భారతదేశాన్ని అవమానించే రీతిలో మాట్లాడితే చరిత్ర క్షమించదు. ప్రతిపక్ష నేతగా ఎంత హందాగా నడుచుకోవాలో ముందగా రాహుల్ తెలుసుకోవాలి.

ఇవాళ బీజేపీలో విలీనమైన డోగ్రా స్వాభిమాన్ సంఘటన్ పార్టీ నేతలందరికీ శుభాకాంక్షలు. వారందరికీ పార్టీలోకి హృదయపూర్వక స్వాగతం. ఈ సమయం నుంచి మీరు కూడా బీజేపీ పార్టీ సభ్యులు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద పార్టీలో బీజేపీలో మీరు కూడా సభ్యులయ్యారు.

ఇది ఏ ఒక్క కుటుంబానికి సంబంధించింది కాదు. 140 కోట్ల దేశ ప్రజలందరికీ సంబంధించిన పార్టీ. మీరందరు పార్టీలో చేరడంతో దేశం గర్వపడుతుంది. దేశంలోని అత్యంత పెద్ద పార్టీలో చేరినందుకు మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను.

LEAVE A RESPONSE