– అటవీ, పర్యావరణ శాఖా మంత్రి కొండా సురేఖ
బెంగళూరు: ఈ భూమి మనుషులకు మాత్రమే ఆవాసం కాదనీ, సకల జీవులకు ఈ భూమి పై జీవించే హక్కు ఉందనే సత్యాన్ని గుర్తించాలని అటవీ, పర్యావరణ శాఖా మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు.
ప్రపంచ ఏనుగు దినోత్సవాన్ని(ఆగస్టు 12) పురస్కరించుకుని కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో నిర్వహించిన “ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యుమన్-ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్ మెంట్” సదస్సులో అటవీ, పర్యావరణ శాఖామాత్యులు కొండా సురేఖ పాల్గొన్నారు.
ఏనుగులు, మనుషుల మధ్య సంఘర్షణ, వాటి సంరక్షణ, నిర్వహణ పై అర్థవంతమైన చర్చ జరిగేందుకు కర్నాటక ప్రభుత్వం ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సదస్సును చేపట్టడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు.
ప్రకృతి పరిరక్షణ, సహజ వనరుల నిర్వహణ రంగంలో పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) ఆసియా ఏనుగులను అంతరించిపోతున్న వన్యప్రాణుల జాబితాలో చేర్చడం మానవ వైఫల్యాన్ని నిరూపిస్తున్నదని మంత్రి సురేఖ అన్నారు. దంతాల కోసం ఏనుగులను క్రూరంగా వేటాడటం, అటవీ భూములు, నీటి వనరుల ఆక్రమణ, అడవుల నిర్మూలనతో ఏనుగులు ఆవాసం కోల్పోయి, ఆహార సేకరణ కోసం వలసపోతూ ప్రమాదాలను ఎదుర్కంటున్నాయని మంత్రి ఆవేదనను వ్యక్తం చేశారు.
ఏనుగుల ఆవాసాల్లో అటవీసంపదను, నీటి వనరులను మెరుగుపరచడం, ఏనుగులు పంట పొలాల్లోకి, జనావాసాల్లోకి వచ్చినపుడు సంయమనంతో వ్యవహరించడం ద్వారా అవి ప్రమాదాలకు లోనుకాకుండా నివారించవచ్చునని మంత్రి సురేఖ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డి.కె. శివ కుమార్, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే, పలు రాష్ట్రాల అటవీ శాఖా మంత్రులు, , పలువురు దేశ, విదేశాలకు చెందిన అటవీరంగ నిపుణులు, రీసర్చ్ స్కాలర్ లు, పలువురు పౌర సమాజ సంస్థలకు చెందిన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.