Suryaa.co.in

Andhra Pradesh

రోడ్లు బాగుంటేనే అభివృద్ధి

– ఏలూరు జిల్లా దెందులూరు మండలం గోపాన్నపాలెం లో రహదారి గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారథి
– పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

ఏలూరు/దెందులూరు : రాష్ట్రవ్యాప్తంగా ఆర్ అండ్ బి రహదారులు గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు.

శనివారం ఏలూరు జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెం వద్ద జంగారెడ్డిగూడెం ఏలూరు రోడ్డు వెళ్లే రోడ్డుకు సంబంధించి గుంతలు లేని రోడ్ నెట్వర్క్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో కలిసి మంత్రి పార్థసారథి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.600 కోట్ల పైగా నిధులు కేటాయించి ఆర్ అండ్ బి రహదారులను గుంతలు లేని రహదారులుగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ పనులు అన్నిటిని సంక్రాంతి లోపు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతున్నదన్నారు. ఏలూరు జిల్లాలో రూ 76 కోట్లతో రహదారి గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అదే విధంగా మరో రూ 46 కోట్లతో 28 శాశ్వత పనులు మంజూరు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.

రహదారుల అభివృద్ధి ద్వారా అభివృద్ధి సాధ్యమని తద్వారా పరిశ్రమలు కూడా వస్తాయని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం రోడ్లను పూర్తిగా నిర్వీర్యం చేసిందని ప్రస్తుత రోడ్లు ఈ దుస్థితికి రావడానికి గత పాలకులే కారణమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు తమ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు.

ఈ పనులను జనవరి 15 లోపు పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి స్పష్టం చేశారని, అదేవిధంగా జనవరి తర్వాత ముఖ్యమంత్రి వారి పర్యటనలో ఎక్కడైనా గుంతలతో కూడిన రహదారి కనబడితే సంబంధిత ఇంజనీరు పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారని మంత్రి పార్థసారథి తెలిపారు. సంస్కృతి, నాగరికత ఆ ప్రాంత రోడ్ల అభివృద్ధి ద్వారానే కనబడుతుంది అన్నారు.

ప్రస్తుతం తలసరి ఆదాయం రూ.2.5 లక్షలు ఉందని దానిని ఏ విధంగా పెంచాలని ముఖ్యమంత్రి ఆలోచన అని, మూడున్నర లక్షల నుండి నాలుగు లక్షల వరకు పెంచితే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందన్నారు. రానున్న ఐదు సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించి యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు.

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను రు 3 వేల నుండి 4 వేల రూపాయలకు పెంచడమే కాకుండా మూడు నెలల బకాయిలను కూడా చెల్లించడం జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులకు సంబంధించి 70 శాతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో 2019 వరకు పూర్తి చేయగా గత ప్రభుత్వం మిగిలిన దాంట్లో కనీసం ఐదు శాతం కూడా చేయని దద్దమ్మ ప్రభుత్వమని గత ప్రభుత్వాన్ని మంత్రి విమర్శించారు.

స్థానిక శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ తెలిపిన నిరుపయోగంగా అటవీ భూమిలో జీడి ఇతర పంటల సాగుకు ఏ విధంగా చేయాలనేది ఆలోచన చేసి, ఈ అంశాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధిని కళ్ళకు కనిపించేల అభివృద్ధి చేసి చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు.

శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ.. దెందులూరు నియోజకవర్గానికి ఏలూరు-జంగారెడ్డిగూడెం రోడ్డు గుండెకాయ వంటిదని, అటువంటి రహదారిని పూర్తిస్థాయిలో అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. గోపన్నపాలెం వద్ద ఈ రహదారిని విస్తరించి, అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దెందులూరు-పంగిడిగూడెం, కొత్తూరు-పెరికేడు రోడ్లను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు.

గోపన్నపాలెం- రామసింగవరం అభివృద్ధికి త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు. నియోజకవర్గంలో 20 కోట్ల రూపాయలతో సిసి రోడ్లు చేపడుతున్నామని చెప్పారు. అయితే ఈ రోడ్లకు సమాంతరంగా డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టేందుకు అవకాశం కల్పించాలని, ఈ విషయాన్నీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకువెళ్లాలని మంత్రి కొలుసు పార్థసారథికి కోరారు.

రామసింగవరం వద్ద ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చెందిన భూమి 1500 ఎకరాలు నిరుపయోగంగా ఉందని, ఈ భూమిలో డ్వాక్రా మహిళలకు అర ఎకరం చొప్పున లీజు విధానంపై అందించి జీడీ మొక్కలు, ఇతర ఉద్యానవన పంటలు సాగుచేసేందుకు అనుమతించేందుకు చర్యలు తీసుకుని, దీనికి ఒక ప్రాజెక్టుగా చేపట్టాలని సూచించారు. గతంలో నిర్మించిన పశువుల షెడ్లు పనులకు సంబంధించి విజిలెన్సు తనిఖీ చేసి, వారికి సక్రమమైతే వాటికి బిల్లులు చెల్లించాలని కోరారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, రహదారులు,భవనాల శాఖ ఎస్ఈ జాన్ మోషే, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, తహసీల్దార్ సుమతి, ఎంపిడిఓ శ్రీదేవి, ఏఎంసీ మాజీ చైర్మన్ మాగంటి సురేంద్రనాథ్, స్థానిక నాయకులు మిల్లుబాబు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE