– ఆన్లైన్ లో అన్ని సర్వీసులు అందుబాటులోకి రావాలి
– దృవపత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే పరిస్థితి ఉండకూడదు
– రెవెన్యూ శాఖలో ప్రజల అర్జీల పరిష్కారంపై థర్డ్ పార్టీతో ఆడిట్
– ఆన్లైన్ రికార్డులు మార్చి ప్రజలను భయపెట్టి భూములు కొట్టేసిన వారిపైన కఠిన చర్యలు
– రెవెన్యూ శాఖ సమూల ప్రక్షాళన….తప్పు చేసే అధికారులకూ శిక్ష
– రీసర్వేతో తెలెత్తిన 2.29 లక్షల సమస్యల సత్వర పరిష్కారం…. సమస్యలకు తావు లేకుండా రీ సర్వే చేపట్టాలి
– ఫ్రీ హోల్డ్ భూముల్లో జరిగిన 7,827 ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్ లపై విచారణ
– రెవెన్యూ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
అమరావతి : రాష్ట్రంలో రెవెన్యూ సేవలు సులభతరం కావాలని…..ఆన్లైన్ లో అన్ని సర్వీసులు అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. టెక్నాలజీ కాలంలో కూడా సర్టిఫికేట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని సిఎం అన్నారు. బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్ కం సర్టిఫికెట్ వంటి సర్వీసుల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే అవసరం లేకుండా ఆన్ లైన్ లో సేవలు పొందేలా చేయాలన్నారు.
రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష చేశారు. ఈ సమీక్షకు మంత్రి అనగాని సత్యప్రసాద్ తో పాటు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రెవెన్యూ శాఖకు సంబంధించి ప్రజల నుంచి వస్తున్న వినతులు, వాటి పరిష్కారం తీరుపై సిఎం సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సమస్యలపై అన్ని శాఖలకు సంబంధించి 1,74,720 అర్జీలు రాగా అందులో 67,928 అర్జీలు కేవలం రెవెన్యూ విభాగం నుంచే వచ్చాయి. మొత్తం అర్జీలలో 1,32,572 పరిష్కరించగా…ఇందులో 49,784 రెవెన్యూ సమస్యలకు సంబంధించి ఉన్నట్లు అధికారులు తెలిపారు. రెవెన్యూ రికార్డులు, భూ కబ్జాలు, అసైన్మెంట్ భూములు వంటి సమస్యలపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు వివరించారు.
ప్రజల నుంచి వచ్చే వినతులపై సత్వర, పూర్తి స్థాయి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని సిఎం అన్నారు. తమ వినతులు, సమస్యలపై ప్రజలను అక్కడికి, ఇక్కడికి తిప్పే పరిస్థితి ఇకపై ఉంటే సహించేది లేదని సిఎం వ్యాఖ్యానించారు. ఒక దరఖాస్తు వస్తే దాన్ని పూర్తి స్థాయిలో పరిష్కరించాల్సిన అవసరం ఉందని… మొక్కుబడి తంతు కుదరదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ విధానాల కారణంగా ఎప్పుడూ లేనంతగా రెవెన్యూ శాఖ పరిధిలో పెద్దమొత్తంలో సమస్యలు తలెత్తాయని…వీటి పరిష్కారం కోసం ప్రజలు కాళ్లు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని సిఎం అన్నారు. ప్రజలు సులభంగా రెవెన్యూ సేవలు పొందేందుకు అవసరమైన ప్రక్షాళన చేపట్టాలని సిఎం అభిప్రాయపడ్డారు.
ఏ తరహా ఫిర్యాదును ఎలా పరిష్కరిస్తున్నారు, ఎంత సమయం తీసుకుంటున్నారు, ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తం అవుతుందా లేదా అనే అంశాలపై థర్డ్ పార్టీ ద్వారా ఆడిట్ చెయ్యాలని సీఎం అన్నారు. గత 5 ఏళ్లలో జరిగిన భూ కబ్జాలు, తప్పుడు లావాదేవీలు, వివాదాలపై శాఖా పరంగా తీసుకుంటున్న చర్యలను, నివేదికలను అధికారులు వివరించారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో 13,59,805 ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేశారని…వీటిలో 4,21,433 ఎకరాలు నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీ హోల్డ్ చేసినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. మొత్తం ఫ్రీ హోల్డ్ భూముల్లో 25,284 ఎకరాలు రిజిస్ట్రేషన్ అవ్వగా…అందులో 7,827 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్ లో నిబంధనల ఉల్లంఘన జరిగిందని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
ఈ 7,827 ఎకరాలకు సంబంధించి జరిగిన అవకతవకల్లో రెవెన్యూ అధికారుల, సిబ్బంది సహా ఎవరి పాత్ర ఉంది, కారకులు ఎవరు, తెరవెనుక ఉన్న వాళ్లు, బీనామీలు, రాజకీయ నేతల ప్రమేయాన్ని కూడా తేల్చాలని సిఎం ఆదేశించారు. ఫ్రీ హోల్డ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ లు జరిగిన మొదటి 10 మండలాలపై అధికారులు సీఎంకు వివరించారు.
పెనుకొండ, నందలూరు, వెదురుకుప్పం, ధర్మవరం, వీరబల్లి, సోమందేపల్లి, ఏర్పేడు, దోర్ణాల, రొద్ద, రామాపురం మండలాల్లో పెద్ద మొత్తంలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారులు తెలిపారు. వీటిపై సమగ్ర విచారణ జరిపి…..కారకులపై చర్యలు తీసుకోవాలని సిఎం అన్నారు. అదే విధంగా 4,21,433 ఎకారాల ఫ్రీ హోల్డ్ భూమల్లో జరిగిన నిబంధన ఉల్లంఘనలను కూడా తేల్చాలని సిఎం అధికారులను అన్నారు.
రీ సర్వే సమస్యల సత్వర పరిష్కారం
మొత్తం 16,816 గ్రామాలకు గాను 6,698 గ్రామాల్లో 85 లక్షల ఎకరాలల్లో రీ సర్వే పూర్తి అయ్యింది. అయితే ఆ రీ సర్వేలో తప్పులపై ప్రజల నుంచి 2,79,148 ఫిర్యాదులు వచ్చాయి. వీటిని పరిష్కరించడంతో పాటు…ఇప్పటికే రీ సర్వే జరుగుతున్న గ్రామాలతో పాటు….రీ సర్వే మొదలవ్వని గ్రామాల్లోకూడా పారదర్శకంగా, సమస్యలు తలెత్తకుండా సర్వే పూర్తి చెయ్యాలని సిఎం అదేశించారు. అనంతరం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ… గత ప్రభుత్వం 77,98,516 సరిహద్దు రాళ్లు నాటి సిఎం బొమ్మలతో ముద్రించింది.
టమి ప్రభుత్వం వీటిని తొలగించి సరిహద్దు రాళ్లు ఇస్తామన్న మాట మేరకు…ఆ రాళ్లపై బొమ్మల తొలగింపు జరుగుతోంది. దీనిలో భాగంగా ఇప్పటి వరకు 4,40,651 రాళ్లపై బొమ్మలు తొలగించారు. ఒక్కో రాయిపై బొమ్మ తొలగించేందుకు రూ. 15 ఖర్చు అవుతుంది. మొత్తం అన్ని రాళ్లపై గత పాలకుల బొమ్మలు తొలగించేందుకు రూ. 12 కోట్లు ఖర్చు అవుతుందని…జనవరి నాటికి ఈ పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రికి వివరించారు.
చివరిగా సీఎం మాట్లాడుతూ…..రెవెన్యూ శాఖ సమూల ప్రక్షాళన ద్వారా, కఠిన నిర్ణయాల ద్వారా ప్రజల ఇబ్బందులు తగ్గించాలని అన్నారు. భూములు బలవంతంగా లాక్కునేందుకు 22ఎలో పెడతామని బెదిరించి చేసిన కబ్జాలు అనేకం ఉన్నాయని వీటిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కూడా చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న రోజుల్లో పిడి యాక్ట్, యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లను సమర్థవంతంగా ఉపయోగించి భూ మాఫియాకు అడ్డుకట్ట వేయాలన్నారు.
సామాన్య ప్రజలను, పేదలను, బలహీనులను బెదిరించి భూ కబ్జాలు చేసేవాళ్లు…..హంతకులతో సమానం అని…ఇలాంటి వారి పట్ల కఠినంగా ఉండాలని సిఎం అన్నారు. కొందరు అధికారులు, సిబ్బంది రికార్డులు మార్చి చేసిన అవినీతి కారణంగా ఎంతో విలువైన భూములు కోల్పోయి ప్రజలు రోడ్డున పడ్డారని….ఇలాంటి వాటికి ఇక ముగింపు పలకాలని సిఎం అన్నారు.
ఆన్లైన్ లో భూ రికార్డులు మార్చి ప్రజలను భయపెట్టి భూములు కొట్టేసిన ఘటనల్లో పాత్రదారులైన అధికారులపైనా, సిబ్బంది పైనా చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ శాఖలో సమూల ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని….తద్వారా ప్రజల ఆస్తులు, భూములకు రక్షణ కల్పించి వారికి ఒక భరోసా కల్పిస్తామని సీఎం అన్నారు.