– కష్టమొస్తే రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భవన్ గుర్తొస్తోంది
– చరిత్ర చదవకుండా..భవిష్యత్‌ను నిర్మించలేం
– తెలంగాణ ఆనవాళ్లు చెరిపేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు
– సమైక్యాంధ్ర సంచులు మోసిన తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రిగా ఉన్నాడు
– ఉద్యమం పై గన్ను ఎక్కుపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి
-లగచర్ల భూముల సేకరణ విరమణ బీఆర్ఎస్ విజయం, తెలంగాణ ప్రజల విజయం
-తెలంగాణ భవన్ లో ఘనంగా దీక్షా దివస్ వేడుకలు
-ఆకట్టుకున్న కేటీఆర్ ప్రసంగం
-తెలంగాణ ఉద్యమ చరిత్ర, కేసీఆర్ దీక్షా ను కళ్లకు కట్టినట్లు వివరించిన కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ భవన్ లో దీక్ష దివస్ ఘనంగా జరిగింది. హైదరాబాద్ నగర పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, పలువురు సీనియర్ నాయకులు హాజరైన ఈ కార్యక్రమం 2009 సంవత్సరంలో కెసిఆర్ దీక్ష జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కొనసాగింది. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ప్రసంగంతో ముగిసింది.
ఇంతకుముందు కేటీఆర్ నేతృత్వంలో బంజారాహిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి భారీగా ర్యాలీగా తెలంగాణ భవన్ వరకు పార్టీ నేతలు పార్టీ శ్రేణులు చేరుకున్నాయి. తెలంగాణ భవన్ లో ముందుగా తెలంగాణ తల్లికి ఆ తర్వాత జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసిన నేతలు కార్యక్రమం ప్రారంభానికి ముందు అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత పార్టీ సీనియర్ నాయకులు, శాసనమండలిలో పార్టీ శాసన మండలి నేత మధుసూదనా చారి, ఆ తర్వాత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుదీర్ఘ ప్రసంగం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమన్నారంటే .. 15 ఏళ్ల క్రితం కేసీఆర్ ఉక్కు సంకల్పంతో ‘తెలంగాణ వచ్చుడో…కేసీఆర్ సచ్చుడో’ అంటూ జనసామాన్యులను తట్టుతూ తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆమరణ దీక్ష చేశారు. ఇవ్వాళ 33 జిల్లాలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు అభినందనలు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బంజారా బిడ్డలు వచ్చారు. వారి కళారూపాలను ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తే ఈ ప్రభుత్వం లేకి గా ప్రవర్తించింది.
తెలంగాణ భవన్ వద్ద లైట్లు బంద్ జేసి, కరెంట్ తీసేసి ప్రభుత్వం చాలా తక్కువ బుద్దితో వ్యవహరించింది. మనం ఇవ్వాళ ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వాన్ని విమర్శించేందుకు పెట్టుకోలేదు.
ఎక్కడి నుంచి వస్తున్నామో తెలియకపోతే…ఎటు పోవాలో అర్థంగాదు! నిన్న ఏ దారిలో నడిచి వచ్చామో తెలుసుకోకపోతే..రేపు ఏ బాటలో పయనించాలో తెలియదు. చరిత్ర చదవకుండా..భవిష్యత్‌ను నిర్మించలేం. గతం తెలుసుకోకుండా..గమ్యాన్ని నిర్ణయించుకోలేం.
రామాయణం.. భారతం మహా ఇతిహాసాలు పురాణాలు వేల ఏండ్లుగా శ్రుతులుగా కథలుగా గ్రంథాలుగా పద్యాలుగా నాటకాలుగా వివిధ రూపాల్లో ప్రతి జనరేషన్ ను చేరి భరతజాతిని ఐక్యంగా నిలబెట్టాయి. అదే మాదిరిగా ఒగ్గు కథలు.. బుర్రకథలు.. యక్షగానాలు.. బతుకమ్మ పాటలు.. నృత్య రూపాలు… చిత్రకళలు.. చరిత్ర పాఠాలు.. శిలా శాసనాలు ఎన్నెన్నో రకాలుగా ఘనమైన గతాన్ని.. సంస్కృతిని .. మహనీయులను .. వైతాళుకులను యాది చేసుకుంటూ వుంటాం. ఏ జాతి ఐతే .. తన చరిత్రను విస్మరిస్తుందో ఆ జాతి పరాయి పెత్తనంలో బానిసగా మగ్గిపోతుంది.
ఒక ప్రాంతాన్నో.. ఒక దేశాన్నో ఓడించి వశం చేసుకున్న విజేతలు…పరాజితుల చరిత్ర చెరివేసే ప్రయత్నం చేస్తారు. మీకు చరిత్ర లేదు… సంస్కృతి లేదు మేం అధికులం మీరు అల్పులు అని మానసికంగా లొంగదీసుకునే ప్రయత్నం చేస్తారు.
బ్రిటీష్ వాళ్ల నుంచి.. సమైక్యాంధ్ర శక్తులు దాకా అదే పనిచేసాయి. తెలంగాణ భావజాలం మీద ఎన్నెన్ని దాడులు జరిగాయో మీకు గుర్తుండాలి. తెలంగాణ ఏర్పడితే ఇక్కడి నాయకత్వానికి పాలించే సత్తా లేదని మనపై దాడి జరిగింది. కానీ వాటిని పటాపంచలు చేస్తూ దేశం గర్వించేలా చేసిన చరిత్ర కేసీఆర్ గారిది.
స్పార్టకసో.. గాంధీనో.. మార్టిన్ లూథరో.. మండేలానో ఎవరో ఒక యోధుడు మళ్లీ ఆ జాతిని మేల్కొల్పి విముక్తి చేయాల్సి వస్తుంది.. ప్రతి జాతికి.. ప్రతి దేశానికి .. ప్రతి ప్రాంతానిక ఒక కథ వుంటుంది..! ఆ కథలో కథనాయకులు ప్రతినాయకులు.. త్యాగాలు.. విద్రోహాలు విజయాలు.. గుణపాఠాలు వుంటాయి. తెలంగాణ కథలో కూడా కథానాయకుడు తెలంగాణ తల్లికి జన్మనిచ్చిన తనయుడు కేసీఆర్ .
స్వరాజ్య సమరాన్ని మించిన సముజ్వల సన్నివేశాలను సృష్టించి సంకెళ్లను తెంచుకున్న విజయం వుంది. కుట్రలను.. కుతంత్రాలను ఛేదించి, యావత్ జాతిని ఏకతాటిపై నడిపించి శాంతియుత పంథాలో వ్యూహాలు.. ఎత్తుగడలు రచించి.. ఉక్కు సంకల్పంతో .. చెక్కు చెదరని నిబద్ధతతో గమ్యాన్ని ముద్దాడిన నాయకుడు మనకు ఉన్నాడు.
భారత స్వతంత్ర సంగ్రామంలో దండి యాత్ర.. సహాయ నిరాకరణ .. ఇంకెన్నో పోరాట ఘట్టాలు వున్నట్టే మన మలి దశ తెలంగాణ పోరాటంలో మహోజ్వల సందర్భాలు చాలా వున్నాయి. కేసీఆర్ 2001 లో పదవుల త్యాగంతో పార్టీని ప్రారంభించి ఆ అపవాదును పొగొట్టారు. అద్భుత ఘట్టాల్లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఒక పతాక సన్నివేశం .. పరమోత్కృష్ట దృశ్యం!
దీక్షా దివస్ ఇప్పుడెందుకు అవసరం ? ఒకసారి ఆదమరిచి.. అప్రమత్తత లేకుండా ఒక పొరపాటు చేస్తే.. 60 ఏండ్లు తెలంగాణ అరిగోస పడ్డది. మూడు తరాలు పీడనకు బలై పోవాల్సి వచ్చింది..! అందుకే..తెలంగాణ వచ్చింది కదా ఇంకెందుకు ఉద్యమ యాది.. మళ్లా ఎందుకు పోరాట చరిత్ర అనుకుంటే అది పెద్ద పొరపాటు అవుతుంది. స్వతంత్రం సాధించడం ఎంత ముఖ్యమో..నిలబెట్టుకోవడం అంతే ముఖ్యమని నేను మీకు గుర్తు చేస్తున్నా. ఒక తరానికి ఆత్మగౌరవ రణం నేర్పి… కేసీఆర్ విముక్తి ఎట్లా సాధించాడో రేపటి తరానికి తెలుపాల్సిన బాధ్యత మన మీద ఉంది.
నిన్నటి పోరాటంలో హీరోలు ఎవరో.. విలన్లు ఎవరో.. శిఖండులు ఎవరో.. ఎవరి పాత్ర ఏందో తెలిస్తేనే ఈ జనరేషన్ జాగ్రత్త నేర్చుకుంటది. కేసీఆర్ సీఎంగా దిగిపోగానే నిన్నటి దాకా అణిగిమణిగి వున్న కొన్ని శక్తులు ఎట్లా రెచ్చిపోతున్నాయో ఒక్కసారి చూడండి! సమైక్యాంధ్ర నాయకుల సంచులు మోసిన తెలంగాణ ద్రోహులు. అస్తిత్వంపై ఎట్లా దాడి చేస్తున్నారో గ్రహిచండని కోరుతున్నా. ఇక్కడున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వంపై దాడి మొదలు పెట్టాడు.
సోనియమ్మ లేకపోతే.. తెలంగాణ అడుక్కుతినేదని అహంకారంతో వాగుతున్నడు కాంగ్రెస్ సీఎం! సోనియా గాంధీ దయా దాక్షిణ్యాలు.. భిక్ష వల్లే తెలంగాణ వచ్చిందని తెలంగాణ ప్రజా పోరాటాన్ని కించపర్చుతున్నారు! మన ప్రధాని మోడీ ఎప్పుడు చూసిన తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణ ఏర్పాటును అవమానిస్తుంటాడు.
గుజరాతీ అయిన సర్ధార్ వల్లభ భాయ్ వచ్చి మనల్ని విడిపించారని చెబుతాడు. ఇంకో గుజరాతీ వచ్చి అభివృద్ధి నేర్పిస్తున్నాడంటూ బీజేపీ నేతలు అంటున్నారు..! తెలంగాణ సాయుధ పోరాటం నుంచి.. మలి దశ ఉద్యమాన్ని మొత్తం అవమానించేలా నోరు పారేసుకుంటున్నారు. సచివాలయం ఎదుట.. తెలంగాణ తల్లి స్థానాన్ని కబ్జాపెట్టి రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని పెట్టుకొని సిగ్గు లేకుండా ఢిల్లీకి గులాంగిరి చేస్తున్నాడు.
ఆనాడు బ్రిటీషర్లు చేసిన దానికన్నా కూడా అరాచకంగా కొడంగల్ లో ని లగచర్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అక్కడి మహిళలపై బందిపోట్ల మాదిరిగా పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారు. ఇప్పుడు నేను చూశాను. మన పోరాటానికి తలొగ్గి లగచర్లలో భూముల సేకరణ విరమించుకున్నారు. ఇది బీఆర్ఎస్ విజయం … తెలంగాణ ప్రజల విజయం. గిరిజనులు, దళితులు, బీసీల, రైతుల విజయం. ఈ రియల్ ఎస్టేట్ బేహారీకి…పాలన తెలియదు. మీ భూములు తీసుకొని రియల్ ఎస్టేట్ దందా చేయటం మాత్రమే తెలుసు.
కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్ ఇప్పుడు జనతా గ్యారేజ్ అయ్యింది. ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే తెలంగాణ భవన్ గుర్తు వస్తోంది. మూసీ, హైడ్రా, లగచర్ల బాధితులు సాయం కోసం తెలంగాణ భవన్ కు వస్తున్నారు. ప్రజలకు ఎప్పుడూ ఏ కష్టమొచ్చినా సరే తెలంగాణ భవన్ తలుపులు తీసే ఉంటాయి. ప్రజల కష్టాలకు సంబంధించి శాసన సభ, మండలి సహా అన్ని వేదికలపై పోరాటం చేస్తూనే ఉంటాం. తెలంగాణ గొంతు అంటే బీఆర్ఎస్ మాత్రమే. మరెవరూ కాదు. మైనార్టీ సోదరులు కూడా మనవాళ్లు ఎవరో…కానీ వాళ్లు ఎవరో గుర్తించాలి.