రోజు రోజుకూ వెర్రి తలలు వేస్తున్న జీవన రీతులలో…. జర్నలిజం కూడా చేరిపోయింది. ‘జర్నలిస్ట్’ అని చెప్పుకోడానికి ఏ రకమైన విద్యార్హతలు అవసరం లేకపోవడం, ఆ వృత్తి పట్ల సమాజం లో కొద్దో…. గొప్పో గౌరవం లాటిది ఉన్నట్టు కనబడుతుండడం తో…. ఇటీవలి కాలం లో…. రాజకీయాల లాగానే ఈ వృత్తి కూడా బాగా భ్రష్టు పట్టి పోయిందనే భావం బాగా బలం గా వినబడుతున్నది. రాజకీయాలలో చేరడానికి కూడా ఏ రకమైన అర్హతలూ అవసరం లేదు కదా! జస్ట్…. మనిషి పుట్టుక పుడితే చాలు.
రాజకీయాల్లో ఎటువంటి వారు ఇప్పుడు ఉన్నారో చూస్తూనే ఉన్నాం కదా!
అచ్చం అలాగే జర్నలిజం కూడా తయారైంది.
ఇదివరకు ” ప్రెస్ కాన్ఫరెన్స్ ” అంటే…. మహా అయితే ఓ పది మంది వచ్చేవారు. ఒక గది లో కూర్చుని మాట్లాడితే సరిపోయేది. ఇప్పుడు ప్రెస్ మీట్ అంటే…. కనీసం వందమంది వస్తున్నారు.
ఏదైనా ఫంక్షన్ హాల్ తీసుకోవాలి, నిర్వాహకులు.
పత్రికల విలేకరులు. ఛానళ్ళ విలేకరులు, వారితో పాటు వాళ్ళ కెమెరా మెన్ లు. వారి సహాయకులు.
వీరంతా సరిపోరు అన్నట్టుగా… యూ ట్యూబర్లు.
చివర్లో ‘కవర్లు’ అనేది కొందరి( చాలా మంది )అనుభవం.
ఏ ఊరికి ఆ ఊరులో ఇంతమంది తో కూడిన ‘భారీ సైన్యం’ ఊరు మీద పడిపోతుంటే… వారి బాధిత జనం హాహాకారాలు చేస్తున్నారు.
రాష్ట్ర సచివాలయం దగ్గర నుంచి, డీజీపీ కార్యాలయం… కలెక్టరేట్ లు, పోలీస్ స్టేషన్ లు మొదలైన సమస్త ప్రభుత్వ కార్యాలయాల్లోకి దర్జాగా వెళ్లడం…. ఒక జన్మ హక్కులాగా భావించే జ(ఎ)ర్న లిస్ట్ లకు కొరత లేకుండా పోతున్నది. పోలీస్ స్టేషన్ల లో సెటిల్మెంట్ల లో కూడా చాలా చోట్ల ఈ ఎ(జ)ర్నలిస్టులదే ప్రధాన భూమిక. ఇదొక సోషల్ స్టేటస్.
పాలు, నీరు లా కలిసిపోయిన ఈ ‘మంద’ నుంచి పాలు…. నీళ్లు వేరు చేయకపోతే ; సమాజం తో పాటు, జర్నలిజం… జర్నలిస్టు లకు కూడా ఇబ్బందులు తప్పక పోవచ్చునని భావించిన తిరుపతి పోలీసు శాఖ… తిరుపతి ప్రెస్ క్లబ్ సహకారం తో ఓ ప్రయత్నం మొదలు పెట్టింది.
జర్నలిస్ట్ పేరు, ప్రాతినిధ్యం వహించే మీడియా పేరు, ఫోన్ నెంబర్, ఎక్రిడిటేషన్ వివరాలు, చిరునామా వంటి వృత్తి పరమైన వివరాల తో కూడిన స్టికర్ ను జారీ చేస్తున్నారు. దానిపై ఓ క్యూ ఆర్ కోడ్ కూడా ఉంటుంది. దానిని ఆయా జర్నలిస్ట్ ల వాహనాలకు అంటించుకోవాలి.
ఇది, నిజానికి జర్నలిస్ట్ ల గౌరవం పెంచే చర్య. జర్నలిస్ట్ ల నుంచి, నకిలీలను వేరు చేసే చర్య. ఎవరు పడితే వారు తమ వాహనాల పై PRESS అనే స్టికర్ లు అంటించుకుని రోడ్ల పై బోర విరుచుకుంటూ తిరక్కుండా నిరోధించే చర్య. ఎవరైనా సరే… ఈ క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే, జర్నలిస్టా… ఆ ముసుగులో ఉన్న ఎర్నలిస్టా అనేది ఇట్టే తెలుస్తుంది. ట్రాఫిక్ పోలీసులకు కూడా క్లారిటీ వస్తుంది.
జర్నలిస్టుల ‘ బెడద’ ఎదుర్కొంటున్న వారు… ఎవరి పరిస్థితి ఏమిటో… ఈ స్టికర్లను స్కాన్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.
రాష్ట్ర వ్యాప్తం గా…. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ, జిల్లా పౌర సంబంధాల విభాగాలు, జిల్లా కలెక్టర్లు, పోలీస్ యంత్రాంగాలు, మండలాల్లో తహసీల్ దారులు ఈ క్యూ ఆర్ కోడ్ విధానాన్ని అమలు లోకి తెస్తే ; కొంత మురికి క్షాళన అవుతుంది. “బెటర్ లేట్… ద్యాన్ నెవెర్ ” అన్నట్టు గా ఒక ఇన్నోవేటివ్ ఇనీషియేటివ్ చేపట్టి ; ఉత్తుత్తి జర్నలిస్ట్ ల బెడద నివారణ దిశగా ఒక ఆలోచన చేసిన తిరుపతి పోలీస్ యంత్రాంగాన్ని అభినందించాల్సిందే.
– భోగాది వేంకట రాయుడు