* గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు చర్యలు
* సామాజిక పెన్షన్ దారులకు స్మార్ట్ కార్డులు, పాసుపుస్తకాల జారీ
* రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అమరావతి: ఎస్ హెచ్ జిలకు త్వరితగతిన నిధులు అందించాలని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు బ్యాంకులు ఆమోదించిన సూక్ష్మ రుణప్రణాళికకు సంబంధించి రూ.14,369 కోట్లు మొత్తాన్ని అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో ఆ శాఖ పనితీరుపై మంత్రి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1,71,264 స్వయం సహాయక సంఘాలకు సూక్ష్మ రుణప్రణాళిక ద్వారా నిధులు ఇవ్వాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, అందుకనుగుణంగా ఆయా రుణాలను త్వరితగతిన అందజేయాలని సూచించారు.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఏర్పాటై 25 ఏళ్లు అయిన సందర్భంగా, సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వాహణకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతు ఉత్పత్తి దారుల సంఘాలను బలోపేతం చేసి వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు ప్రక్రియ చేపట్టాలని, అందుకు అనుభవం ఉన్న సంస్థల సేవలను ఉపయోగించు కోవాలని మంత్రి అన్నారు. మండల సమాఖ్యలకు, ఎఫ్ పిఓలకు ఇప్పటి వరకు ఇచ్చిన సామాజిక పెట్టుబడి నిధి మొత్తాన్ని ఆడిట్ చేయించి, నూరు శాతం వసూలు చేయటానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దారులకు స్మార్ట్ కార్డులు, పాస్ పుస్తకం ఇవ్వటానికి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సర్ఫ్ సీఈవో వాకాటి కరుణ, అడిషనల్ సీఈవో శ్రీరాములునాయుడు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.