– రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్త
తిరుపతి: ప్రాంతీయ పోలీసు సమన్వయ కమిటీ సమావేశం- 2025 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున శుక్రవారం తిరుపతిలో జరిగిందని ఆంధ్రప్రదేశ్ డిజిపి హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఈ సమావేశంలో దక్షిణ భారత రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక,తెలంగాణ, కేంద్ర పాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరి లకు సంబంధించిన పోలీసు అధికారులు, ప్రత్యేక కేంద్ర ప్రభుత్వ సంస్థలైన బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, సీబీఐ, ఎన్ఐఏ, ఎన్సీబీ, ఈడీ, ఎఫ్ఆర్ఆర్వో, ఐబీ, డీఆర్ఐ, ఐ 4సిలకు సంబంధించిన పోలీసు అధికారులు, ఇతర ఉన్నత అధికారులు ఈ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరైనట్టు పేర్కొన్నారు. 2015 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన భారతదేశ డీజీపీల సమావేశంలో సూచించినట్టు భారతదేశంలోని ఐదు ప్రాంతాల్లో పోలీసు సమన్వయ కమిటీ సమావేశాలు ప్రతి సంవత్సరం జరగాలని సూచించారని తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్త మాట్లాడారు. ప్రస్తుతం పోలీసు యంత్రాంగం దక్షిణ భారతదేశంలో ఎదుర్కొంటున్న సవాళ్ళను, సంయుక్తంగా వాటిని ఎదుర్కొనడానికి అన్ని రాష్ట్రాలు కలిసి తీసుకోవాల్సిన చర్యలను గురించి వివరించారు. ఈ సమావేశం ద్వారా భవిష్యత్తులో రాష్ట్రాల మధ్య సహకారం మరింత బలోపేతం అవుతుందని అలాగే ప్రజా భద్రత, చట్ట స్వస్థత, పరిరక్షణలో, సమగ్ర ఫలితాలు సాధ్యమవుతాయని హరీష్ కుమార్ గుప్త విశ్వాసం వ్యక్తం చేశారు.