– మీ మీద పడ్డ మచ్చను చెరుపుకునే అవకాశం
– చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికే వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేశారు
– లక్ష కోట్లు కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలేశ్వరం అయింది
– మరి వాళ్ళనేం చేయాలి? కొందరు తప్పులు చేశారని మొత్తం వ్యవస్థనే రద్దు చేస్తారా?
– హైటెక్స్‌లో “కొలువుల పండుగ”కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: గత పదేళ్ల బీఆరెస్ పాలనలో ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా వారి సమస్య పరిష్కరించలేదు. రెవెన్యూ శాఖ సిబ్బందిని ఒక దొంగలుగా, దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణ చరిత్రలో పోరాటాలన్నీ భూమి కోసం జరిగినవే.
కొమురంభీం, చాకలి అయిలమ్మ, రావి నారాయణరెడ్డి లాంటి వాళ్లు భూమి కోసమే పోరాడారు. భూమి కోసం పోరాటాలే కాదు భూదాన్ ఉద్యమానికి పునాదులు పడింది కూడా తెలంగాణ ప్రాంతంలోనే. వెదిరె రామచంద్రా రెడ్డి వేలాది ఎకరాలు పేదలకు పంచి భూదానోద్యమం చేశారు.
ఆనాడు పీవీ నరసింహారావు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అసైన్డ్ భూములను పేదలకు పంచారు. భూమిని చెరబట్టిన వారిని తెలంగాణ ప్రజలు దిగంతాలకు తరిమారు. గత ప్రభుత్వంలో ధరణి భూతాన్ని తెచ్చి భూములను కొల్లగొట్టాలని చూశారు. తమ దోపిడీకి వీఆర్వో వీఆర్ఏ లు అడ్డుగా ఉన్నారని వారిని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేశారు.
మిమ్మల్ని దోపిడీదారులుగా చిత్రీకరించారు. ధరణి తెచ్చిన సమస్యలతో విసిగిపోయిన ఓ రైతు ఇబ్రహీంపట్నంలో అధికారిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. సిరిసిల్లలో అధికారులపై తాళి బొట్టు విసిరిన పరిస్థితి. ఇది అధికారుల వల్ల జరగలేదు. ఇది నాటి పాలకులు సృష్టించిన వైరస్. ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తామని ఆనాడు చెప్పాం.
ఇచ్చిన మాట ప్రకారం ధరణి మహమ్మారిని వదిలించి భూ భారతి చట్టం తీసుకొచ్చాం. ధరణితో పట్టుకున్న దరిద్రాన్ని భూభారతితో పరిష్కరించే ప్రయత్నం చేశాం. ప్రభుత్వానికి పేద ప్రజలకు మీరు వారధులుగా నిలవాలి. పేద ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు మిమ్మల్ని తిరిగి నియమించాం.
ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకుంటామా? ఎవరో కొందరు తప్పులు చేశారని మొత్తం వ్యవస్థనే రద్దు చేస్తారా? వాళ్లు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికే వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేశారు. లక్ష కోట్లు కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలేశ్వరం అయింది. మరి వాళ్ళనేం చేయాలి? తెలంగాణ సాధనలో, ప్రజా ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వాములైన మీరు ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా పనిచేయాలి. భూ భారతి చట్టాలను అమలు చేయడమే కాదు. సాదా బైనామాల సమస్య పరిష్కరించాలి
ఇది మీ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. గత పాలకులు మిమ్మల్ని తెలంగాణా సమాజంలో దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. మీ మీద పడ్డ మచ్చను చెరుపుకునే అవకాశం మీకు వచ్చింది. ఆ ముద్రను చెరిపేసి, ఆనాటి పాలకుల తప్పుడు విధానాలను ప్రజలకు వివరించండి. మీ పై చేసిన ఆరోపణలు తప్పు అని నిరూపించే సుకునేలా పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరించండి.
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్, మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.