– పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి
మణికొండ/హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారులోని నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవులలో ఆదిమానవుని ఆనవాళ్లు కనిపించాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి చెప్పారు.
మూసి పరిసరాల్లో జరిపిన పురావస్తు అన్వేషంలో భాగంగాను, స్థానిక వీరభద్రాలయ వంశ పారంపర్య అర్చకులు మాడపాటి పరమేశ్వర ఇచ్చిన సమాచారం మేరకు, ఆలయ ప్రాంగణంలోని రాతి పరుపుపై దాదాపు 15చోట్ల కొత్తరాతి యుగం(సా.శ.పూ.4000 సం||) నాటి రాతి గొడ్డళ్లను పదును పెట్టేందుకు నూరిన (అరగదీసిన) గాళ్లు(గ్రూవ్స్) ఉన్నాయని, అవి 15 సెంటీమీటర్ల పొడవు, 3 సెంటీమీటర్లు వెడల్పు, 2 సెంటీమీటర్లు లోతు ఉన్నాయని ఆయన అన్నారు.
మూసి ఒడ్డునున్న వీరభద్రాలయ చుట్టుపక్కలగల రాతి చరియల కింద గుహల్లోను కొత్త రాతియుగం వారు నివసించారని , జంతువుల వేట, పశుపోషణ, కొద్దిపాటి వ్యవసాయానికి మూసి నీటి వనరులతో జీవనం సాగించారని, ఈ ఆనవాళ్లు హైదరాబాద్ నగర చరిత్రను 6000 సంవత్సరాల పూర్వానికి తీసుకువెళుతున్నాయని శివనాగిరెడ్డి చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఐడీసీ, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ బందా, సమతా మూర్తి శిల్పి డిఎస్ వి ప్రసాద్, స్థపతి, రాఘవేంద్ర సాగర్ పాల్గొన్నారు. కొత్త రాతి యువకు ఆనవాళ్లు చారిత్రక వివరాలతో పేరు పలకలను ఏర్పాటు చేసి, మంచిర్యాలను పురావస్తు పర్యాటక స్థావరంగా తీర్చిదించవచ్చని నార్సింగ్ మున్సిపాలిటీ అధికారులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.