– రాజకీయ పార్టీలకు స్థిరమైన, నిర్దిష్టమైన ఏకాభిప్రాయం అవసరం
– మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి
అమరావతి: రాజకీయ పార్టీలకు స్థిరమైన, నిర్దిష్టమైన ఏకాభిప్రాయం ఉండాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఏ ఎండకా గొడుగు కాసే రాజకీయ పార్టీలను ప్రజలు విశ్వసించే రోజులు పోయాయి.. యూటర్న్ తీసుకోవడానికి ముందు అమరావతి ప్రజలు, మహిళలు, రైతులకు వైసీపీ క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. అమరావతిని శ్మశానంతో పోల్చిన వైసీపీ.. నేడు ఏ మొహం పెట్టుకుని అమరావతి రాజధాని అంటుంది? అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
మూడు రాజధానులు పేరిట ఐదేళ్ల కాలాన్ని వృథా చేసినందుకు జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తల దించుకోవాలి. అమరావతి మునిగిపోతుందంటూ దుష్ప్రచారం చేసిన నేతలు.. నేడు సమర్థించడం వెనుక రాజకీయ దురాలోచన ఏమిటి? అధికారం కోసం ఊసరవెల్లిలా రంగులు మార్చే తత్వం వైసీపీది.. ఈ విషయం మరోసారి రుజువైంది.. జగన్ తత్వమెరిగి గత ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు.
మాట తప్పని, మడమ తిప్పని నేత నేడు మనసు మార్చుకోవడం వెనుక ఏ కుటిల రాజకీయం ఉందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసిన ప్రజలు వైసీపీని మళ్లీ నమ్మే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విజనరీ చంద్రబాబుతోనే అమరావతి ప్రజా రాజధాని సాధ్యం. వైసీపీని నమ్మి మరోసారి మోసపోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని ఆయన అన్నారు.