ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి జయంతి ఇవాళ
‘ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి ఒక మహా గాయని, మహా కళాకారిణి అని ఇప్పుడు చెప్పడం తేనె మధురమైనది, తెమ్మెర గొప్పది, హిమాలయాలు మంచు కొండలు, సంస్కృతం గొప్ప భాష, కర్ణాటక సంగీతం గొప్పది అని చెప్పడమే ఔతుంది.
ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి దక్షిణ భారతదేశ స్త్రీ కాబట్టి ఆమెను స్మరించుకోవడం ప్రతి దక్షిణభారత దేశ వ్యక్తి తాను వ్యక్తిని అన్న సంగతిని స్మరించుకోవడం ఔతుంది.
ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి ఒక మహా కళాకారిణి అని ఇవాళ మనం అనడం పసిపిల్లలు పెద్దలను గమనించి మాట్లాడ్డం వంటిది. ఆ మాటలకు అర్థం, ఆ మాటల విలువ సరిగ్గా తెలియని దశ పసిపిల్లలది. ఆ విధంగా ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి గానం కూడా మనలాంటి వాళ్లకు పూర్తిగా అవగతం కానిది.
ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి గొప్ప గాత్రం, గొప్ప గానం రెండిటికీ మేలైన మూర్తిమత్వం. ఒక మహిళగా ఆమె భారతీయతకు సరైన మూర్తిమత్వం.
ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి ప్రవర్తన, మాట, తీరు ఉన్నతమైనవి.
‘బ్రాహ్మణ్యం అన్నది పుట్టుకవల్ల రాదు; బ్రాహ్మణ్యం అన్నది ఒక స్థితి’ ఈ సత్యానికి ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి కచ్చితమైన మచ్చుతునక.
ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి తన పుట్టక నుంచి తనంత తానుగా బయటకు వచ్చేసి మేలైన బ్రాహ్మణ్యాన్ని తనకు తానుగా పొదువుకున్నారు! కులం అన్నది జన్మకు సంబంధించింది కాదు ప్రవర్తన, బుద్ధికి, వ్యక్తిత్వానికి సంబంధించినది అన్న సనాతన వాస్తవానికి ఉన్నతమైన ఆకృతి ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి.
ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి గురించి ఎంతో చెప్పాల్సి ఉన్నా ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఏమని చెప్పాలి? ‘తన భక్తి గానం అంత గొప్ప కళాకారిణి ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి!’
ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మికి సాటి ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి భక్తిగానం మాత్రమే!
అనుభూతి గానం ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి గానం; అందులోనూ ఆమె భక్తి గానం ‘చిచ్ఛక్తి గానం!’
మేలైన భక్తి గానం అంటే శోభాయమానమైన, మెరుగైన, ఉదాత్తమైన గానం. దక్షిణాదిలో rusticity లేని మేలైన భక్తి గానం చేసిన గాయకులు ఇద్దరే. పురుషుల్లో పీ.బీ. శ్రీనివాస్; (ఆయన ముకుందమాల ఇందుకు ఒక సరైన తార్కాణం) మహిళ్లలో ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి.
మరో ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి మనదేశంలో రాలేదు. తెమ్మెర వంటిది ఇంకొకటి ఉండదు; వీచి వెళ్లాక మళ్లీ ఆ తెమ్మెరే రావాలి.
మళ్లీ ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి వచ్చే వరకూ మనకు ఆమె గానం ఉంది; ఉంటుంది; ఉంటూనే ఉంటుంది.
ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి స్మరణలో..
– రోచిష్మాన్
9444012279