– తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
– పార్లమెంట్ సాక్షిగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించినందుకు క్షమాపణ చెప్పాలి
– తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు సభలో ఉన్నా ఖండించరా?
– తన పార్టీ వైఖరి ఏమిటో బీజేపీ స్పష్టం చేయాలి
– మాజీ మంత్రి, బీ ఆర్ ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు డిమాండ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దశాబ్దాల పోరాటం, వేలాది మంది విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజల త్యాగాల ఫలితం. అలాంటి మహోన్నత ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం చరిత్రను అవమానించడమే. అమరుల త్యాగాలను తక్కువ చేసి చూపించడమే. రాజ్యాంగ బద్దంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ గా నిలవడాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోందనడానికి తేజస్వి అహంకార పూరిత వ్యాఖ్యలే నిదర్శనం.
బీజేపీ అధిష్టానం వెంటనే ఈ వ్యాఖ్యలను ఖండించి, తన పార్టీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలి. లేదంటే ఇది బీజేపీ అధికారిక ధోరణిగానే ప్రజలు భావిస్తారు. ఇండియా పాకిస్థాన్ విభజన లాంటిదే తెలంగాణ ఏర్పాటు అయితే ఆనాడు బీజేపీ విభజన బిల్లుకు ఎందుకు మద్దతు తెలిపింది? ప్రధాని మోడీ కూడా గతం లో అనేక సార్లు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ పై విషం చిమ్మారు. నాడు మోడీ అయినా నేడు తేజస్వి సూర్య అయినా తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరచడమే పనిగా పెట్టుకున్నారు.
తేజస్వి సూర్య అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ నుంచి గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీ లు, కాంగ్రెస్ ఎంపీలు ఖండించకుండా గుడ్లప్పగించి చూడడం సిగ్గుచేటు. బీ ఆర్ ఎస్ ఎంపీ లు లోక్ సభ లో ఉంటే తేజస్వి సూర్య సంగతేమిటో తేల్చేవారు. బీజేపీ ఎంపీలు అయినా కాంగ్రెస్ ఎంపీ లైనా తెలంగాణ పాలిట దిష్టి బొమ్మలుగా మారారు. తెలంగాణ పేరుతో గెలిచి, తెలంగాణ అవమానాన్ని చూసి నిశ్శబ్దంగా కూర్చున్న ఎంపీలు ప్రజలకు సమాధానం చెప్పాలి.
ఢిల్లీ పెద్దల ముందు వంగి, తెలంగాణ గౌరవాన్ని తాకట్టు పెట్టే నాయకత్వాన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించరు. తెలంగాణను అవమానించే ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్య పద్ధతిలో గట్టి సమాధానం ఇస్తాం. రాష్ట్ర హక్కులు, ఆత్మగౌరవంపై దాడి చేసే శక్తులను తెలంగాణ ప్రజలు ఎన్నడూ అంగీకరించరు. తెలంగాణ అంటే పోరాట గాథ… త్యాగాల చరిత్ర… స్వాభిమానానికి ప్రతీక. దానిని అగౌరవ పరిస్తే, అవమానిస్తే సహించేది లేదు.