October 13, 2026

మరిప్పుడు తెలంగాణ లెక్క రాహుల్‌పై అత్యాచార కేసు పెడతారా?

( మార్తి సుబ్రహ్మణ్యం)

సర్‌ను రద్దు చేసి, తమ పార్టీతో పాటు ఒక వర్గం వారి ఓట్లు తీసేసి భాజపాను గెలిపించేందుకు శ్రమదానం చేస్తున్న సీఈసీ జ్ఞానేష్‌ను తొలగించాలంటూ కాంగ్రెస్ రాకుమారుడు రాహుల్‌గాంధీ, ఢిల్లీ పురవీధుల్లో చేస్తున్న యాగీలో అనేక ప్రశ్నలు.. ఎన్డీఏ ప్రేక్షకపాత్రపై ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

తనను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న ఓ మహిళా పోలీసు నడుము పట్టుకుని పక్కకుతోస్తున్న రాహుల్ వీడియో లొల్లి, ఇప్పుడు ఢిల్లీ కంటే తెలంగాణలోనే ఎక్కువయింది. మహిళా పోలీసుపై లైంగికదాడి చేసిన రాహుల్‌ను, పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన ఆయన సోదరి ప్రియాంకపై కేసు నమోదు చేయాలన్నది కొత్తగా వినిపిస్తున్న డిమాండ్.

అదేంటి? కేవలం మహిళా పోలీసు నెట్టినందుకే రాహుల్‌పై లైంగికకేసు ఎలా పెడతారన్నది మెడ మీద తల ఉన్న ఎవరికయినా వచ్చే ప్రశ్న కమ్ సందేహం. ఇలాంటి వాటిపైనా లైంగిక దాడి పేరుతో కేసు పెడతారా అన్నది నోరెళ్లబెట్టే మరో ఆశ్చర్యం. దీనితో చాలామంది అసలు లైంగిక దాడి అంటే ఏమిటి? ఏ పనులు చేస్తే లైంగిక దాడి-వేధింపుల కిందకు వస్తుందంటూ గూగుల్‌తల్లిని కాంటాక్టు చేశారట.

సరే. రాహుల్‌పై లైంగికకేసు ఎందుకు పెట్టాలన్నది కాంగీయుల ప్రశ్న. ఏదో తనను అరెస్టు చేసేందుకు వస్తున్న ఓ మహిళా పోలీసును, చేత్తో పక్కకు నెట్టినంత మాత్రాన లైంగిక దాడి కేసు పెడతారా? మరీ ఇంత అరాచకమా? ఇంత అప్రజాస్వామ్యమా? దేశం ఎటుపోతోంది? ఇలాగైతే ఇక మానవహక్కులు మంటకలపిపోవా? అన్నది కాంగేయులు తీరికూర్చుని పడుతున్న ఆవేదన.

మరయితే.. తెలంగాణ అసెంబ్లీలో మహిళా పోలీసులను ఏమీ చేయకపోయినా బీఆర్‌ఎస్ పురుష ఎమ్మెల్యేలపై అదే లైంగిక కేసులు ఎలా పెట్టారు? ఆ లెక్కన రాహుల్‌పై లైంగిక కేసు పెడితే తప్పేంటి? మరి తెలంగాణలో రేవంతన్న చేసిన ధైర్యం మోదీ కాకా ఎందుకు చేయలేకపోయారు? అయినా తెలంగాణలో కాంగ్రెస్ చేసిన ట్లుగానే, ఢిల్లీలో బీజేపీ కూడా రాహుల్‌పై లైంగిక కేసు పెడితే తప్పేంటి? అంటే రాహుల్ గాంధీకి ఢిల్లీలో ఒక న్యాయం? తెలంగాణలో ఒక న్యాయమా?

అంటే జాతీయ పార్టీలు ఇంకా రాజకీయ పాతివ్రత్యాన్ని పాటిస్తున్నాయన్నమాట. ఇంకా దిగజారుడు రాజకీయాలు చేయడం లేదన్నమాట. మరయితే సామాజిక స్పృహ ఉన్న ఎవరైనా ఆ మహిళా పోలీసు తరఫున కోర్టులో ఎందుకు కేసు వేయలేదు? చూస్తుంటే బీజేపీని కాంగ్రెస్ మేనేజ్ చేసినట్లుంది?.. ఇలాంటి సవాల లక్ష డౌటనుమానాల చర్చలు తెరపైకొస్తున్నాయి.

దేశ యువరాజు రాహుల్‌ను అరెస్టు చేసిన దుర్మార్గాన్ని తె లుసుకుని.. ఢిల్లీ పోలీసుస్టేషన్ లోపలికి వెళ్లబోయిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని, అక్కడి పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమే కాదు. దుర్మాంగంన్నర. రాహుల్‌ను ప్రధాని చేసేందుకు కాళ్లకు బలపాలు కట్టుకుని తిరుగుతున్న రేవంత్‌ను ఆవిధంగా పోలీసులు లోపలకు వెళ్లకుండా అడ్డుకోవడం దారుణం కదూ?!

దానితో రేవంత్ చాలా అసహనానికి గురయి.. ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా? కేసులు పెడతారా? ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేసే స్వేచ్ఛ కూడా ఈ దేశంలో లేదా? మరీ ఇంత నియంతృత్వమా? మా తెలంగాణలో ప్రజాస్వామ్యం నాలుగుకాళ్లతో నర్తిస్తుంటే, ఢిల్లీలో ఇంత అరాచకమా? అన్న రేవంతన్నయ్య ప్రశ్నకు, తెలంగాణ ప్రజలు అమాయకంగా కిసుక్కున నవ్వుకున్నారట. దానికి ఢిల్లీలో ఈ వార్తలు రాస్తున్న మన తెలుగు మీడియా కూడా కోరస్ అందుకుందట.

ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రతినిధి రేవంత్ సర్కారు కూడా అదే కాబట్టి. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష మరి! తన పాలనలో విపక్షాలపై తెలంగాణలో కాంగ్రెస్ ఎలాంటి వైఖరి అనుసరిస్తుందో, జాతీయ స్థాయిలో బీజేపీ కూడా చేస్తున్నది అదే మరి. అదే తెలంగాణ కాంగ్రెస్ సర్కారు పరిశుద్ధాత్మ అయితే, బీజేపీ చర్యలను ఎండగటొచ్చు. కానీ ప్రశ్నించే గళాలను గొంతునొక్కే పోటీలో, దొందూ దొందే అయినప్పుడు దానికి వగచాల్సిన పనేమిటో అర్ధం కాదు.

నిజమేమరి. తెలంగాణ కాంగ్రెస్ పాలనలో స్వేచ్ఛను చూసి స్వేచ్ఛకు సంకేతమైన పావురం కూడా ఈర్ష్య పడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఆందోళనలు ఎప్పుడయినా, ఎక్కడయినా చేసుకునే స్వేచ్ఛ ఉంది. కావాలంటే ఒకరోజు ముందు పోలీసులకు చెబితే, వారే సీఎం ఇంటి వరకూ సగౌరంగా తీసుకువెళ్లి, ధర్నా తర్వాత ఆందోళనకారులకు ప్రత్యేక బస్సులేసి మరీ ఇళ్లకు సాగనంపుతున్నారు.

పైగా వారికి చాయ్ బిస్కట్లు కూడా ఇచ్చి.. సగౌరవంగా ఇళ్లకు పంపిస్తున్న వైనం చూసి ఆనందభాష్పాలు కార్చిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ , తెలంగాణ సర్కారుకు అత్యున్నత అవార్డు ఇవ్వాలని నిర్ణయించిందన్నది సోషల్‌మీడియాలో ఊరూ పేరు లేని ఓ పోస్టింగ్ కథనం.

ఇక సీఎం, మాజీ సీఎం, మంత్రులు, వీవీఐపీల అక్రమ ఆస్తులు, ఫాంహౌసులపై మీడియా- రాజకీయ ప్రత్యర్థులు స్టింగ్ ఆపరేషన్లు చేసుకునే రిస్కు లేకుండా.. స్వయంగా పోలీసులే రాజకీయ నాయకులకు సెక్యూరిటీ ఇచ్చి, అవేంటో చూసి రమ్మని పురమాయించే కొత్త సంస్కృతి తెచ్చిన రేవంత్ సర్కారును ప్రజాస్వామ్యవాదులు, ప్రజాసంఘాలు వేనోళ్లా పొగుడుతున్నాయి. ఏపీలో ‘మంచి ప్రభుత్వం’ ఉందని వింటే, తెలంగాణలో అంతకుమించిన ‘అతి మంచి ప్రభుత్వం’ ఉందని జాతీయ మీడియా కూడా.. పెయిడ్ ఆర్టికల్స్ కాకుండా, ఫ్రీ ఆర్టికల్స్ రాస్తున్నాయి.

ఢిల్లీలో రాహులబ్బాయికి నచ్చినప్పుడు రోడ్డుమీదకొచ్చి యాగీ చేస్తు, ట్రాఫిక్‌ను స్తంభిస్తున్నట్లే.. తెలంగాణలో కూడా రేవంత్ సర్కారు, విపక్షాలకు అలాంటి బంపర్ ఆఫర్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఓ లీకు వార్త. స్వేచ్ఛ ప్రజాప్రభుత్వ ఏడవ గ్యారంటీ కాబట్టి, విపక్షాలకు ఆపాటి స్వేచ్ఛ ఇవ్వకపోతే బాగుండదని భావించారట.

కాంగ్రెస్ పాలిత తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నిస్తున్న గళాలను అణచివేస్తున్న కాంగ్రెస్.. తనకు మాత్రం ఢిల్లీలో మోదీని విమర్శించే విషయంలో స్వేచ్ఛ కావాలని కోరుకోవడమే అత్యాశ. అనైతికం. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఒక విపక్ష నేత ఫాంహౌసుకు పోలీసుల సాయంతో దండయాత్రకు పంపించడం న్యాయమయితే.. ఢిల్లీలో రాహుల్ అండ్ కో మీద పోలీసుల అణచివేత కూడా సబబే అన్నది బుద్ధిజీవుల వాదన. అదేదో తన పార్టీ పాలిత రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యవాదుల స్వేచ్ఛకు అవకాశమిస్తే, కాంగ్రెస్ విమర్శకుల చేతికి చిక్కేది కాదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రశ్నించే గొంతులను నొక్కేసి, విపక్షాలపై దాడులు చేస్తున్న అదే కాంగ్రెస్.. ఢిల్లీ నడివీధిలో ప్రజాస్వామ్య కబుర్లు చెప్పడం.. రాజ్యాంగ సూత్రాలు విప్పడం ఈ దశాబ్దాపు అతిపెద్ద జోకు అన్నది విజ్ఞుల ఉవాచ.

అయినా ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోయాయని కాంగ్రెస్ హస్తినలో హడావిడి చేస్తోందో అర్ధం కాదు. సర్‌లో ఆ కోల్పోయిన ఓట్లేమిటో.. ఆ బాధితులెవరో.. వాళ్ల ఓట్లు ఎందుకు తీసేశారో ఆధారాలివ్వాలన్న రాష్ట్రపతి ప్రశ్నకు సమాధానమిచ్చి.. ఇదిగో మా ఆరోపణలకు ఆధారాలని షంషేర్‌గా సమాధానం ఇచ్చి ఉంటే తల్లీబిడ్డ న్యాయం. అవేమీ ఇవ్వకుండా.. ఉత్తిగా చేతులూపుకుంటూ ఒక వినతిపత్రం రాష్ట్రపతిభవన్ ముఖాన పడేస్తే ఏం ఫాయిదా? అంటే రోహింగ్యాలకు, ఒక్కోరికి మూడేసి ఓట్లు ఉన్నా కాంగ్రెస్‌కు ఫర్వాలేదా అన్నది మెడమీద తల ఉన్న వారి ప్రశ్న.

Total Visitors: 2,951,125