గుంటూరు ‘మేయర్’పై తమ్ముళ్ల గరం

- ‘వాళ్లు’ వద్దంటూ సోషల్‌మీడియా యుద్ధం
- మా త్యాగాలు మర్చిపోయారా అంటూ కన్నెర్ర
- గుంటూరులో పార్టీజెండా మోసిన నేతలే లేరా?
- పార్టీని అవమానించి వారిని అందలమెక్కిస్తారా?
- కష్టకాలంలో జెండా మోసిన వారికి ఇదేనా విలువ?
- మేయర్ ఎంపికలో మా వాదన వినరా?
- వైసీపీ మాజీలను మాపై రుద్దుతారా?
- వాళ్లు ఓడిపోతే ఆ బాధ్యత తమది కాదంటూ స్పష్టీకరణ
- వైసీపీ నుంచి వచ్చిన వారికి మేయర్ వద్దంటూ గుంటూరు తమ్ముళ్ల గరం
(సుబ్బు)
గుంటూరు: త్వరలో జరగనున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్ధి ఎంపికలో నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు-ప్రాతిపదికను తెలుగు తమ్ముళ్లు తూర్పారపడుతున్నారు. డబ్బున్నవాళ్లకు సీట్లిస్తూ పోతే, ఇక వైసీపీతో రోజూ యుద్ధం చేసే కార్యకర్తకు మీరిచ్చే విలువేంటి? డబ్బున్నవాళ్లతో పార్టీని నడిపిస్తారా? డబ్బే పదవులకు ప్రాతిపదికనా? మేయర్ ఎంపికలో మా వాదన వినరా? వైసీపీ మాజీలను మాపై రుద్దుతారా?
కష్టకాలంలో జెండా మోసిన మా వాదన వినకుండా, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మన పార్టీని అవమానించిన కుటుంబానికి, ఇప్పుడు మేయర్ సీటు ఇస్తే ఏ ముఖంతో పనిచేయాలి? ఎలా గెలిపించుకోవాలి? ఇదేనా మాకు నాయకత్వం ఇచ్చే విలువ? వాళ్లు ఓడిపోతే మా బాధ్యత లేదు. మాకూ ఆత్మగౌరవం ఉంది అంటూ సోషల్‌మీడియా వేదికగా విరుచుకుపడుతున్న వైనం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
కార్పొరేట్ ఆసుపత్రి- విద్యాసంస్ధల యజమాని భరత్‌రెడ్డి.. రేపటి ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన తన భార్య భీమనాదం శివ శిరీషకు మేయర్ సీటు ఇప్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయన్న ప్రచారంపై టీడీపీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. వైసీపీ జమానాలో సజ్జల రామకృష్ణారెడ్డి వర్గీయుడిగా పేరొందిన భరత్‌రెడ్డి, ఇప్పుడు మళ్లీ ఒక యువనేత కోటరీలోకి ప్రవేశించి.. అక్కడ నుంచి మేయర్ సీటు ఖరారు చేసుకున్నారన్న చర్చ జరుగుతోంది.
ఎన్నికల ఖర్చు మొత్తం పెట్టుకుంటారన్న హామీతో భరత్‌రెడ్డి భార్యకు సీటు ఖరారు చేశారని, ఇదంతా ‘పై’స్థాయిలో జరిగిన ఒప్పందమంటూ జరుగుతున్న ప్రచారంపై.. తమ్ముళ్లు కారాలు, మిరియాలు నూరుతున్నారు.
దీనిపై టీడీపీ కార్యకర్తలు సోషల్‌మీడియా వేదికగా పోస్టింగుల యుద్ధానికి తెరలేపారు. వారికి టికెట్ ఇస్తే తమ త్యాగాలను అవమానించినట్లేనని.. పార్టీ కోసం తాము చేసిన త్యాగాలకు విలువలేనట్టేనంటూ తమ పోస్టింగుల్లో విరుచుకుపడుతున్నారు.
ఇంతపెద్ద గుంటూరు నగరంలో మేయర్ సీటుకు అర్హులైన పార్టీ నాయకులెవరూ లేక డబ్బుందని వైసీపీ నుంచి వచ్చిన వారిని తెచ్చుకుంటారా? ఇక చివరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా డబ్బున్న వారికే సీటు ఇస్తే మరి పార్టీ జెండా మోసే కార్యకర్తను అందలమెక్కించేది ఎప్పుడు? కార్యకర్త కార్యకర్తగానే ఉండిపోవాలా? అంటూ పోస్టింగుల్లో విరుచుకుపడుతున్నారు.
‘ ఇప్పుడు పార్టీ పూర్తిగా కమర్షియలయిపోయింది. ఇప్పుడు డబ్బున్న వారికే ప్రాధాన్యం. ఎవరిని పట్టుకుంటే పనులవుతాయో డిలిజన్ స్థాయి నాయకుడికీ తెలిసిపోయేంతగా పార్టీ మారిపోయింది. ఇది దీర్ఘకాలంలో పాన్టీకి నష్టం. పనిచేస్తే పదవులివ్వడానికి అన్నగారి రోజులు కావివి. కొద్దికాలం తర్వాత కార్యకర్తల స్థానంలో, డబ్బులిచ్చి తెచ్చుకునే టీములు వచ్చినా ఆశ్చర్యం లేద’ంటూ పోస్టులలో తమ ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. గతంలో భరత్‌రెడ్డి అప్పటి సీఎం జగన్ హెలికాప్టర్‌లో ప్రయాణించిన ఫొటో పెట్టారు.
గుంటూరు మేయర్ సీటుపై తమ్ముళ్ల సోషల్‌మీడియా పోస్టింగుల్లో వైరలవుతున్న ఒక కీలక కథనం యథాతధంగా..
గుంటూరు మేయర్ అభ్యర్థి ఎంపికపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం పునరాలోచించాలి!
పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు న్యాయం జరగాలి… పార్టీకి ద్రోహం చేసినవారికి ప్రాధాన్యం ఇవ్వకూడదు!
గౌరవనీయులైన తెలుగుదేశం పార్టీ అధిష్ఠానానికి, పెద్దలకు నా వినమ్ర విజ్ఞప్తి.
గుంటూరు నగర మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పార్టీ కార్యకర్తల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
గతంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన వ్యక్తి కుటుంబానికి మేయర్ పదవి ఇవ్వాలనే ఆలోచన నిజమైతే, పార్టీ పెద్దలు ఈ అంశంపై ఒకసారి పునరాలోచించాలి.
తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం నిలబడిన కార్యకర్తల త్యాగాలను అంత తేలికగా మర్చిపోవాలా? పార్టీ ఓడిపోయిన సమయంలో గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ వద్ద సైకిల్‌ను అవమానకరంగా ప్రదర్శిస్తూ తీసుకెళ్లిన ఘటనను కార్యకర్తలు ఇంకా మర్చిపోలేదు. అలాంటి దురాగత రాజకీయ పరిణామాలను పార్టీ పెద్దలు కూడా గుర్తు చేసుకోవాలి.
ఎవరైనా ఇతర పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలోకి రావచ్చు. వారిని మేము వ్యతిరేకించడం లేదు. కానీ పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యం ఇచ్చే ముందు, వారి గత రాజకీయ ప్రస్థానం ఏమిటి?గతంలో తెలుగుదేశం పార్టీ పట్ల వారి వైఖరి ఏమిటి? పార్టీ కష్టకాలంలో వారు ఏ విధంగా వ్యవహరించారు? అనే అంశాలను పరిశీలించాల్సిన బాధ్యత అధిష్ఠానంపై ఉంది.
పార్టీ కోసం పోరాడిన కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కేవలం పుకార్లే అయి, వాస్తవం కాకపోతే మేము సంతోషిస్తాము. కానీ అవే వార్తలు నిజమైతే, పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతున్న కార్యకర్తల హృదయాలు తీవ్రంగా గాయపడతాయి.
కాబట్టి పార్టీ పెద్దలకు కార్యకర్తల తరపున నా విజ్ఞప్తి:
- మేయర్ అభ్యర్థి ఎంపికకు సంబంధించిన వార్తల వాస్తవాలను పరిశీలించండి.
- సంబంధిత వ్యక్తుల గత రాజకీయ ప్రస్థానంపై సమగ్రంగా విచారణ జరపండి.
- పార్టీ కోసం నిరంతరం పనిచేసిన మహిళా నాయకులకు, నిబద్ధత కలిగిన కార్యకర్తల కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వండి.
- పార్టీ కోసం తమ కుటుంబాలను సైతం అంకితం చేసిన వారి సేవలను గుర్తించి, తగిన గౌరవం కల్పించండి.
గుంటూరు మేయర్ పదవి అనేది కేవలం ఒక పదవి మాత్రమే కాదు. అది తెలుగుదేశం పార్టీ నిబద్ధతకు, కార్యకర్తల కష్టానికి, ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలవాలి.
మా డిమాండ్ ఒక్కటే..
గుంటూరు మేయర్ అభ్యర్థిని ఎంపిక చేసేటప్పుడు పార్టీకి చేసిన సేవలను, గత రాజకీయ వైఖరిని, కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోవాలి. పార్టీ కోసం పనిచేసిన వారికి న్యాయం జరగాలి. నిబద్ధతకు గుర్తింపు రావాలి. కార్యకర్తల ఆత్మగౌరవం కాపాడబడాలి.
ఇదే తెలుగుదేశం పార్టీ అభిమానిగా, కార్యకర్తల పక్షాన నా మనస్ఫూర్తి విజ్ఞప్తి. - మీ…కూటమి పార్టీల కార్యకర్తలు నాయకులు
