జగన్ గ్రాఫ్‌పై నిజం చెప్పిన తలసాని

- యాదవుల సమస్యను నా తమ్ముడు లోకేష్‌కు చెప్పి పరిష్కరిస్తానన్న తలసాని
మంగళగిరిలో ఇటీవల జరిగిన సదర్ ఉత్సవాల వేదికగా తెలంగాణ మాజీ మంత్రి,బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
సదర్ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన తలసాని..ఏపీలో వైసీపీ పరిస్థితి, మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి పొలిటికల్ గ్రాఫ్‌పై స్పష్టమైన సంకేతాలిచ్చారు. గతంలో 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా మాట్లాడిన ఆయన, ఇప్పుడు పూర్తిగా మాట మార్చడమే కాకుండా, సభలో అసలు జగన్ పేరును ఉచ్ఛరించకపోవడం గమనార్హం.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌పై తలసాని ప్రశంసల వర్షం కురిపించారు. నా తమ్ముడు లోకేష్ మంత్రిగా ఉన్నారు. యాదవులకు అవసరమైన ఏ పనైనా సరే తమ్ముడికి చెప్పి నేనే స్వయంగా చేయిస్తానంటూ లోకేష్‌తో తనకున్న సాన్నిహిత్యాన్ని, ఆయనపై ఉన్న నమ్మకాన్ని బహిరంగంగా వ్యక్తపరిచేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో యాదవుల అభ్యున్నతికి, సంక్షేమానికి మంత్రి నారా లోకేశ్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. యాదవ సామాజిక వర్గమంతా ఐక్యంగా ఉంటూ అన్ని రంగాల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చిన ఆయన, యాదవుల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో యాదవుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే సదర్ ఉత్సవాలను మంగళగిరిలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.
మంగళగిరిలో జరిగిన ఈ సదర్ వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. ఈ పోటీల్లో సుమారు ఐదు రకాలకు చెందిన భారీ, ప్రత్యేక జాతి దున్నపోతులు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అందంగా అలంకరించిన దున్నపోతుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లు, సాంస్కృతిక నృత్యాలతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ఈ వేడుకలను తిలకించేందుకు స్థానికులు, యాదవ సంఘాల నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
2019 ఎన్నికల టైంలో వైసీపీకి మద్దతుగా నిలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ..స్వయంగా ఏపీకి వచ్చి, జగన్ ఊసు ఎత్తకుండా కేవలం చంద్రబాబు పాలనను, లోకేష్ పనితీరును ప్రశంసించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ రాజకీయాల్లో జగన్ గ్రాఫ్ ఏంటో ఈ పరిణామాలే స్పష్టం చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
