డాక్టర్లు, లాయర్లు ఎప్పటికప్పుడు చదువుతూ అప్ డేట్ అవుతూ వుంటారు. కానీ అధ్యయనం అవసరంలేని వృత్తి జర్నలిజమేనేమో.
ఇక ఒకసారి జర్నలిస్టు అయ్యాక అధ్యయనం అవసరం లేదనుకునే జర్నలిస్టులు చాలా మంది.
బహుశా అందులో ఒకరు ఈరోజు ఆర్కే మరణం మీద చర్చ పెట్టిన టీవీ 9 ఏంకర్.
ఎవరితో మాట్లాడుతున్నాం, వారి విద్వత్తు ఏమిటి? ఏదో రంగంలో వాళ్ళు ఎంత కృషి చేసివుంటారు? ఏదైనా సబ్జెక్టు మీద వాళ్లకి ఎంత జ్ఞానం వుండివుంటుంది?
సందర్భం ఏమిటి? వారు ఎలాంటి మానసిక పరిస్థితిలో వున్నారు? ఈ సందర్భంలో అడగాల్సిన ప్రశ్నలేమిటి? హరగోపాల్, పాణి, శిరీష గారి లాంటి వాళ్ల దగ్గర ఏమైనా తెలుసుకోవచ్చా, ఏమైనా నేర్చుకోవచ్చా? చర్చ ద్వారా ప్రజలకు ఏమైనా చెప్పవచ్చా – – అని ఆలోచన లేకుండా..
ఆయన దేహాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది?
అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటి? సీపీఐ, సీపీఎం పార్టీల్లా మీరు పోరాటాలు (అవును, మీరు విన్నది కరెక్టే.) చెయ్యొచ్చు కదా? – – ఇవీ ప్రశ్నలు.
–ఇంకా నయం మీరెందుకు చంద్రబాబుతో అలయెన్స్ లు పెట్టుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ తో కలిసి నడవొచ్చు కదా సీపీఐ, సీపీఎం పార్టీల్లా – – అని అడగలేదు.
ఎవరినైనా పెద్ద సైంటిస్టులని, సామాజిక కార్యకర్తల్ని, మేథావుల్ని ఇంటర్వ్యూ చేసినపుడు ఆ రంగాల్లో పరిచయం వున్న కోలీగ్స్ తో మిత్రులతో ముందుగా మాట్లాడి informed ప్రశ్నలను అడగాలి.
కరణ్ థాపర్, ఓప్రా విన్ఫ్రే లాంటి ఉద్దండులైన జర్నలిస్టులు కూడా టీమ్ సభ్యులతో పరిశోధన చేయించి చర్చలు చేస్తారు.
అవతలి వారు ఏదో ఒక కాజ్ కోసం జీవితం వెచ్చించి వుంటారు. వాళ్లు ప్రాతినిధ్యం వహించే ఉద్యమం ఒక దేశపు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక చరిత్రని, గతిని ప్రభావం చూపి ఉంటుంది – – అన్న స్పృహ వుండాలి. అణకువ ఉండాలి.
మరణించిన వాడు ఓ నలభై ఏళ్లు ప్రజలకోసం మాత్రమే బతికాడు, ప్రజల తరఫున ప్రభుత్వంతో చర్చలు జరపడానికి వెళ్లాడన్న ఎరుక వుండాలి.
– మనకి అన్నీ తెలిసివుండాలన్న రూలేమీ లేదు. కానీ తెలుసుకోవాల్సిన బాధ్యత వుండాలి.
మన ఎదురుగా కూర్చున్నారు కదా అని వాళ్లకి సమానమైన జ్ఞానం వున్నట్టు కాదు.