Suryaa.co.in

Andhra Pradesh Education

సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే అద్భుతాలు

– విహాన్‌ ఎలక్ట్రిక్స్‌ ఫౌండర్, సీఈవో ఎన్‌.వెంకటరెడ్డి
– విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ఇగ్నిషన్‌–2021
విద్యార్థి దశలోనే సయమాన్ని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో అద్భుతాలు సృష్టించవచ్చునని విశాఖపట్నంలోని విహాన్‌ ఎలక్ట్రిక్స్‌ ఫౌండర్, సీఈవో ఎన్‌.వెంకటరెడ్డి తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలో బుధవారం ఎంట్రపెన్యూర్‌ సెల్‌ ఆధ్వర్యంలో ‘‘ఇగ్నిషన్‌–2021’’ అనే అంశంపై విద్యార్థులకు ఆన్‌లైన్‌లో అవగాహన సదస్సును నిర్వహించారు.
వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎన్‌.వెంకటరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు పారిశ్రామిక రంగంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే ఉత్పత్తి లేదా సేవా రంగాలలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలన్నారు. పారిశ్రామికరంగంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు దీర్ఘకాల, స్వల్పకాలిక వ్యూహాలు అవసరమని తెలిపారు.
విద్యార్థులు ఇండస్ట్రీ 4.0పైన అవగాహన పెంపొందించుకోవాలన్నారు. అలాగే ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్, టైమ్‌ మేనేజ్‌మెంట్, టీమ్‌ బిల్డింగ్‌ అనే అంశాలపైన సుదీర్ఘంగా చర్చించాలన్నారు. వై ద పర్పస్, హౌ ద ప్రాసెస్, వాట్‌ ద రిజల్ట్‌ అనే అంశాలను విపులీకరించారు. పారిశ్రామిక రంగంలో వనరుల సమీకరణ కూడా ఒక వ్యూహమని తెలిపారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ ఈసెల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.నాగేశ్వరరావు, విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE