– మంత్రి అప్పలరాజుపై చర్య తీసుకోవాలని డిమాండ్
– కేసు పెట్టాలన్న డిమాండు లేదు, బర్తరఫ్ ఊసు లేదు
– డీజీపీ, హోంమంత్రినీ కలిసిందీ లేదు
– అధికారుల సంఘం తీరుపై పోలీసన్నల పెదవి విరుపు
( మార్తి సుబ్రహ్మణ్యం)
మంత్రి సిదిరి అప్పలరాజు విశాఖ పీఠం వద్ద డ్యూటీలో ఉన్న సీఐని బండబూతులు తిట్టిన ఒకరోజు తర్వాత..ఏపీ పోలీసు అధికారుల సంఘం ఎట్టకేలకూ స్పందించింది. అధికారిని దూషించిన సదరు మంత్రిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ను కోరుతూ ఒక ప్రకటన విడుదల చేసింది.మంచిదే. తమ సాటి అధికారికి జరిగిన అవమానానికి తీరికూర్చుని, 24 గంటల తర్వాతయినా స్పందించి, దూషణలకు పాల్పడిన మంత్రిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్న ధైర్యం మెచ్చతగిందే.ఇది కూడా చదవండి: అప్పలరాజు గోరికి బీపీ పెరిగింది..తిట్టేసినాడు..మరేటి సేత్తాం?!
ఈ పనేదో ఘటన జరిగిన వెంటనే చేసి ఉంటే పోలీసు అధికారుల సంఘం చిత్తశుద్ధి హిమాలయమంత ఎత్తుకు పెరిగేది. లేటుగా అయినా లేటెస్టుగా స్పందించినందుకు, అధికారుల సంఘాన్ని అభినందించాల్సిందే. అయితే ఈ స్పందనకు 24 గంటలకు పైగా ఎందుకు సమయం తీసుకున్నారన్నదే పోలీసుశాఖలో పనిచేసే వారి ప్రశ్న. పోనీ ఆ ప్రకటనయినా నిలువుగా, నిటారుగా ఉందా అంటే అదీ లేదన్నది పోలీసన్నల పెదవి విరుపు.
ఇంతకూ పోలీసు అధికారుల సంఘం విడుదల చేసిన ప్రకటన సారాంశం ఏమిటంటే.. ‘విధి నిర్వహణలో ఉన్న అధికారిని మంత్రి అప్పలరాజు దూషించి దాడి చేయడం అత్యంత దురదృష్టం. దీనిని మా సంఘం
తీవ్రంగా ఖండిస్తోంది. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ, బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి, విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిని దూషించడం చాలా దురదృష్టకరం. జరిగిన ఘటనపై సీఎంగారు విచారించి తగు చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నాం’. ఇదీ పోలీసు అధికారుల సంఘం విడుదల చేసిన పత్రికా ప్రకటన.
విధి నిర్వహణలో ఉన్న సీఐని దూషించిన మంత్రిని.. పదవి నుంచి తొలగించాలని గానీ, ఆయనతో పోలీసు శాఖకు క్షమాపణ చెప్పించాలని గానీ, సీఐని దూషించిన మంత్రిపై ఎస్పీ ఎస్టీ అట్రాసిటీ కేసు
పెట్టాలని గానీ సంఘం నేతలు డిమాండ్ చేసి ఉంటారేమోనని భూతద్దం పెట్టి వెతికినా, అలాంటి పదాలు ఆ ప్రకటనలో కనిపించకపోవడం ఆశ్చర్యకరం. జరిగిన ఘటనపై మిన్నకున్నందున, సొంత శాఖలో అన్ని వేళ్లూ తమ వైపు చూపిస్తున్నాయన్న ఆందోళనే అందులో కనిపించింది తప్ప, జరిగిన అవమానంపై అటో ఇటో తేల్చుకోవాలన్న తపన, ఇసుమంతయినా కనిపించలేదన్నది కొందరు పోలీసన్నల ఉవాచ.
ఖాకీవనంపై తరచూ జరిగే ఇలాంటి ఘటనలపై అధికారుల స్పందన సందర్భానుసారంగా ఉండటమే అందరి ఆక్షేపణలకు కారణం. ఇటీవలి కాలంలో తెదేపేయులు డీజీపీపై చేసిన విమర్శలకు ఆగమేఘాలపై స్పందించి ప్రెస్మీట్లో ఖండించిన సంఘం నేతలు, ఇప్పుడుతమ సొంత శాఖ మనిషిపై మంత్రి దాడి చేస్తే అదే పని ఎందుకు చేయలేదో తమకు అర్ధం కావడం లేదని పోలీసన్నలు వాపోతున్నారట.
పోనీ పోలీసు అధికారుల సంఘం ఈ ఘటనపై స్పందించి.. మంత్రిగారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీని గానీ, హోంమంత్రిని గానీ కలసి వినతిపత్రం సమర్పిస్తుందని పోలీసు శాఖలో చాలామంది ఆశించారు. గతంలో టీడీపీ నేత వర్ల రామయ్య వ్యాఖ్యలు, టీడీపీ ఆఫీసుపై దాడి చేసినప్పుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, గంజాయి రవాణాపై లోకేష్ వ్యాఖ్యల తర్వాత ఇదే పోలీసు అధికారుల సంఘం ఆ పార్టీపై తీవ్రంగా మండిపడింది. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. సంఘ నాయకుడయితే వర్ల రామయ్యకు తొడగొట్టిన సవాల్ చేసిన వీడియోలు చూసినవే. ఇప్పుడు కూడా తమ సంఘం నేతలు అదే
స్థాయిలో మంత్రి అప్పలరాజు తీరుపై విరుచుకుపడతారని పోలీసు అధికారులు ఆశించారు. కానీ దానికి భిన్నంగా ఒక పత్రికా ప్రకటన విడుదల చేసి, చేతులు దులిపేసుకోవడం పోలీసన్నలకు రుచించలేదట.