Suryaa.co.in

Editorial

కొత్త డీజీపీ కసిరెడ్డికి సమస్యల తో‘రణం’

– సాత్వికుడి ముందు బోలెడు సవాళ్లు
– పోలీసుల ప్రతిష్ఠ పెంచుతారా?
– ఒత్తిళ్లు అధిగమించడమే పెద్ద సమస్య
( మార్తి సుబ్రహ్మణ్యం)

కసిరెడ్డి రాజేంద్రనాధ్‌రెడ్డి. ఏపీ పోలీసు దళానికి తాత్కాలిక డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన కసిరెడ్డి ఇప్పటివరకూ వివాదరహిత అధికారి. సాత్వికుడన్న పేరు. సాదాసీదా జీవన శైలి, భేషజాలు కనిపించని అధికారనే కీర్తి. ఇదంతా ‘ఇప్పటివరకూ’ ఆయన పదిలంగా కాపాడుకుంటూ వస్తున్న ప్రతిష్ఠ. ‘ఇకపై’ ఆయన పనితీరు, నిర్ణయాలు ఎలా ఉంటాయన్న దానిపైనే కసిరెడ్డి కాపాడుకుంటూ వస్తున్న ప్రతిష్ఠ ఆధారపడి ఉంటుంది.

ఇప్పటివరకూ కసిరెడ్డికి ముందున్న సీటులో కూర్చున్న గౌతం సవాంగ్ కూడా.. ఇప్పటి కసిరెడ్డి మాదిరిగానే, రెండున్నరేళ్ల ముందు వరకూ వివాదరహిత అధికారి. కానీ ఆ రెండున్నరేళ్లలోనే ఆయన
sawang1 కాపాడుకున్న వివాదరహిత ముద్ర చెరిగి, వివాదాస్పద ముద్ర పడేందుకు కారణమయింది. అందుకు ఆయన తీసుకున్న నిర్ణయాలు, సున్నిత ఘటనలలో చేసిన వ్యాఖ్యలు, అధికార పార్టీ నేతలను కాపాడే యత్నంలో విపక్షాలను జైళ్లకు పంపించారన్న ఆరోపణలే కారణం.

అంతకుముందు.. కసిరెడ్డి మాదిరిగానే తన పని తాను చేసుకుని వెళ్లే అధికారిగా పేరున్న సవాంగ్, చివరకు హైకోర్టు ముందు అనేకసార్లు నిలబడవలసి వచ్చింది. నిజానికి సవాంగ్‌కు ఎలాంటి సంబంధం లేకపోయినా.. కింది స్థాయి పోలీసు అధికారులు, అధికార పార్టీతో అంటకాగిన ఫలితం సవాంగ్ ఆ రకంగా అనుభవించవలసి వచ్చింది. అదే కింది స్థాయి అధికారులను నియంత్రించి, రాజకీయ ఒత్తిళ్లను లెక్కచేయకుండా ఉంటే, ఆ పరిస్థితి వచ్చేది కాదన్నది అధికారుల అభిప్రాయం. అది వేరే విషయం!

ఇప్పుడు కొత్త దళపతిగా వచ్చిన కసిరెడ్డి రాజేంద్రనాధ్‌రెడ్డికీ ఇలాంటి సవాళ్లు, సమస్యలే పొంచి ఉన్నాయి. ప్రధానంగా ఇప్పుడు ఏపీలో ఎస్‌ఐ నుంచి డీఎస్పీల వరకూ అందరూ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలతో ఆయా ప్రాంతాల్లో పోస్టింగ్ తెచ్చుకున్నవారే. కాబట్టి వారంతా సహజంగా సదరు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు విధేయులుగా ఉంటారు. ఉండి తీరాలి కూడా. ఇది గత ప్రభుత్వంలోనూ జరిగింది. చాలా పోలీసుస్టేషన్లను ఆయా అధికారుల కంటే.. ఎమ్మెల్యేలో, వారి కొడుకులో, తమ్ముళ్లో, బామ్మర్దులో శాసిస్తున్నారు. వైసీపీ

ఎమ్మెల్యే శ్రీదేవి ఓ పోలీసు అధికారిని ఫోన్‌లో హెచ్చరించిన ఆడియోతోపాటు, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి సోదరుడు ఓ పోలీసును బూతులు తిట్టిన ఆడియోను కూడా ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు పోలీసులను తిట్టిన బూతుపంచాంగం, ఈ రెండున్నరేళ్లలో ఆంధ్రా ప్రజలను శ్రవణానంద పరిచాయి.

ఇటీవలే విశాఖలో మంత్రి అప్పలరాజు ఓ సీఐని బూతులు తిట్టినా ఆయనపై కేసులు లేవు. కొద్దిరోజుల క్రితమే విజయవాడలోని ఓ పోలీసుస్టేషన్‌కు వచ్చిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అనుచరులు చేసిన రచ్చ మీడియాలోనూ వచ్చింది. అయినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడమే ఇప్పుడు కసిరెడ్డి ముందున్న సవాల్. ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసిన కళంకిత అధికారులను బదిలీ చేస్తే, ప్రజాప్రతినిధుల నుంచి సహజంగానే ఒత్తిళ్లు-ప్రతిఘటన తప్పదు. అది చేస్తే తప్ప ‘శాంతికి’ భద్రత ఉండదు. మరి దానిపై కసిరెడ్డి ముద్ర ఎలా ఉంటుందన్నది మరో పరీక్ష.

గత రెండున్నరేళ్లలో డీజీపీ నుంచి సీఐ స్థాయి అధికారులు కోర్టు బోనెక్కాల్సి వచ్చింది. దాదాపు 1600 కేసులు పోలీసులకు వ్యతిరేకంగా నమోదుకాగా.. అందులో డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ అధికారులు కోర్టు తీర్పుతో సస్పెండ్ కావలసివచ్చింది. చివరాఖరకు అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతో ఎస్సీలపై కూడా ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి, జడ్జిల ఆక్షేపణలు-అక్షింతలకు గురయి నగుబాటుపాలవాల్సి వచ్చింది. విశాఖలో డాక్టర్ సుధాకర్ కేసు నుంచి సామర్లకోట, శ్రీకాకుళం, చీరాలలో దళితుడికి గుండు చేసిన ఘటన వరకూ పోలీసులు సస్పెండ్ కావలసి రాగా, అందులో పోలీసుల చేతిలో పరాభవం పాలయిన వారిలో దళితులే ఎక్కువమంది ఉండటం మరో మచ్చ.

ఇక దేశంలోనే సంచలనం సృష్టించిన ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు వ్యవహారంలో, పోలీసు శాఖ సాధ్యమైనంత మేరకు అప్రతిష్ఠకు గురయింది. రాజు తనను పోలీసులు కొట్టారని, అందులో సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కూడా ఉన్నారంటూ, ఏకంగా లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీకి చేసిన ఫిర్యాదు ఇంకా అక్కడే ఉంది. తనను సీఐడీ పోలీసులు కొట్టారంటూ ఎంపీ రాజు, జడ్జికి గాయాలు చూపించడం పోలీసు ప్రతిష్ఠకు మాయనిమచ్చ. సస్పెండయిన డీజీ ఏబీ వెంకటేశ్వరరావుకూ సోదాల విషయంలో మినహాయింపులుగానీ, వేధింపుల్లో డిస్కౌంట్లు గానీ ఇవ్వకపోవడం మరో ప్రత్యేకత. టీడీపీ నేత పట్టాభిరాం తనను పోలీసులు అరెస్టు చేసే సందర్భంలో.. తన ఒంటిపై ఎలాంటి గాయాలు లేవంటూ ఏకంగా ఒక వీడియో విడుదల చేశారంటే, పోలీసుల ఇమేజ్-రక్షకభటులన్న పేరు ఏ స్థాయిలో డామేజీ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఈ రెండున్నరేళ్లలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే, పక్కరాష్ట్రాలకూ వెళ్లి అత్యుత్సాహంతో అర్ధరాత్రి తలుపులు విరగ్గొట్టి అరెస్టు చేసిన కేసులే అధికం. చివరాఖరకు సీఎం జగన్‌కు సలహాదారుగా, ఆయన పేషీలో పనిచేసిన సీనియర్ ఐఏఎస్ రమేష్‌కే పోలీసుల వేధింపులు తప్పలేదు. వీరిలో ఎక్కువమంది విపక్ష పార్టీలకు చెందిన వారు కావడంతో, పోలీసులపై ఒత్తిళ్లు ఏ స్థాయిలో పనిచేస్తున్నాయో సుస్పష్టం. అరె స్టు చేసే ముందు నోటీసు ఇవ్వాలన్న కోర్టు ఆదేశాలను అమలుచేయించే పరిస్థితిలో, పోలీసు బాసులు లేరన్నది నిష్ఠుర సత్యం. ఈ రాజకీయ ఒత్తిళ్ల పరిస్థితి నుంచి పోలీసులను కాపాడి, వారి పని వారిని చేసుకునే వాతావరణం కల్పించడమే ఇప్పుడు కొత్త దళపతి కసిరెడ్డి ముందున్న పెనుసవాల్.

ప్రధానంగా తాత్కాలిక డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న కసిరెడ్డికి మూడు కీలకమైన కేసులు అగ్నిపరీక్షగా మారాయి. విశాఖ పీఠం వద్ద డ్యూటీ చేస్తున్న సీఐని బూతులు తిట్టిన మంత్రి అప్పలరాజుపై.. కేసు పెట్టాలన్న డిమాండ్‌పై కొత్త దళపతి ఎలా స్పందిస్తారన్న ఉత్కంఠ అటు పోలీసులతో పాటు, ఇటు రాజకీయ వర్గాల్లోనూ కనిపిస్తోంది. ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పినట్లు.. తాజాగా బెజవాడ పోలీసుస్టేషన్‌లో ఎంపీ నందిగం సురేష్ అనుచరుల నిర్వాకంపై ఇప్పటిదాకా ఎలాంటి

చర్యలు లేవు. వారిపై చర్యలు తీసుకుని కసిరెడ్డి తన శీలపరీక్ష నిరూపించుకోవాలని ఎంపీ రాజు కూడా దాదాపు సవాల్ చేసినంత పనిచేశారు. మంత్రి కొడాలి నాని ఫంక్షన్‌హాల్‌లో జరిగిన కేసినోపైనా కేసుల్లేవు. ఈ మూడు అంశాల్లో కసిరెడ్డి తీసుకునే చర్యలపైనే ఆయన, భవిష్యత్తు నడక ఎలా ఉండబోతుందనేది స్పష్టమవుతుందన్నది పరిశీలకుల విశ్లేషణ.

ఇవికాక.. గత రెండున్నరేళ్లలో రాష్ట్రంలో సోషల్‌మీడియా పోస్టింగుల పేరుతో రాజకీయ ప్రత్యర్ధులపై జరుగుతున్న వేధింపులు, కేసులు, అరెస్టులు పోలీసు ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయి. వాటిని కొత్త తాత్కాలిక డీజీపీ ఏవిధంగా నివారించి, మానవ హక్కులు కాపాడతారో చూడాల్సి ఉంది. ఇక ప్రధానంగా సీఐడీ తీసుకుంటున్న నిర్ణయాలే పోలీసు వ్యవస్థను విమర్శలకు గురిచేస్తున్నాయి.

రాష్ట్రంలో ఇప్పటివరకూ వివాదాస్పదమైన ఘటనలకు సీఐడీ చర్యలే కారణమన్నది బహిరంగమే. నాలుగయిదు స్వతంత్ర విభాగాలు నేరుగా ముఖ్యమంత్రికే జవాబుదారీగా ఉంటాయి. దానితో ఆయా స్వతంత్రులు, డీజీపీలను ఖాతరు చేయరు. అయితే మాన్యువల్ ప్రకారం సీఐడీ విభాగం డీజీపీ పర్యవేక్షణలోనే ఉంటుంది. సీఐడీ బాసు నేరుగా డీజీపీకే రిపోర్టు చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి బాసుకు సీఎంతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో, ఆయన డీజీపీని పెద్దగా లెక్కచేసేవారు కాదన్న వ్యాఖ్యలు పోలీసు వర్గాల నుంచి వినిపించేది. సవాంగ్‌కు అదే విభాగం నుంచి శిరోభారం ఎదురయిందన్నది బహిరంగ రహస్యం. కొత్త డీజీపీ కసిరెడ్డికి ఇప్పుడు ఇదో అదనపు సమస్య. దాన్నెలా అధిగమిస్తారో చూడాలి. సీఐడీ విభాగం ఆయనకు రిపోర్టు చేస్తుందో లేదో చూడాల్సి ఉందని ఓ ఐపీఎస్ అధికారి వ్యాఖ్యానించారు.

వీటికిమించి.. తనకంటే 15 మంది సీనియర్లను కాదని, డీజీపీ పోస్టు ఇవ్వడం వెనుక ‘సామాజిక ప్రేమ’ కారణమంటూ.. అధికారపార్టీ రాజకీయ ప్రత్యర్ధులు చేస్తున్న విమర్శలు తప్పని నిరూపించుకోవడం కసిరెడ్డి ముందున్న అతిపెద్ద పరీక్ష. రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలుత తాత్కాలిక డీజీపీగా వ్యవహరించిన కమ్మవర్గానికి చెందిన జెవి రాముడు, గత ఎన్నికల ముందు నిఘా దళపతిగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు కూడా అప్పటి విపక్షమైన వైసీపీ నుంచి ఇలాంటి ‘కులం కోణంలో’ విమర్శలు, ఆరోపణలు ఎదుర్కోవలసి వచ్చింది.

ఇప్పుడు పాలక రెడ్డి సామాజికవర్గానికి చెందిన కసిరెడ్డి కూడా అలాంటి విమర్శలు-ఆరోపణలు ఎదుర్కోకుండా చూడటమే పెద్ద సమస్య. ఇప్పటికే ఎంతోమంది సీనియర్లు ఉన్నా జగన్ సర్కారు తన సామాజికవర్గానికి చెందిన కసిరెడ్డిని డీజీపీగా నియమించి, సామాజిక అన్యాయం చేసిందంటూ విపక్షం విమర్శలు ప్రారంభించడం ప్రస్తావనార్హం.

వీటిని అధిగమించి.. అర్హతలున్నా డీజీపీ పదవి దక్కని తనకంటే సీనియర్లను సమన్వయం చేసుకుని, పోలీసు శాఖపై ప్రజల్లో ఏర్పడ్డ భావనను ఎలా తొలగిస్తారన్న దానిపైనే.. కసిరెడ్డి ఇప్పటి వరకూ తెచ్చుకున్న ‘ప్రతిష్ఠ కొనసాగింపు’ అంశం ఆధారపడి ఉంటుంది. ఆయన వాటిని అధిగమించి, పోలీసులను ప్రజలకు చేరువ చేసి వారికి స్వేచ్ఛ ప్రసాదిస్తారని ఆశించడంలో తప్పులేదు.

LEAVE A RESPONSE